కాటేస్తున్న ఫ్లోరైడ్‌

ABN , First Publish Date - 2022-04-17T05:17:28+05:30 IST

భూగర్భజలాలు కలుషితం అయ్యాయని, నీటిలో మోతాదుకు మించి యురేనియం, ఫ్లోరైడ్‌ లాంటి ప్రాణాంతక రసాయనాలు ఉన్నట్లు కేంద్ర భూగర్భ జలాల విభాగం అధికారులు గతంలో జరిపిన పరిశోధనల్లో కనుగొన్నారు.

కాటేస్తున్న ఫ్లోరైడ్‌
నేడు నిరుపయోగంగా ఉన్న సీపీడబ్ల్యుఎస్‌ భవనం

మోకాళ్ల నొప్పులతో ప్రజల ఇబ్బందులు

నిరుపయోగంగా సీపీడబ్ల్యుఎస్‌ స్కీం

నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం

కోట్లు కుమ్మరించినా ప్రయోజనం శూన్యం


పెద్దతిప్పసముద్రం, ఏప్రిల్‌ 16 : భూగర్భజలాలు కలుషితం అయ్యాయని, నీటిలో మోతాదుకు మించి యురేనియం, ఫ్లోరైడ్‌ లాంటి ప్రాణాంతక రసాయనాలు ఉన్నట్లు కేంద్ర భూగర్భ జలాల విభాగం అధికారులు గతంలో జరిపిన పరిశోధనల్లో కనుగొన్నారు. దీంతో ప్రజలకు మంచినీరు అందించాలన్న ఆశయంతో 1999వ సంవత్సరంలో ప్రభుత్వం మండలంలోని టి.సదుం పంచాయతీలోని చెన్నరాయునిపల్లె సమీపంలో గల పాపాఘ్ని నది ఒడ్డున 1999వ సంవత్సరంలో రూ.6 కోట్ల రూపాయలు వెచ్చించి (కామన్‌ ప్రాజెక్ట్‌ వాటర్‌ స్కీమ్‌)ను ప్రారంభించింది. ఇక్కడ బోర్లు కూడా వేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మంచినీటిని అందించాలన్న ఆశయంతో నీటిని శుద్ధి చేసే యంత్రాలను ఏర్పాటు చేశారు. శుద్ధి చేసిన మంచినీటిని తంబళ్లపల్లె నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాలకు ఫ్లోరైడ్‌ రహిత మంచినీటిని  సరఫరా చేయాలని సంకల్పించారు. అయితే పథకం ప్రారంభమైన కొన్నేళ్లకే మోటార్లతో పాటు నీటిని సరఫరా చేసే పైపులు, గేట్‌వాల్స్‌, మోటార్లు తుప్పు పట్టిపోయాయి. అధికారుల పర్యవేక్షణాలోపంతో ప్రజలు ఫ్లోరైడ్‌ నీటినే తాగాల్సిన దుస్థితి నెలకొంది. ఫ్లోరైడ్‌ ప్రభావం అధికంగా ఉండడంతో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు నీటిని తాగడం వలన దంతాలు గార పట్టడం, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. మండలంలో అధికంగా ఫ్లోరైడ్‌ ఉన్న బెట్టకొండ, తాడిగొళ్ళపల్లె, రేకలకుంటపల్లె, గుగ్గిళ్లపల్లె, బండమీదపల్లె, ప్యాయలోళ్లపల్లె, వరకసువుపల్లె, నవాబుకోట, పెద్దపొంగుపల్లె, చెన్నరాయునిపల్లె, చిన్నపొంగుపల్లె తదితర గ్రామాలను అధికారులు గుర్తించారు. ఇవేకాక మల్లెల, ఉప్పరోళ్ళపల్లె, కందుకూరు, అగ్రహారం, చెట్లవారిపల్లె, మడుమూరు, తదితర గ్రామాల్లో ఫ్లోరైడ్‌ నీటిని శుద్ధి చేసేందుకు సంపులు కూడా నిర్మించారు. అయితే చాలాచోట్ల సంపులు నిరుపయోగంగా మారిపోయాయి. సంపుల్లో ఏర్పాటు చేసిన గేట్‌వాల్స్‌, తదితర పరికరాలు ఏమయ్యాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. గత ఏడాది అక్టోబరు నెలలో పాపాఘ్ని నదిలో ప్రవహించిన వరద నీటి ప్రవాహానికి సీపీడబ్ల్యుఎస్‌ పథకానికి అమర్చిన యంత్రాలు, పంపుసెట్‌లు, మోటార్లు నీటిలో కొట్టుకుపోయాయి. కాంపౌండ్‌ గోడ సైతం నీటి ప్రవాహానికి కూలిపోయింది. ఇప్పటికైనా ఈ పథకాన్ని వాడుకలోకి తీసుకొచ్చి ప్రజలకు ఫ్లోరైడ్‌ రహిత మంచినీటిని అందించాలని ప్రజలు కోరుతున్నారు.


ఆర్‌డబ్ల్యుఎస్‌ పరిధిలో లేదు

సీపీడబ్ల్యుఎస్‌ పథకాన్ని రెండు సంవత్సరాల క్రితమే పంచాయతీకి అప్పగించాము ఇప్పుడు అది పంచాయతీ పరిధిలో ఉంది. దాని నిర్వహణ బాధ్యతలు పంచాయతీనే చూసుకోవాలి. అది ఆర్‌డబ్ల్యుఎస్‌ పరిధిలో లేదు. 

- హరి, ఏఈ, ఆర్‌డబ్ల్యుఎస్‌, పీటీఎం మండలం


పంచాయతీలో నిధులు లేవు

సీపీడబ్ల్యుఎస్‌ స్కీం నిర్వహణకు ఏడాదికి 20 లక్షల రూపాయలు కావాలి. అంత నిధులు పంచాయతీలో లేవు. ఈ స్కీం తుమ్మరకుంట, టి.సదుం పంచాయతీలకు వర్తిస్తుంది. ప్రస్తుతం పంచాయతీల్లో ఉన్న బోర్లతోనే ప్రజలకు తాగునీరు అందిస్తున్నాము.

- -మనోహర్‌, పంచాయతీ కార్యదర్శి, టి.సదుం


కీళ్ళనొప్పులతో బాధ పడుతున్నాము

ప్రభుత్వం సరఫరా చేస్తున్న తాగునీటిలో ఫ్లోరైడ్‌ శాతం అధికంగా ఉండడం వల్ల కీళ్లనొప్పులతో బాధపడుతున్నాము. పిల్లలకు, పెద్దలకు పండ్లు గార కట్టడం మొదలగు సమస్యలతో బాధపడుతున్నాం. ప్రజలందరూ నీటిని తాగి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి మాకు శుద్ధి చేసి అందించాలి.

-క్రిష్ణమూర్తి



Updated Date - 2022-04-17T05:17:28+05:30 IST