కోతల బడ్జెట్‌!

ABN , First Publish Date - 2022-03-08T07:54:11+05:30 IST

తమది రైతు ప్రభుత్వమని సర్కారు చెబుతుంది! కానీ, వ్యవసాయ రంగానికి గత బడ్జెట్లో రూ.25 వేల కోట్లు కేటాయిస్తే..

కోతల బడ్జెట్‌!

  • ప్రజా సంక్షేమ పథకాలకు నిధుల కోత
  • వ్యవసాయ రంగానికి బడ్జెట్లో 750 కోట్లు కట్‌
  • కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌కు పెరగని నిధులు
  • 57 ఏళ్లు పైబడితే ఏప్రిల్‌ నుంచి పింఛన్లన్నరు
  • కానీ, ఆసరా పింఛన్లకు నిధులు పెంచలేదు
  • సొంత జాగాలో ఇల్లు కట్టుకుంటే ఇచ్చే మొత్తం రూ.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు కుదింపు
  • నిరుద్యోగ భృతి పథకానికి నీళ్లు వదిలినట్లే
  • విద్యుత్తు సబ్సిడీ అంతంతే.. బాదుడుకు సిగ్నలే
  • రూ.2.5 లక్షల కోట్ల బడ్జెట్లో 50 వేల కోట్లు కేంద్రం గ్రాంట్లు, రూ.60 వేల కోట్లు అప్పులు
  • ఈసారీ వాస్తవాలకు దూరంగా బడ్జెట్‌ లెక్కలు
  • కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు 10 వేల కోట్లలోపే
  • కానీ, 40 వేల కోట్లకుపైగా వస్తాయని అంచనా
  • భూముల అమ్మకాల్లో 15,500 కోట్ల అంచనా
  • అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మంత్రి హరీశ్‌

హైదరాబాద్‌, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): తమది రైతు ప్రభుత్వమని సర్కారు చెబుతుంది! కానీ, వ్యవసాయ రంగానికి గత బడ్జెట్లో రూ.25 వేల కోట్లు కేటాయిస్తే.. ఈసారి దాదాపు రూ.750 కోట్లు తగ్గించింది! ధాన్యం కొనుగోళ్ల ఊసు లేదు! పంటల బీమా ముచ్చట లేదు! ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి 57 ఏళ్లపైనున్న అందరికీ ఆసరా పింఛన్లు ఇస్తామని ప్రకటించింది! కానీ, బడ్జెట్లో ఆ మేరకు నిధులు పెంచలేదు! గత బడ్జెట్లో ఎంత కేటాయించారో.. ఇప్పుడు కూడా అంతే! కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకం గురించి గొప్పగా చెబుతుంది! కానీ, ఆ పథకానికి గత ఏడాది ఎంత కేటాయించారో ఈ ఏడాది కూడా అంతే కేటాయించారు. దానికి ఒక్క పైసా కూడా నిధులు పెంచకపోవడం గమనార్హం. ఈ బడ్జెట్లో కూడా నిరుద్యోగ భృతి ఊసు లేదు! అంటే, ఆ పథకం అమలుకు నీళ్లు వదిలేసినట్లే! ఇక, ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక డబుల్‌ బెడ్‌ రూం పథకం! సొంత జాగా ఉంటే ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు ఇస్తామని ఇప్పటి వరకూ చెప్పింది! ఇప్పుడు దానిని రూ.3 లక్షలకు పరిమితం చేసింది! సొంత జాగా ఉన్న 4 లక్షల మందికి రూ.3 లక్షల చొప్పున ఇస్తామని ప్రకటించింది! అంటే, ఇందుకు రూ.12 వేల కోట్లు కావాలి! కానీ, ఈ బడ్జెట్లో డబుల్‌ బెడ్‌ రూం పథకానికి మొత్తం కేటాయింపులే రూ.12 వేల కోట్లు! వ్యవసాయ విద్యుత్తు సబ్సిడీ కింద గత బడ్జెట్లో రూ.4,687 కోట్లు కేటాయించింది! ఈసారి దానిని రూ.4,415 కోట్లకు తగ్గించింది! అంతేనా, విద్యుత్తు శాఖకు ఇచ్చే సబ్సిడీలో కూడా ఎటువంటి మార్పు చేయలేదు! అదే సమయంలో, డిస్కమ్‌ల నష్టాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి! ఫలితంగా, విద్యుత్తు చార్జీల బాదుడుకు రంగం సిద్ధమైనట్లే! రాబోయే కొద్ది రోజుల్లోనే వినియోగదారులపై రూ.6000 కోట్లకుపైగా చార్జీల మోత మోగనుంది! గొర్రెల పంపిణీ పథకానికి గత బడ్జెట్లో రూ.6000 కోట్లు కేటాయిస్తే ఈసారి విదిల్చింది కేవలం వెయ్యి కోట్లు! తమకు నిధులివ్వండి మహా ప్రభో అని ఆర్టీసీ వేడుకుంటుంటే.. దానికిచ్చే నిధుల్లోనూ కోత పెట్టింది! గత బడ్జెట్లో రూ.3000 కోట్లు కేటాయిస్తే ఈసారి అందులో సగమే! వెరసి, ప్రజా సంక్షేమానికి సర్కారు భారీగా కోతలు పెట్టింది! కాకపోతే, విద్య, వైద్యానికి కేటాయింపులు కాస్త పెంచింది! నేతన్నలు, గౌడ్‌ వర్గీయులకు కొత్త పథకాలను ప్రకటించింది! పర్యాటకం, హరితహారం వంటి వాటికి నిధులు పెంచింది! మహిళా వర్సిటీకి పెద్దపీట వేసింది. 


అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ రెండింటికీ వంద కోట్ల చొప్పున కేటాయించింది. ఎప్పట్లాగే, వాస్తవ రాబడులతో ఏమాత్రం సంబంధం లేకుండా వ్యయ అంచనాలు భారీగా పెంచి.. బడ్జెట్‌ రూపకల్పనలో నేల విడిచి సాము చేసింది. అంతగా రాని కేంద్ర గ్రాంట్లను ఈసారి కూడా భారీగా పెంచింది! సంపన్న రాష్ట్రమైనా.. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ దాదాపు రూ.60 వేల కోట్ల అప్పులు చేస్తామని ప్రకటించింది! ఈ రెండింటినీ అడ్డు పెట్టుకుని మరోసారి బాహుబలి పద్దును తీర్చిదిద్దింది! ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు శాసన సభలో; రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి శాసన  మండలిలో సోమవారం రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. గత (2021-22) బడ్జెట్‌ను రూ.2,30,825.96 కోట్లకు ప్రవేశపెట్టగా.. ఈసారి అదనంగా 11.32ు నిధులను పెంచి రూ.2,56,958.51 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఇక, సవరించిన అంచనాలు రూ.2,10,082.61 కోట్లకు ఇది 22.31 శాతం అధికం. అంటే, ఒక రకంగా ఇది బాహుబలి బడ్జెట్టే. కానీ... రాబడులే కష్టంగా కనిపిస్తున్నాయి.


గ్రాంట్లు ఘనం.. రాబడి స్వల్పం

బడ్జెట్‌ రూపకల్పనలో సర్కారు ఈసారి కూడా కేంద్ర గ్రాంట్లపై గంపెడాశ పెట్టుకుంది. కేంద్ర గ్రాంట్స్‌-ఇన్‌-ఎయిడ్‌ కింద రూ.41,001 కోట్లు, కేంద్ర సౌజన్య పథకాలు(సీఎ్‌సఎస్‌) కింద రూ.9,443 కోట్లు వస్తాయని బడ్జెట్‌లో చూపింది. అంటే, కేంద్రం నుంచి రూ.50 వేల కోట్లకుపైగా వస్తాయని చూపించింది. బడ్జెట్‌ గణాంకాలకు అనుగుణంగా గ్రాంట్లను విడుదల చేయడం లేదని కేంద్రాన్ని నిందించడానికి; బడ్జెట్‌ పరిమాణాన్ని భారీగా పెంచుకోవడానికే కేంద్ర గ్రాంట్లను ఇంత భారీగా చూపించిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. గత బడ్జెట్‌ (2021-22)లో కేంద్ర గ్రాంట్లు, సీఎ్‌సఎస్‌ కింద రూ.38,669.46 కోట్లను అంచనా వేసింది. సవరించిన బడ్జెట్‌లో దానిని రూ.28,669.46 కోట్లకు పరిమితం చేసింది. అంటే, సరిగ్గా రూ.10 వేల కోట్లను కోసేసింది. నిజానికి, కేంద్ర గ్రాంట్ల విషయంలో బడ్జెట్‌ అంచనాల్లోనూ, సవరించిన అంచనాల్లోనూ సర్కారు అంచనాలు తప్పే! ఎందుకంటే, జనవరి వరకూ కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్లు, సీఎ్‌సఎ్‌సలు కేవలం రూ.7,303.61 కోట్లు మాత్రమే! ఫిబ్రవరి, మార్చి నెలలు కూడా కలిపితే మరో రూ.3,000 కోట్లు రావడం గగనమే. అంటే, సవరించిన అంచనాల కంటే కూడా మరో రూ.10 వేల కోట్లు తక్కువ వస్తున్నట్లే! కానీ, సవరించిన అంచనాల్లోనూ.. ప్రస్తుత బడ్జెట్లోనూ కేంద్ర గ్రాంట్లు; సీఎస్‌ఎస్‌ల విషయంలో నేల విడిచి సాము చేసింది. ఇప్పటికే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. గ్రాంట్లు ఇవ్వడం లేదంటూ నెపాన్ని కేంద్రంపై నెట్టేందుకే ఈ ఎత్తు వేసిందని చెబుతున్నారు. ఇందుకు నిదర్శనగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఉన్నప్పుడు కేటాయింపులను చూపిస్తున్నారు. 2019-20లో గ్రాంట్లు, సీఎ్‌సఎ్‌సల కింద రూ.8,177.75 కోట్లు వస్తాయని బడ్జెట్లో అంచనా వేసింది. కానీ, కేంద్రం రూ.11,598.10 కోట్ల (141.83%)ను విడుదల చేసింది. ఇక, 2020-21 బడ్జెట్లో రూ.10,906.51 కోట్లను ఆశిస్తే రూ.15,471.13 (141.83%) నిధులు వచ్చాయి. కానీ, రెండేళ్లుగా మాత్రం కేంద్రం నుంచి రాబడి అంచనాలను భారీగా పెంచేసింది. అసెంబ్లీలో హరీశ్‌ బడ్జెట్‌ ప్రసంగం ఇందుకు నిదర్శనగా నిపుణులు చెబుతున్నారు. బడ్జెట్‌ ప్రసంగంలో హరీశ్‌ కేంద్ర ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. కేంద్రం నుంచి సహాయం ఏమీ లేదని మండిపడ్డారు. నిజానికి, గతంలో ఎప్పుడూ కూడా బడ్జెట్‌ ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఈస్థాయిలో విమర్శించిన సందర్భాలు లేవని నిపుణులు వివరిస్తున్నారు. కేంద్ర గ్రాంట్ల అంచనాలు, హరీశ్‌ ప్రసంగం భవిష్యత్తుకు సూచికగా అభివర్ణిస్తున్నారు.


బడ్జెట్‌ పరిమాణం పెంచడానికే..!

ఏటికేడాది బడ్జెట్‌ పరిమాణాన్ని పెంచుకోవడానికి సర్కారు గిమ్మిక్కులు చేస్తోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కేంద్రం నుంచి గ్రాంట్లు భారీగా వస్తాయని అంచనా వేయడం ఇందులో భాగమేనని వివరిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంచనా వేసిన దాంట్లో కేవలం 18.88 శాతం మాత్రమే కేంద్రం నుంచి గ్రాంట్లు వచ్చాయి. కానీ, సవరించిన అంచనా కంటే కూడా 69 శాతం అంచనాలు పెంచేసింది. అంతేనా, రెండున్నర లక్షల కోట్లకు బడ్జెట్‌ ప్రవేశపెడితే.. అందులో రూ.50 వేల కోట్లు కేంద్ర గ్రాంట్లు; రూ.60 వేల కోట్లు అప్పులు! ఈ రెండింటి ద్వారానే రూ.1.10 లక్షల కోట్లను అంచనా వేసింది. అందుకే, ఈ రెండింటినీ నమ్ముకుని బాహుబలి బడ్జెట్లు ప్రవేశపెట్టడం ఆర్థిక క్రమశిక్షణ కిందకు రాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకాలకు నిధులను భారీగా కేటాయిస్తున్నట్లు చూపడానికే బడ్జెట్‌ పరిమాణాలను అమాంతం పెంచేస్తున్నారని చెబుతున్నారు. ఓట్ల కోసం గాలం వేసే పథకాల వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు. ఉదాహరణకు, ఈ బడ్జెట్లో దళిత బంధు పథకానికి రూ.17,700 కోట్లు కేటాయించారు. ఇందుకు భారీగా కేటాయింపులు చూపడానికే పరిమాణాన్ని పెంచారని చెబుతున్నారు. ఏడాది చివరికి వచ్చేసరికి ఇంత మొత్తం ఖర్చు చేస్తారా? అది సాధ్యమేనా అన్న సందేహాలనూ వ్యక్తం చేస్తున్నారు.


బడ్జెట్‌ లెక్కలన్నీ వాస్తవ దూరాలే!

వాస్తవాల ఆధారంగా బడ్జెట్‌ ప్రవేశపెడతామని ప్రతిసారీ మంత్రులు, అధికారులు చెబుతుంటారు. కానీ, ఎప్పట్లాగే, వాస్తవ వ్యయాలతో సంబంధం లేకుండా భారీ బడ్జెట్‌ ప్రవేశపెడుతుంటారు. ఇప్పుడు జరిగింది కూడా అదే! ఉదాహరణకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.2.30 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కానీ, జనవరి నాటికి చేసిన వాస్తవ వ్యయం రూ.1,42,688.79 కోట్లు మాత్రమే. మిగిలిన ఫిబ్రవరి, మార్చి నెలల వ్యయాన్ని కూడా కలిపితే దాదాపు రూ.1.65 లక్షల కోట్లకు చేరవచ్చు. కానీ.. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ వాస్తవ వ్యయం రూ.1.80 లక్షల కోట్లకు చేరుతుందని ప్రకటించారు. సీఎం ప్రకటనను పరిగణనలోకి తీసుకున్నా రూ.2.30 లక్షల కోట్ల బడ్జెట్‌లో రూ.1.80 లక్షల కోట్లను ఖర్చు చేస్తే.. ఇంకా రూ.50 వేల కోట్లకు కోత పడినట్లే! ఈ విషయాన్ని బడ్జెట్‌ పుస్తకంలోనే సర్కారు ప్రకటించింది. నిజానికి, గత బడ్జెట్‌ ప్రకారం మొత్తం రాబడులు రూ.2,29,876.94 కోట్లుగా అంచనా వేసింది. సవరించిన బడ్జెట్లో దానిని 2,09,876.94 కోట్లకు కుదించింది. అంటే, సరిగ్గా రూ.20 వేల కోట్లను అధికారికంగా తగ్గించింది. ఇక, కేంద్ర గ్రాంట్లలో రూ.10 వేల కోట్లు అధికారికంగా తగ్గించినా.. మరో రూ.10 వేల కోట్లు వాస్తవంగా తగ్గుతున్నాయి. అంటే, బడ్జెట్‌కు, వాస్తవ రాబడికి ఏమాత్రం పొంతన లేదు. అయినా, ఈసారి బడ్జెట్‌ను రూ.2.57 లక్షల కోట్లకు ప్రతిపాదించారు. ఉద్యోగుల వేతనాలు, పింఛన్లు, వడ్డీ చెల్లింపు, సబ్సిడీల వంటి వాటిలో కోతలు పెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు. కనక, ప్రజా సంక్షేమ పథకాల్లోనే కోతలు పెట్టాలి. కేటాయింపులు భారీగా పెంచినట్లు చూపించినా.. వాస్తవ వ్యయం భారీగా తగ్గిపోతుంది. ప్రజలను మభ్యపెట్టడానికి ఇలా భారీ బడ్జెట్‌ను పెట్టి, ఆ తర్వాత కోతలు, వాతలతో వ్యయాలను కుదించడం ప్రభుత్వాలకు పరిపాటిగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. అందుకే, వాస్తవ రాబడుల ఆధారంగా బడ్జెట్‌ పెడితే... ఇలాంటి కోతలకు అవకాశం ఉండదని చెబుతున్నారు. ఇక, క్యాపిటల్‌ వ్యయం విషయంలోనూ బడ్జెట్‌ లెక్కలు వాస్తవ దూరమే. గత బడ్జెట్‌ (2021-22)లో క్యాపిటల్‌ వ్యయం కింద రూ.29,046 కోట్లు కేటాయించారు. సవరించిన బడ్జెట్లోనే దానిని రూ.25,954 కోట్లకు కుదించారు. అయినా, తాజా బడ్జెట్లో దానిని రూ.29,728.44 కోట్లుగా ప్రతిపాదించారు. అంటే, గత బడ్జెట్‌ కంటే రూ.700 కోట్లు ఎక్కువ కేటాయించారు. కాగా, డిజిటల్‌ సర్వే ద్వారా భూముల లెక్క తేల్చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, బడ్జెట్లో దానిపై ఫోకస్‌ తగ్గించింది. ఇందుకు రూ.600 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తే.. ఈసారి నామమాత్రంగా రూ.56 కోట్లు మాత్రమే కేటాయించింది.


భూముల్లోనూ గాలి మేడలు

ఎక్సైజ్‌, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌), భూముల అమ్మకం ద్వారా రాబడులు భారీగా పెరుగుతాయని బడ్జెట్లో సర్కారు అంచనా వేసింది. అంటే.. భూముల మార్కెట్‌ విలువలు, రిజిస్ట్రేషన్‌ చార్జీలను మళ్లీ పెంచే అవకాశమున్నట్లు చెప్పకనే చెప్పింది. ఇక, మద్యంపై వ్యాట్‌ గత బడ్జెట్‌లో రూ.17 వేల కోట్లు వస్తాయని అంచనా వేస్తే.. ఈసారి మరో రూ.500 కోట్లను పెంచింది. మద్యంపై మరింత ఆదాయం వస్తుందని అంచనా వేసింది. ఇక, ఈసారి పన్నేతర రాబడిని రూ.25,422 కోట్లుగా అంచనా వేసి, ఇందులో భూముల అమ్మకం ద్వారానే రూ.15,500 కోట్లు వస్తాయని ఆశిస్తోంది. ఏటా భూముల అమ్మకం ద్వారా బడ్జెట్లో భారీ అంచనాలు వేయడం.. ఆ తర్వాత అవి సాకారం కాకపోవడం మామూలే! ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ సర్కారు అంచనాలు నిజం కాలేదు. అంచనా వేసిన స్థాయిలో భూములను అమ్మలేకపోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్నేతర రాబడుల కింద రూ.30,557.35 కోట్లను అంచనా వేయగా... అందులో భూముల అమ్మకమే ప్రధాన వనరు. దాదాపు రూ.20 వేల కోట్లు దీని ద్వారానే వస్తాయని అంచనా వేసింది. కానీ... జనవరి నాటికి భూముల పన్నేతర రాబడి కింద రూ.5,600 కోట్లే వచ్చాయి. అందుకే, సవరించిన బడ్జెట్లో భూములపై ఆదాయాన్ని రూ.16 వేల కోట్లకు కుదించింది. తాజా బడ్జెట్లో మరో రూ.500 కోట్లు తగ్గించింది. భూముల అమ్మకానికి ఇటీవలే హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ ధైర్యంతోనే ఇంత పెద్ద మొత్తంలో అంచనా వేసినట్లు తెలుస్తోంది. ఇటీవల 8 జిల్లాల్లో భూముల అమ్మకాన్ని ప్రారంభించినా అది కూడా ఆశాజనకంగా లేకపోవడం గమనార్హం. కేవలం బడ్జెట్‌ పరిమాణాన్ని పెంచడానికే భూముల అమ్మకాలపై రాబడిని కూడా వాడుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి.


రూ.3.30 లక్షల కోట్ల అప్పులు

బడ్జెట్‌ రూపకల్పనకు ప్రభుత్వం అప్పులనూ ఆధారంగా చేసుకుంటోంది. ప్రతి బడ్జెట్లో దాదాపు రూ.50 వేల కోట్లు అప్పులే! తాజా బడ్జెట్లో కూడా రూ.59,672 కోట్లు అప్పులు చేస్తామని ప్రతిపాదించింది. ఈ అప్పులు మరింత పెరుగుతాయేమో తెలియదు. ఎందుకంటే, గత బడ్జెట్లో రూ.45,509 కోట్లు అప్పులు చేస్తామని అంచనా వేశారు. కానీ, ఇప్పటికే రూ.49 వేల కోట్ల వరకూ అప్పులు చేశారు. దీనితో కలిపి మొత్తం అప్పులు రూ.3.30 లక్షల కోట్లు అని బడ్జెట్లోనే ప్రకటించారు. ఇది జీఎ్‌సడీపీలో 25ు. ఏటేటా బడ్జెట్లో అప్పులు పెరగడం ఆర్థిక క్రమశిక్షణకు సూచిక కాదని నిపుణులు అంటున్నారు.


మహిళలకు సామాజిక, ఆర్థిక సాధికారతతో పాటుగా రాజకీయ 

సాధికారత కట్టబెట్టడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. దేశంలోనే 

ప్రథమంగా స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే. 

- ముఖ్యమంత్రి కేసీఆర్‌

Updated Date - 2022-03-08T07:54:11+05:30 IST