కోతల ఒడి

ABN , First Publish Date - 2022-06-26T06:29:24+05:30 IST

అమ్మ ఒడి లబ్ధిదారుల జాబితాలో ఈ ఏడాది భారీగా కోతకు సిద్ధమయ్యారు. అనేక ఆంక్షలతో వడబోశారు.

కోతల ఒడి

అమ్మఒడి సొమ్ము రూ.13 వేలకు కుదింపు?

2.16 లక్షల మందికి రూ.325.26 కోట్లు

జిల్లా జాబితా ప్రకటించిన విద్యాశాఖ


అనంతపురం విద్య, జూన్‌ 25: అమ్మ ఒడి లబ్ధిదారుల జాబితాలో ఈ ఏడాది భారీగా కోతకు సిద్ధమయ్యారు. అనేక ఆంక్షలతో వడబోశారు. జిల్లాలో 4 లక్షల మంది విద్యార్థులు ఉండగా, ఈ ఏడాది 2,16,844 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేసినట్లు జిల్లా విద్యాశాఖ ప్రకటించింది. ఇందులో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ 1,90,385 మంది, ఇంటర్‌ విద్యార్థులు 26,479 మంది ఉన్నారు. వీరికి రూ.325.26 కోట్లు అందించనున్నారు. 


ఐదు నెలలు జాప్యం

అమ్మఒడి జాబితాను ఐదు నెలలు ఆలస్యంగా తేల్చారు. ఏటా జనవరిలో ఇచ్చే అమ్మఒడిని ఈ ఏడాది జూన్‌ వరకూ పొడిగించారు. జిల్లా వ్యాప్తంగా 31 మండల్లో 2.16 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. అనంతపురం మండలంలో 32,988 మంది, ఆత్మకూరులో 3,879, బెళుగుప్పలో 4,044, బొమ్మనహాళ్‌లో 6,564, బ్రహ్మసముద్రంలో 4,681, బీకేఎ్‌సలో 7,359, డీ హీరేహాళ్‌ 5,012, గార్లదిన్నెలో 5,382, గుత్తిలో 8,396, గుమ్మగట్టలో 5,722, గుంతకల్లులో 15,905, కళ్యాణదుర్గం 8,704, కంబదూరులో 4,909, కణేకల్లు 6,726, కూడేరు 4,027, కుందుర్పి 5,209, నార్పల 5,704, పామిడి 5,368, పెద్దపప్పూరు 3,493, పెద్దవడుగూరు 4,651, పుట్లూరు 3,356, రాప్తాడు 3,933, రాయదుర్గం 10,516, శెట్టూరు 4,420, శింగనమల 4,190, తాడిపత్రి 15,047, ఉరవకొండ 7,381, వజ్రకరూరు 5,009, విడపనకల్లు 5,403, యాడికి  5,672, యల్లనూరు 3,192 మందిని ఎంపిక చేశారు. 


చెల్లింపులోనూ కోత

అమ్మ ఒడి సొమ్ములోనూ కోత పెడుతున్నారు. 2019-20లో ఒక్కో తల్లి ఖాతాలో రూ.15 వేలు వేశారు. పాఠశాల పారిశుధ్య నిర్వహణకు రూ.వెయ్యి స్వచ్ఛందంగా ఇవ్వాలని వెనక్కు లాక్కున్నారు. 2020-21లో సైతం రూ.1000 ఇవ్వాల్సిందే అన్నట్లు ఉత్తర్వులు జారీ చేసి, తల్లుల ఖాతాల్లోకి రూ.14000 మాత్రమే వేశారు. ఈ ఏడాది పాఠశాల పారిశుధ్య నిర్వహణ గ్రాంట్‌ పేరిట రూ.2 వేలు కోత పెట్టాలని చూస్తున్నట్లు సమాచారం. అధికారులు బయటకు ప్రకటించకున్నా, లబ్ధిదారులకు రూ.13 వేలు మాత్రమే ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే, జిల్లాలో రూ.43.36 కోట్ల మేర కోత పడుతుంది. 

Updated Date - 2022-06-26T06:29:24+05:30 IST