ఉపాధిలోనూ కోతలే..

ABN , First Publish Date - 2022-05-16T07:12:58+05:30 IST

గ్రామీణ ప్రాం తాల్లో ఉన్న పేదలకు వరంగా ఉన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకానికి ఎసరు పెట్టారు.

ఉపాధిలోనూ కోతలే..
ఉపాధి పని చేస్తున్న కూలీలు

సగం పనిదినాలు కట్‌

వేసవి అలవెన్సుల ఎత్తివేత

కొత్త సాఫ్ట్‌వేర్‌లో కనిపించని ఆప్షన్లు

నష్టపోతున్న కూలీలు

అనంతపురం క్లాక్‌టవర్‌, మే 15: గ్రామీణ ప్రాం తాల్లో ఉన్న పేదలకు వరంగా ఉన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకానికి ఎసరు పెట్టారు. అసలే కరువు జిల్లాలో ఉపాధి  పనులను నమ్ముకున్న పేదల కడుపు కొడుతున్నారు. ఈ ఏడాది 2022-23 సంవత్సరానికి సంబంధించి జిల్లాలో ఉపాధి పనిదినాల్లో కోత విధిస్తున్నారు. పనిదినాల్లో కోత విధిస్తూనే మరో వైపు వేసవిలో కూలీలకు అందుతున్న అలవెన్సులలో కోతలు పెడుతున్నారు. వేసవిలో ఉపాధి కూలీలకు ఇదివరకు అందుతున్న లబ్ధిపై కన్నేసిన ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. ఉపాధికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ మారడంతో ఆప్షన్లు కనబడకుండా చేసేశారు. జిల్లాకు ఈ ఏడాదికి సంబంధించి 80లక్షలు మాత్రమే పనిదినాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉపాధి కూలీలకు ఇదివరకు లాగా 100రోజులపాటు పనికల్పించడం కష్టమవుతుంది. గతేడాది ఉమ్మడి జిల్లాకు 2.80కోట్ల పనిదినాలు కల్పించారు. అయితే ఇందులో 2.40కోట్లు పనిదినాలు పూర్తి చేశారు. ఈ ఏడాది పూర్తిగా కోత విధించారు. జిల్లాలో 31 మండలాల పరిధిలో 4.75లక్షల వరకు జాబ్‌కార్డులు ఉన్నాయి. అంటే నాలుగు లక్షల జాబ్‌ కార్డులకు పనిదినాలు కల్పించాలంటే కనీసం 2.5కోట్లు పనిదినాలు జిల్లాకు కేటాయించాల్సిన పరిస్థితి ఉంది. అయి తే కేవలం 80లక్షల పనిదినాలు కేటాయించారంటే సగం పనిదినాలు కుదించినట్లే. దీంతో కూలి కూడా గిట్టుబాటు కాదని అర్థమవుతోంది. 


వేసవి అలవెన్సులకు స్వస్తి..

సాధారణంగా ఉపాధి కూలీలకు వ్యవసాయ పనులు పూర్తి అయిన వెంటనే ఫిబ్రవరి నుంచి జూన నెల వరకు పనులు అధికంగా కల్పిస్తారు. వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడంతో పూర్తిస్థాయిలో ఉపాధి పనులు చేయలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఉపాధి కూలీలు నష్టపోకుండా వారికి వేసవి భత్యం పేరుతో ప్రోత్సాహకాలు అమలు చేసేవారు. ఇలా ఫిబ్రవరిలో 20 శాతం, మార్చి, ఏప్రిల్‌లో 25 శాతం, మే, జూన మాసాల్లో 30 శాతం అలవెన్సులు ఇదివరకు చెల్లించేవారు. అయితే వేసవి నాలుగు నెలలు గడిచినా వేసవి అలవెన్సులు కూలీలకు చెల్లించలేదు. అదనంగా చెల్లింపులు లేవని, కేవలం చేసిన పనులకు మాత్రమే వేతనాలు జమచేస్తామంటూ ఉపాధి అధికా రులు చెప్పుకొస్తున్నారు. వేసవిలో ఉపాధి కూలీలను ప్రోత్సహించేందుకు భత్యంతో పాటు మజ్జిగ, గడ్డపార, మంచినీటి, రవాణా అలవెన్సులు ఇచ్చేవారు. వీటితో పాటు పనిచేసేచోట నీడ కోసం టెంట్లు, మెడికల్‌ కిట్లు,  ఆయాలు, గంపలు అదనంగా ఇవ్వాల్సి ఉన్నా వాటి గురించి ప్రస్తావనే లేదు. 


సాఫ్ట్‌వేర్‌ మార్చడంతో కూలీలకు నష్టం

గతంలో ఉపాధి హామీ పథకం ప్రారంభం నాటి నుంచి టీసీఎస్‌ సాఫ్ట్‌వేర్‌తో కార్యకలాపాలన్నీ సాగించేవారు. ఇటీవల టీసీఎస్‌ నుంచి ఎనఐసీ సాఫ్ట్‌వేర్‌కు మార్చారు. దీంతో ఉపాధి కూలీలకు తీరని నష్టం జరుగుతోంది. కొత్త సాఫ్ట్‌వేర్‌లో ఉపాధి కూలీలకు అదనంగా చెల్లించే ఆప్షన్లు కనబడకుండా చేశారు. అసలే వేసవిలో చేసే పనితో పాటు అదనపు భత్యం, ఇతరత్రా చెల్లింపులతోనే ఉపాధి కూలీలకు గిట్టుబాటు కూలి దక్కేది. ఇప్పుడా పరిస్థితి లేకుండా చేస్తున్నారు. వేసవిలో సాధారణ పరిస్థితుల కంటే భిన్నంగా నేల గట్టిగా ఉంటుంది. దీంతో ఉపాధి పనులు చేసే కూలీలకు చాలా కష్టంగానే ఉంటుంది. దీంతో అదనపు చెల్లింపులు ఇచ్చేవారు. ఇప్పుడు చెల్లించేందుకు ఆప్షన్లు లేకుండా చేశారంటే ఇక చెల్లింపులు ఉండవని ప్రభుత్వం చెప్పకనే చెబుతోందని తెలుస్తోంది. 


పనిదినాలు తగ్గించడం దారుణం..

ఉపాధి కూలీలకు పనిదినాలు తగ్గించడం దారుణం. గత ఏడాది కంటే ఈ సంవత్సరంలో సుమారు కోటి పనిదినాలు కుదించడంతో చాలా నష్టం జరుగుతుంది. అసలే కరువు జిల్లాలో ఇలా పనిదినాలు తగ్గిస్తే గ్రామీణ కూలీలు పట్టణ ప్రాంతాలకు వలసలు పెరిగే అవకాశం లేకపోలేదు. పనిదినాలతో పాటు వేసవి అలవెన్సులలో కోత విధించడం ఉపాధి కూలీల కడుపుకొట్టడమే. పనిచేసే చోట కనీస వసతులు ఏర్పాటు చేయాలి.  

- కృష్ణమూర్తి, సీపీఎం అనుబంధ ఏపీ వ్యవసాయ కార్మికసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి


పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్ర..

గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు వరంగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్రలో భాగమే ఉపాధి పనిదినాలు తగ్గించడం. పొమ్మనలేక పొగపెట్టినట్లుగా ఉపాధి కూలీలపై ప్రభుత్వం కక్షసాధిస్తోంది. రెక్కాడితే కానీ డొక్కాడని పేద ప్రజల గౌరవం పెంచిన ఉపాధి హామీ పథకానికి మంగళం పాడేలా ప్రభుత్వ తీరు కనిపిస్తోంది. ఉపాధి కూలీల అలవెన్సులు, ఇతర బెనిఫిట్స్‌ లేకుండా చేసిన సాఫ్ట్‌వేర్‌ ఎనఐసీని వెంటనే రద్దు చేసి పాత పద్ధతినే అమలు చేయాలి. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధి కూలీలకు మేలు చేసేలా చర్యలు తీసుకోవాలి.

- కేశవరెడ్డి, సీపీఐ అనుబంధ ఏపీ వ్యవసాయకార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి


కనీసం 200 రోజులు పనిదినాలు కల్పించాలి..

ప్రతి ఒక్క కూలీకి ఏడాదికి కనీసం 200 రోజులు పనిదినాలు కల్పించాలి. అంతేగాక దినకూలి కనీసం రూ.500గా చెల్లించాలి. ఇప్పుడు చేస్తున్న కూలి గిట్టుబాటు కావడం లేదు. 100 రోజుల పనిదినాలు, రోజుకు వేతనం రూ.150వస్తే ఎలా బతకాలి. కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి.  పెండింగ్‌లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలి. అలాగే వేసవి అలవెన్సులు చెల్లించాలి. 

- గోపాల్‌రెడ్డి, ఉపాధి కూలీ, కూడేరు మండలం


కూలీలకు ఎటువంటి ఇబ్బంది పెట్టం..

ఉపాధి కూలీలకు ఎట్టిపరిస్థితుల్లో ఇబ్బంది కలగకుండా పనిదినాలు కల్పిస్తాం. ఇందులో ఎటువంటి సం దేహం లేదు. ప్రతి జాబ్‌కార్డుదారుడికి కచ్చితంగా 100 రోజుల పాటు పని ఉంటుంది. అయితే సాఫ్ట్‌వేర్‌ మార డంతో కొన్ని ఆప్షన్లు తీసివేసిన మాట వాస్తవమే. ముఖ్యంగా వేసవిలో మజ్జిగ, మంచినీరు, గడ్డపార అలవెన్సులు కూలీలకు అందడం లేదు. దినకూలి, పనివేళలు పెంచాలని ఇప్పటికే క్షేత్రస్థాయి ఉద్యోగులకు సూచించాం. ఆ దిశగా ప్రణాళికలు చేపడుతున్నాం. పెండింగ్‌ బిల్లులు చెల్లిస్తాం. పనిదినాలు తగ్గిస్తారనేది ఉండదు. 

- వేణుగోపాల్‌రెడ్డి,  డ్వామా పీడీ

Updated Date - 2022-05-16T07:12:58+05:30 IST