కోతలే కోతలు

ABN , First Publish Date - 2022-04-09T05:30:00+05:30 IST

అప్రకటిత విద్యుత్తు కోతలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు.

కోతలే కోతలు

  1. కరెంటు ఉంటేనే పంటకు నీరు
  2. పరిశ్రమలకు పవర్‌ హాలీడేతో కార్మికుల పస్తులు
  3. లైట్‌ వెలిగితేనే చేనేత కార్మికులకు ఉపాధి
  4. విద్యుత్‌ కోతలతో అల్లాడుతున్న అన్ని వర్గాలు

అప్రకటిత విద్యుత్తు కోతలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. అత్యవసర లోడ్‌ రిలీఫ్‌ పేరిట విద్యుత్‌ సరఫరా ఆపేస్తుండడంతో అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఎండల తీవ్రతకు తోడు.. వేళాపాలా లేని కోతలతో జనం బెంబేలెత్తుతున్నారు. కొన్నిచోట్ల విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల వద్ద ఆందోళన చేస్తున్నారు. పరిశ్రమలకు పవర్‌ హాలీడే ప్రకటించడంతో కార్మికులు వారంలో ఒకరోజు ఉపాధి కోల్పోతున్నారు. 

కర్నూలు-ఆంధ్రజ్యోతి: ఉమ్మడి జిల్లాలో 15.58 లక్షల వివిధ విద్యుత్‌ వినియోగ కనెక్షన్లు ఉన్నాయి. గృహ వినియోగ కనెక్షన్లు 11.92 లక్షలు, వ్యవసాయ కనెక్షన్లు 1.97 లక్షలు, పరిశ్రమలు కనెక్షన్లు 10,891 ఉన్నాయి. రోజుకు 835 మెగావాట్ల (83.5 మిలియన్‌ యూనిట్లు) విద్యుత్‌ అవసరం ఉంది. ఎండల తీవ్రత కారణంగా విద్యుత్‌ వాడకం పెరుగుతోంది. ఆ స్థాయిలో సరఫరా చేయడం లేదు. వాస్తవంగా రోజుకు సరఫరా చేస్తున్నది 747 మెగావాట్లు (74,7 మిలియన్‌ యూనిట్లు)కు మించడం లేదని విద్యుత్‌శాఖ అధికారులే అంటున్నారు. ఆదివారం నుంచి పల్లె, పట్టణాల్లో కోతలు పెట్టి మరింత కరెంట్‌ పొదుపు చర్యలకు సిద్ధం అయ్యారు. అధికారికంగానే పల్లెల్లో రోజుకు గంట, పట్టణాల్లో అర గంట కోత పెట్టేలా ప్రణాళిక తయారు చేశారు. అనధికారిక కోతలు సరేసరి. ఇప్పటికే ఎప్పుడు కరెంట్‌ ఉంటుందో.. ఎప్పుడు పోతుందో తెలియక జనం అవస్థలు పడుతున్నారు. ఇన్‌వర్టర్ల కొనుగోలు వైపు పరుగులు తీస్తున్నారు.


పరిశ్రమ ఉత్పత్తిలో కోత

ఎనిమిదేళ్ల తరువాత భారీ పరిశ్రమలకు 50 శాతం విద్యుత్‌ కోత పెట్టడంతో పారిశ్రామిక రంగం కుదేలు అవుతోంది. ఉమ్మడి జిల్లాలో చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమలు 10,891 ఉంటే.. సిమెంట్‌, ఆయిల్‌ ఉత్పత్తి, కాటన్‌ జిన్నింగ్‌.. వంటి భారీ పరిశ్రమలు 648 ఉన్నాయి. ఈ పరిశ్రమలు రోజువారి వినియోగంలో  50 శాతం విద్యుత్‌ మాత్రమే వాడాలి. దీంతో 50 శాతం ఉత్పత్తి ఆగిపోయినట్లే. రాష్ట్ర విభజన సమయంలో రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్‌ పంపకాలు ఓ కొలిక్కి రాకపోవడం వల్ల 2014 జూన్‌ నెలలో భారీ పరిశ్రమలకు విద్యుత్‌ కోత విధించారు. ఆతరువాత నాటి సీఎం చంద్రబాబు విద్యుత్‌ రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు, సోలార్‌ విద్యుత్‌కు ప్రాధాన్యం ఇవ్వడంతో ఈ ఎనిమిదేళ్లలో పరిశ్రమలకు ఎలాంటి సమస్య తలెత్తలేదు. తాజాగా 50 శాతం కోత పెట్టడంతో పరిశ్రమలు మూసేసుకునే పరిస్థితి వచ్చిందని ఓ పారిశ్రామికవేత్త ఆందోళన చెందారు. జిల్లాలో రోజుకు సరాసరి రూ.వంద కోట్లకు పైగా ఉత్పత్తులు ఆగిపోయాయని అంటున్నారు. చిన్న మధ్యతరహా పరిశ్రమలు 11,093 ఉన్నాయి. వీటికి వారంలో ఒకరోజు పవర్‌ హాలీడే పెట్టారు. 


9 గంటలు కాదు.. 7 గంటలే

వ్యవసాయానికి 9 గంటలు విద్యుత్‌ ఇస్తామని పాలకులు పదేపదే చెబుతున్నమాట. వాస్తవానికి 7 గంటలు కూడా ఇవ్వలేమని ఇంజనీర్లే అంటున్నారు. ఆమేరకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు 1,96,610 ఉన్నాయి. వ్యవసాయానికి రోజూ 360 మెగావాట్ల విద్యుత్‌ సరఫరా చేసేవారు. ప్రస్తుతం 200 మెగా వాట్లకు కుదించారు. 140 మెగావాట్ల విద్యుత్‌ సర్దుబాటు కోసం 9 గంటల విద్యుత్‌ నుంచి 7 గంటలకు కుదించారు. దీంతో బోరుబావుల కింద సాగు చేస్తున్న రైతులు తడి కోసం జాగరణ చేయాల్సి వస్తుందని హోళగుందకు చెందిన రైతు నరసింహులు ఆవేదన వ్యక్తం చేశారు. 


విద్యార్థులు తప్పని ఇబ్బందులు

అప్రకటిత విద్యుత్‌ కోతలు వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలో 11,91,640 గృహ వినియోగ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఇళ్లలో కరెంట్‌ సరఫరాకు 160 మెగావాట్లు విద్యుత్‌ ఇప్పటి వరకు ఇస్తున్నారు. తాజాగా 100 మెగావాట్లే ఇవ్వాలని ప్రణాళిక సిద్ధం చేశారు. దీంతో పట్టణ, గ్రామాల్లో రోజుకు అర గంట నుంచి గంటకు పైగా కోతలు ఉంటున్నాయి. అనధికారిక కోతలు సరేసరి. రాత్రి పూట పదేపదే కరెంట్‌ తీస్తుండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 


చేనేతల పరిస్థితి దారుణం

జిల్లాలో ఎమ్మిగనూరు, కోడుమూరు, ఆదోని, నంద్యాల, నందికొట్కూరు, గూడూరు, నందవరం.. వంటి ప్రాంతాల్లో 25 వేలకు పైగా చేనేత కుటుంబాలు ఉన్నాయి. పోగుపోగు వడకాలంటే మగ్గంపై కనీసం రెండు లైట్లు ఉండాలి. రోజంతా కరెంట్‌ ఉంటే చేనేత కార్మికులు రెండు గజాలు వస్త్రం (చీర) నేస్తారు. రూ.350-500 వరకు కూలీ వస్తుంది. కరెంట్‌ కోతల వల్ల రోజుకు గజం చీర కూడా నేయలేమని ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన చేనేత కార్మికుడు నాగేష్‌ తెలిపారు. దీంతో రోజు కూలీ రూ.150-200 కోల్పోవాల్సి వస్తుందని అంటున్నారు.


ఇన్వర్టర్లకు పెరిగిన డిమాండ్‌

విద్యుత్‌ కోతల కారణంగా కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ తదితర పట్టణాల్లో ఇన్వర్టర్లకు డిమాండ్‌ పెరిగింది. కర్నూలు నగరంలో ఇన్వర్టర్లు విక్రయించే దుకాణాలు 15 ఉన్నాయి. బ్యాటరీతో కలిపి ఒక్కో ఇన్వర్టరు రూ.25-30 వేలు పడుతుంది. వారం క్రితం వరకు రోజుకు ఒకటి కూడా అమ్ముడుపోయేది కాదు. నెలలో సగటున 10-15 అమ్మినా గొప్పే. కరెంట్‌ కోతల కారణంగా ఒక్కొ దుకాణంలో రోజుకు 5-6 ఇన్వర్టర్లు అమ్ముడు పోతున్నాయని ప్రవీణ్‌ అనే వ్యాపారి పేర్కొన్నారు. 


రేడియాలజీ నెంబరు 4లో నిలిచిన పరీక్షలు 

కర్నూలు(హాస్పిటల్‌), ఏప్రిల్‌ 9: కర్నూలు సర్వజన వైద్యశాలలో శనివారం కరెంటు కోతల వల్ల ఎక్స్‌రే పరీక్షలకు అంతరాయం కలిగింది. రేడియాలజీ విభాగం డైరెక్ట్‌ డిజిటల్‌ ఎక్స్‌రే గది (నెంబరు-4)లో ఎక్స్‌రే పరీక్షలు నిలిచిపోయాయి. వీటితో పాటు డిజిటల్‌ రేడియోగ్రఫీ యంత్రానికి కూడా లోవోల్టేజీ వల్ల డిజిటల్‌ ఫిల్మ్‌ నిర్వహణకు ఇబ్బందిగా మారింది. కరెంటు సరఫరా నిలిచిపోతే జనరేటర్‌ ద్వారా రేడియాలజీ విభాగంలో ఎక్స్‌రే ఇతర యంత్రాలను నిర్వహిస్తుంటారు. అయితే మొబైల్‌ ఎక్స్‌రే యంత్రాలు సింగిల్‌ ఫేజ్‌ కరెంటుతో పని చేస్తాయి. అయితే 500 ఎంఏ ఎక్స్‌రే యంత్రం, డిజిటల్‌ రేయడియోగ్రఫీ యంత్రానికి త్రీఫేస్‌ కరెంటు అవసరమవుతుంది. కరెంటుకు అంతరాయం కలిగితే జనరేటర్‌తో నడిపించొచ్చు. ఇటీవల పవర్‌ స్టెషన్‌ వద్ద కొత్తగా 320 కేవీ జనరేటర్‌ యంత్రం అందుబాటులో ఉన్నా దాని వినియోగంలోకి తీసుకురాలేదు. 


విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఎదుట ధర్నా

మద్దికెర, ఏప్రిల్‌ 9: రాష్ట్రం విద్యుత్‌ సంక్షోభంతో అల్లాడుతుంటే ప్రభుత్వానికి పట్టదా? అని జిల్లా వ్యవసాయకార్మికసంఘం అధ్యక్షుడు నబిరసూల్‌, జిల్లా కౌలురైతుసంఘం అధ్యక్షుడు హనుమప్ప అన్నారు. శనివారం మద్దికెర సబ్‌స్టేషన్‌ వద్ద ఆందోళనకు దిగారు. సబ్‌స్టేషన్‌కు తాళాలు వేసి ధర్నా చేపట్టారు. వారు మాట్లాడుతూ ఇష్టానుసారంగా విద్యుత్‌ ఛార్జీలను పెంచడమే కాకుండా కోతలు విధిస్తున్నారన్నారు. పరిశ్రమలకు ఒక రోజు విద్యుత్‌ సెలవును ప్రకటించడం వల్ల చాలామంది పనులు లేక పస్తులు ఉండాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు. 


సోమవారం పరిశ్రమలకు పవర్‌ హాలిడే

కల్లూరు, ఏప్రిల్‌ 9: జిల్లాలో పరిశ్రమలకు ప్రతి సోమవారం పవర్‌ హాలిడే ప్రకటించినట్లు ఏపీఎ్‌సపీడీసీఎల్‌ డైరెక్టర్‌ డా.శశికళారెడ్డి తెలిపారు. జిల్లాలో విద్యుత్‌ను పొదుపుగా వాడాలని సూచించారు. శనివారం విద్యుత్‌ భవన్‌ సర్కిల్‌ కార్యాలయంలో ఎస్‌ఈ శివప్రసాద్‌ రెడ్డి అధ్యక్షత విలేకరులతో మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ డిమాండుకు సరిపడ విద్యుత్‌ సరఫరా లేదన్నారు. 24 గంటల భారీ పరిశ్రమలకు విద్యుత్‌ డిమాండ్‌లో 50 శాతం మాత్రమే ఉపయోగించాలని, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు వారంతపు సెలవుతో పాటు అదనంగా ప్రతి సోమవారం పవర్‌ హాలిడే ఇచ్చామని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, షాపింగ్‌ మాల్స్‌ 50 శాతం ఏసీలు మాత్రమే వాడాలన్నారు. వ్యాపార ప్రకటనల హోర్డింగ్స్‌, సైన్‌బోర్డులు సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు విద్యుత్‌ ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కర్నూలు కార్పొరేషన్‌ పరిధిలో విద్యుత్‌ వినియోగదారులకు ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు కోత ఉంటుందన్నారు. అలాగే ఆళ్లగడ్డ, ఆత్మకూరు, ఎమ్మిగనూరు, ఆదోని, గూడూరు మున్సిపాలిటీ పరిధిలో ప్రతిరోజూ మధ్యాహ్నం 3 నుంచి 3.30 గంటల వరకు, నంద్యాల, నందికొట్కూరు, డోన్‌, బేతంచెర్ల, మున్సిపాలిటీల్లో మధ్యాహ్నం 3.30 నుంచి 4 గంటల వరకు కరెంటు కోత ఉంటుందన్నారు. ఆదోని, కర్నూలు రూరల్‌ డివిజన్‌ పరిధిలోని రూరల్‌, నంద్యాల, డోన్‌ కర్నూలు టౌన్‌ డివిజన్‌ పరిధిలో, రూరల్‌ హెడ్‌ క్వార్టర్స్‌, సబ్‌ స్టేషన్‌ హెడ్‌ క్వార్టర్లలో గృహ విద్యుత్‌ వినియోగదారులకు ప్రతిరోజూ 4 నుంచి 5 గంటల వరకు కరెంటు సరఫరా ఉండదని తెలిపారు. ఎస్‌ఈ కె.శివప్రసాద్‌ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 22 వరకు ఈ పరిస్థితి కొనసాగుతుందని తెలిపారు.


Updated Date - 2022-04-09T05:30:00+05:30 IST