6.78 లక్షల మందికి కట్‌

ABN , First Publish Date - 2022-06-26T07:24:14+05:30 IST

అమ్మఒడి పథకంతో అద్భుతాలు సృష్టిస్తున్నామని జగన్‌ ప్రభుత్వం ప్రకటించుకుంది. ఈ పథకానికితోడు ‘నాడు-నేడు’ వల్ల ఏటా స్కూళ్లలో అడ్మిషన్లు పెరుగుతున్నాయని సెలవిస్తోంది. ఇంగ్లీషు మీడియం ఉండటం కూడా ప్రవేశాలను పరుగులు పెట్టిస్తోందని

6.78 లక్షల మందికి కట్‌

అమ్మల సంఖ్య అదే.. పేర్లు మార్చి జిమ్మిక్కు

‘అమ్మఒడి’ ఎగవేతలో జగనన్న కొత్త ఎత్తు

పాతవి ఎన్ని కోసేస్తే అన్ని కొత్తగా జత

మూడేళ్లూ వరుసగా తీసుకున్నవారు తక్కువే

ఏటా పేర్లు చేర్చి అందరికీ ఇస్తున్నట్టు ఆర్భాటం

గత ఏడాది 44.96 లక్షలమందికి వర్తింపు

కొత్తగా 5.48 లక్షలను చేర్చామన్న సర్కారు

ఆ లెక్కన ఈసారి 50 లక్షల మందికి రావాలి

కానీ, 43.48 లక్షల మందికే ఇస్తున్న వైనం

కొత్త రూల్స్‌, వడపోతలతో కొందర్ని కోసినా

గతంలో తీసుకున్నవారికే ఈసారి అన్యాయం

నష్టపోతున్న దళిత, గిరిజన విద్యార్థులు


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

అమ్మఒడి పథకంతో అద్భుతాలు సృష్టిస్తున్నామని జగన్‌ ప్రభుత్వం ప్రకటించుకుంది. ఈ పథకానికితోడు ‘నాడు-నేడు’ వల్ల ఏటా స్కూళ్లలో అడ్మిషన్లు పెరుగుతున్నాయని సెలవిస్తోంది. ఇంగ్లీషు మీడియం ఉండటం కూడా ప్రవేశాలను పరుగులు పెట్టిస్తోందని చెబుతోంది. అయితే అమ్మఒడి అమలు తీరు చూస్తే ఆ పథకంపై జగన్‌ సర్కారుది అంతా ఆర్భాటమేనని ఇట్టే తెలిసిపోతుంది. అమ్మఒడితో ప్రవేశాలు నిజంగానే పెరిగితే ఏటా ఈ పథకం లబ్ధిదారుల సంఖ్య ఎందుకు తగ్గిపోతోంది? ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్లు పెరిగితే పథకం సైజు కూడా పెరగాలి కదా! కానీ, ఎందుకని అంతకంతకు అమ్మఒడికి కత్తెరలు పడుతున్నాయంటే సమాధానం ఇచ్చేవారు లేరు. గత ఏడాది అమ్మఒడి పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 44.96 లక్షల మందికి వర్తింపజేశారు. ప్రభుత్వం చెప్పినట్టు పథకం పనిచేసి అడ్మిషన్లు పెరిగితే సాయం అందుకునే చేతులు పెరిగాలి. కానీ లబ్ధిదారుల సంఖ్య చూస్తే ఈ ఏడాది దాదాపు 1.48 లక్షల మంది కోతపడింది. మొత్తం 43.48 లక్షల మందికి మాత్రమే పథకం అందించాలని మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయించారు. పైగా కొత్తగా 5.48 లక్షల మందికి ఇచ్చామని కూడా ప్రకటించారు. అంటే.. గతంలో ఇస్తున్న లబ్ధిదారులకు భారీగా కత్తెర వేసినట్టే! ఇలా సుమారు 6.78 లక్షల మంది పాత వాళ్లకు ఎగ్గొట్టి కొత్తవాళ్లకు మంజూరుచేశారని అర్థమవుతోంది. అమ్మఒడి పథకంలో ఎక్కువ మంది లబ్ధిదారులకు సాయం చేస్తున్నట్లు చూపించుకునేందుకు ప్రభుత్వం ఈ ఎత్తు వేసింది.


మొదటి ఏడాదిలో అమ్మఒడి పొందిన లబ్ధిదారులు ఇప్పుడు అనర్హులు ఎలా అవుతారని ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వదు. గతంలో అర్హులై, పథకం మంజూరైనా కొంత మంది బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమకాలేదు. వారికి మళ్లీ వేస్తామని ప్రకటించినా... అమ్మఒడి లబ్ధిదారులను మాత్రం పట్టించుకోలేదు. పైగా కేబినెట్‌ సమావేశం తర్వాత శుక్రవారం ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలో మొత్తం  82.31 లక్షల మంది పిల్లలు అమ్మఒడి పొందుతున్నారని పేర్కొన్నారు. ఏటా 43 లక్షలకు మించకుండా అమ్మఒడి మంజూరుచేసి 82 లక్షల మంది లబ్ధి పొందుతున్నారని ప్రకటించడంపై అయోమయం నెలకొంది. దానర్థం ఏమిటో ఎవరికీ అంతుబట్టడం లేదు. అది పథకంలో లబ్ధిదారులైన పిల్లల సంఖ్యనా... లేక రెండేళ్లలో ఇచ్చిన అమ్మఒడి లబ్ధిదారుల సంఖ్యనా.. అనేది స్పష్టత లేదు. అమ్మఒడి లబ్ధిదారుల సంఖ్యను భారీగా పెంచి చూపించేందుకు సర్కార్‌ కొత్త ఎత్తులు వేసిందని పలువురు అనుమానిస్తున్నారు. మొదటి ఏడాదిలో మంజూరైన లబ్ధిదారుల్లో సగం మందికి రెండో ఏడాదిలో ఎగ్గొట్టారని, రెండో ఏడాదిలో మంజూరైనవారిలో చాలామందికి మూడో ఏడాదికి ప్రకటించిన జాబితాలో ఎగ్గొట్టారని చెప్తున్నారు. దీంతో మొత్తం 43 లక్షలమంది లబ్ధిదారుల పిల్లలు పాఠశాలల్లో చదువుతున్నప్పటికీ మూడేళ్లూ వారికి ఇచ్చిన దాఖలాల్లేవు. అదే సమయంలో కొత్త పేర్లను జాబితాలో చేర్చుతున్నారు. అమ్మఒడి లబ్ధిదారుల సంఖ్యను పెంచి చూపించి అందరికీ పథకం ఇచ్చామని చెప్పుకొనేందుకు వేసిన జిమ్మిక్కు ఇదని పలువురు విమర్శిస్తున్నారు. 


దళిత, గిరిజన విద్యార్థులకు షాక్‌...

అమ్మఒడి పథకం ప్రారంభమైన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో తనిఖీల ఒత్తిడి పెరిగింది. గ్రామాల్లో చదువుతున్న దళిత గిరిజన కాలనీలకు చెందిన విద్యార్థుల హాజరు సాధారణంగా తక్కువగా ఉంటుంది. అమ్మఒడి వర్తింపునకు అటెండెన్సును సర్కారు లింకు పెట్టింది. 75 శాతం హాజరును పథకం అర్హతకు గీటురాయిగా ఉంచింది. అయితే ఈ గీటురాయిని దళిత, గిరిజన కాలనీలు, తండాల్లోని ప్రభుత్వ బడులకు యథాతథంగా వర్తింపజేస్తే.. బడుగుల చదువుల ఆశలకు భారీగా కోత వేసినట్టే!

Updated Date - 2022-06-26T07:24:14+05:30 IST