Advertisement
Advertisement
Abn logo
Advertisement

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు.. ఏపీ సర్కారు షాక్‌!

బియ్యం కార్డు కట్‌!

పరోక్షంగా 40 వేల మందిపై ప్రభావం

జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల వద్ద పది వేల కార్డులు ఉన్నట్టు అధికారుల గుర్తింపు

తక్షణమే సరండర్‌ చేయాల్సిందిగా ఆదేశాలు

మరోవైపు తహసీల్దార్ల ద్వారా సర్వే

ప్రభుత్వ నిర్ణయంపై సచివాలయ ఉద్యోగుల అసంతృప్తి


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగుల వద్ద వున్న బియ్యం కార్డులను వెంటనే వెనక్కి ఇచ్చేయాలని (సరండర్‌) ప్రభుత్వం ఆదేశించింది. లేనిపక్షంలో తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు సూచించింది. జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగుల వద్ద పది వేల బియ్యం కార్డులు వున్నట్టు ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో ఆరు వేలు గ్రామీణ ప్రాంతంలో, నాలుగు వేల వరకూ నగరంలో వున్నట్టు చెబుతున్నారు. వీరిలో ఎక్కువ మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులే ఉన్నారంటున్నారు. ఇంకా కిందిస్థాయి ఉద్యోగులు, కుటుంబంలో వేరొకరి పేరుతో కార్డు తీసుకున్నవారు మరికొందరు వున్నట్టు చెబుతున్నారు. ఇటువంటి కార్డులపై మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లతో సర్వే చేయించాలని తహసీల్దార్లను ఉన్నతాధికారులు ఆదేశించారు.


గ్రామ రెవెన్యూ అధికారి/వలంటీర్ల ద్వారా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు సమాచారం సేకరించనున్నారు. ఈలోగా ప్రభుత్వ ఉద్యోగులు తమ వద్ద వున్న బియ్యంకార్డులను స్వచ్ఛందంగా సరండర్‌ చేయాల్సి ఉంటుంది. నివేదిక వచ్చేంత వరకూ ఆగితే మాత్రం రికవరీతో పాటు క్రిమినల్‌ చర్యలు తీసుకునే అవకాశం వుందని అధికారులు అంటున్నారు. నిబంధనల మేరకు ప్రభుత్వ ఉద్యోగులు బియ్యం కార్డు పొందడానికి అర్హులు కారు. అయితే గత ప్రభుత్వం ఆర్టీసీ, విద్యుత్‌, తదితర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే చిన్న చిన్ని ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చింది. దీనికి భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వం...ప్రభుత్వ ఉద్యోగులకు బియ్యం కార్డులను నిలిపివేయాలని నిర్ణయించింది. బియ్యం కార్డు పొందాలంటే నగరంలో అయితే ఏడాదికి రూ.1.44 లక్షలు, గ్రామీణ ప్రాంతంలో రూ.1.2 లక్షల ఆదాయానికి మించకూడదు. అంటే నెలకు నగరంలో రూ.12 వేలు, గ్రామీణంలో రూ.10 వేల ఆదాయం మించితే బియ్యం కార్డుకు అనర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. దీనినే ప్రాతిపదికగా తీసుకుని ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల బియ్యం కార్డులు రద్దు చేయాలని భావిస్తోంది. 


గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు షాక్‌

జిల్లాలో 1301 సచివాలయాలు (739 గ్రామ, 562 వార్డు) ఉన్నాయి. గ్రామీణ ప్రాంతంలో సచివాలయానికి సగటున 13 మంది, నగరంలో పది మందిని కేటాయించారు. ప్రస్తుతం కొన్నిచోట్ల ఖాళీలున్నప్పటికీ మొత్తం 13 వేల మంది వరకు పనిచేస్తున్నారు. వీరికి నెలకు రూ.15 వేలు ఇస్తున్నారు. ఏడాదిన్నర క్రితం విధుల్లో చేరినా ఇంకా ప్రొబిషనరీలోనే ఉన్నారు. అయితే జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల వద్ద వున్న పది వేల కార్డుల్లో ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల వరకు సచివాలయ ఉద్యోగులకు చెందినవిగా ఉన్నతాధికారులు భావిస్తున్నారు. వాస్తవంగా సచివాలయ ఉద్యోగులుగా విధుల్లో చేరక ముందు నుంచే వారి కుటుంబాలకు గల అర్హత బట్టి తెల్ల కార్డులు ఉన్నాయి. పేరుకు సచివాలయ ఉద్యోగమైనా ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు అందే ఏ ఒక్క ప్రయోజనం అందదు. వీరి సర్వీస్‌ రెగ్యులర్‌ చేసిన తరువాత బియ్యం కార్డులు రద్దు చేస్తే ఫర్వాలేదుగానీ ఇప్పుడు సరండర్‌ చేయాల్సిందిగా చెప్పడంతో వారంతా ఆందోళనకు గురవుతున్నారు.


ఇంకా చెప్పాలంటే సచివాలయ ఉద్యోగుల్లో ఎక్కువమంది అవివాహతులే. ఇప్పుడు కార్డు రద్దు చేస్తే వీరిపై ఆధారపడే కుటుంబ సభ్యులు (సుమారు 40 వేల మంది వరకూ)కు రేషన్‌ అందే పరిస్థితి ఉండదు. అలాగే ఆరోగ్య కార్డుల ద్వారా వైద్య సేవలు పొందే అవకాశం కోల్పోతారు. పోనీ ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌ వర్తించదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంపై గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. 


ఈకేవైసీ పేరిట హడావిడి

అనర్హుల పేరిట బియ్యం కార్డులను భారీగా ఏరివేయడానికి ప్రభుత్వం పలు రకాల సర్వేలు చేపడుతోంది. ఇందులో భాగంగానే కార్డులో పేరు కలిగిన ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేయించుకోవాలని షరతు విధించింది. ఈకేవైసీ చేయించుకోకపోయినా...ప్రస్తుతానికి బియ్యం నిలిపివేయ బోమని అధికారులు చెబుతున్నా భవిష్యత్తులో అటువంటి వారి మెడపై కత్తి వేలాడుతూనే ఉంటుంది. 

Advertisement
Advertisement