తాలు పేరిట కోత.. రైతుల ఆందోళన

ABN , First Publish Date - 2021-05-07T05:50:04+05:30 IST

నిబంధనల ప్రకారం పరిమితి తేమశాతంతో పాటు తాలు లేకుండా ధాన్యం విక్రయించినప్పటికీ మిల్లర్లు అక్రమంగా కోత పెడుతుంటడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

తాలు పేరిట కోత.. రైతుల ఆందోళన
మిల్లు ఎదుట ఆందోళన చేస్తున్న రైతులు

చేర్యాల, మే 6: నిబంధనల ప్రకారం పరిమితి తేమశాతంతో పాటు తాలు లేకుండా ధాన్యం విక్రయించినప్పటికీ మిల్లర్లు అక్రమంగా కోత పెడుతుంటడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై తమకు న్యాయం చేయాలని పేర్కొంటూ పలువురు రైతులు గురువారం చేర్యాల మండలం ముస్త్యాల గ్రామంలోని సాంబశివ పారాబాయిల్డ్‌ వద్ద ఆందోళనకు దిగారు. చేర్యాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుతో పాటు శివారు కాలనీల్లో  కొద్దిరోజులుగా రైతులు ధాన్యం విక్రయిస్తున్నారు. 27మంది రైతులకు సంబంధించి1,103.20క్వింటాళ్ల మేర ధాన్యం కొనుగోలు చేసిన కేంద్రం నిర్వహకులు సాంబశివ పారాబాయిల్డ్‌కు లారీల్లో తరలించారు. కానీ తీరా తాలు ఉన ్నదని 16 క్వింటాళ్లు కోతపెట్టడంతో అయోమయానికి గురైన రైతులు మిల్లువద్దకు వెళ్లి ఆందోళనకు దిగారు. కొనుగోలుకేంద్రం నిర్వహకులతో పాటు మిల్లు యాజమాన్యాన్ని నిలదీశారు. ఏ రైతు ధాన్యంలో తాలు ఉంటే వారికి మాత్రమే కోతపెట్టాల్సి ఉన్నా ఇతర రైతులందరికీ కోత విధించడం తగదని మండిపడ్డారు. నాణ్యత, ప్రమాణాల మేరకు విక్రయించినప్పటికీ గ్రేడ్‌ మార్చి గిట్టుబాటుధర రాకుండా చేయడం సబబుకాదని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలిసిన పీఏసీఎస్‌ చైర్మన్‌ వంగ చంద్రారెడ్డి, డైరెక్టర్‌ ఉడుముల బాల్‌రెడ్డి  మిల్లు యాజమాన్యంతో మాట్లాడారు. ఈవిషయమై ఉన్నతాఽధికారులకు ఫిర్యాదుచేయడంతో పాటు రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

Updated Date - 2021-05-07T05:50:04+05:30 IST