రెండున్నర లక్షల మందికి కట్‌

ABN , First Publish Date - 2022-08-14T08:36:24+05:30 IST

ప్రభుత్వరంగంలో పనిచేస్తున్నా, ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం కాదు. ప్రభుత్వ ఉద్యోగులకంటే మెరుగ్గా పనులుచేస్తారు. కార్యాలయ వేళలనేవి లేకుండా ఎప్పుడూ విధుల్లోనే ఉంటారు.

రెండున్నర లక్షల మందికి కట్‌

  • కాంట్రాక్టు ఉద్యోగులకు పథకాలు బంద్‌
  • ప్రభుత్వ ఉద్యోగులనే సాకుతో నోట్లో మట్టి.. 
  • చాలీచాలని జీతాలు...పెరగని వేతనాలు
  • హామీగానే మిగిలిపోయిన క్రమబద్ధీకరణ.. 
  • కొనసాగుతున్న ఔట్‌సోర్సింగ్‌ల ఉద్వాసన


(అమరావతి-ఆంధ్రజ్యోతి): ప్రభుత్వరంగంలో పనిచేస్తున్నా, ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం కాదు. ప్రభుత్వ ఉద్యోగులకంటే మెరుగ్గా పనులుచేస్తారు. కార్యాలయ వేళలనేవి లేకుండా ఎప్పుడూ విధుల్లోనే ఉంటారు. అయినా... చాలీచాలని వేతనాలను ఇంటికి తీసుకెళ్లే కాంట్రాక్టు సిబ్బందికి జగన్‌ ప్రభుత్వం గట్టి షాక్‌ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులనే పేరిట వారికి అందుతున్న ప్రభుత్వ పఽథకాలను రద్దు చేసేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర లక్షల మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఉన్నారు. సర్కారు తీసుకున్న ఒక్క నిర్ణయంతో వీరంతా ‘నవరత్న’ పథకాలకు అనర్హులుగా మారారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల కుటుంబాలు మొదలే అరకొర జీతాలతో నెట్టుకొస్తున్నాయి. ఈ వర్గాలకు గత మూడేళ్లలో జీతాలు పెరగకపోయినా.. నవరత్నాల నుంచి వచ్చే ఒకటో, రెండో పథకాలు ఉపశమనం కలిగించేవి. ఇటీవల కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను కూడా సీఎ్‌ఫఎంఎస్‌ ద్వారా ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించింది. రూ.10 వేలు పైబడి జీతం కలిగిన కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందరినీ రైస్‌ కార్డుకు అనర్హులను చేశారు. అనంతరం ఒక్కొక్కటిగా నవరత్నాల పథకాలన్నింటికీ అనర్హులను చేస్తూపోయారు. చివరకు వారి కుటుంబాలకు అందుతున్న సామాజిక పెన్షన్లను కూడా ఈ నెల నుంచి నిలిపివేశారు. 


వాగ్దానాలన్నీ వట్టి ఆర్భాటాలేనా?

కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానని హామీ ఇచ్చి జగన్‌ అధికారంలోకి వచ్చారు. ఇన్నేళ్లుగా ఇచ్చిన హామీని అమలుచేయకుండా కాలయాపన చేస్తున్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని హామీ ఇచ్చింది. అయితే, సుప్రీంకోర్టు ఆదేశాల కారణంగా క్రమబద్ధీకరించడం అప్పట్లో సాధ్యం కాలేదు. అయితే, పలు శాఖల కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు భారీగా జీతాలు పెంచింది. కోర్టు తీర్పు అంగీకరించబోదని తెలిసినా.. క్రమబద్ధీకరణపై జగన్‌ తన పాదయాత్రలో పదేపదే హామీలు ఇచ్చారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామని, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం కల్పిస్తామని ఎన్నికల వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చిన కొత్తగా దీనిపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుచేశారు. ఈ సంఘం సమావేశాలతోనే సరిపెడుతోందని అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశం.. అతి తక్కువ మందిని మాత్రమే రెగ్యులర్‌ చేసేందుకు వీలవుతుందని తేల్చింది.  అయితే ఈ విషయంపై ఇంకా సందిగ్ధత నెలకొని ఉంది. దీనిపై ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారో తెలియని పరిస్థితి. 


వదిలించుకునే పనిలో...

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాది పాటు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఊసే ఎత్తలేదు. పైగా అడుగడుగునా వారి ఉద్యోగ భద్రతపై అనుమానాలు రేకెత్తించారు.  కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని వీలయినంత మందిని తొలగించేందుకు ఉన్న మార్గాలన్నీ అన్వేషించారు. పేపర్‌ నోటిఫికేషన్‌, ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండా గత ఏడాది మార్చి 31కి ముందు ఉద్యోగాల్లో చేరిన రూ.40 వేల పైబడి వేతనాలు పొందుతున్న సిబ్బందిని తొలగించారు. రాష్ట్రంలోని సచివాలయ శాఖలు, విభాగాధిపతులు, జిల్లాలు, డివిజన్లు, మండలాలు, గ్రామ కార్యాలయాల్లో సైతం పనిచేసే ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు సిబ్బందిని ఇంటిదారి పట్టించారు. 31-03-2019 వరకు పనిచేస్తున్న రూ.40 వేల పైబడి వేతనం తీసుకుంటున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది జాబితాను సేకరించి వారిని ఇంటికి సాగనంపారు. అనంతరం ఆర్థికశాఖ అనుమతి లేకుండా నియామకాలు పొందిన కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందరిపై వేటు వేసేందుకు సన్నాహాలు ప్రారంభించారు. 


ఈ క్రమంలో ఆర్థికశాఖ, సాధారణ పరిపాలనశాఖ రోజుకో మెమో, సర్క్యులర్‌తో సిబ్బందిని హడలెత్తించాయి. పైగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఏ నెలకూడా సకాలంలో జీతాలు చెల్లించలేదు. ఇప్పటికి కూడా పలు శాఖల్లో పనిచేసే సిబ్బందికి నెలల తరబడి జీతాలు పెండింగ్‌లోనే ఉన్నాయి. కాంట్రాక్టు ఉద్యోగులకు ఇవ్వాల్సిన హెల్త్‌కార్డులు, ఇతర ప్రోత్సాహకాలు ఇప్పటికీ అమలు కావడం లేదు. గ్రామ సచివాలయాలు ప్రారంభం కావడంతో ఉపాధి హామీ పథకంలో పనిచేసే సిబ్బంది ఉనికి కూడా ప్రశ్నార్థకమైంది. రాష్ట్రంలో ఏపీవోలు 591 మంది, కంప్యూటర్‌ ఆపరేటర్లు 1526 మంది, ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్లు 520 మంది, టెక్నికల్‌ అసిస్టెంట్లు 2123 మంది, బేర్‌ఫుట్‌ టెక్నీషియన్లు 800 మందితో పాటు ఫీల్డ్‌ అసిస్టెంట్లు/సీనియర్‌ మేట్లు/జూనియర్‌ మేట్లు సుమారు 15 వేల మంది దాకా ఉన్నారు. వారంతా ఉద్యోగ భద్రతపై ఆందోళన చెంది అమరావతికి వచ్చి ముఖ్యమంత్రి, మంత్రులకు మొరపెట్టుకున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా శిశు సంక్షేమశాఖలో నియమించిన పోషాన్‌ అభియాన్‌లో పనిచేసే ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు 340 మందిని తొలగించారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాలు మూడేళ్ల నుంచి పెంచకుండా కాలయాపన చేస్తూనే ఉన్నారు. ఒకటో తేదీ ఇవ్వాల్సిన జీతాలు నెలలో ఎప్పుడు జమ చేస్తారో తెలియని పరిస్థితిలో వీరు ఉన్నారు. దీంతో జీతాలు పెంచాలనే డిమాండ్‌ కన్నా... ఎప్పుడు జీతాలొస్తాయా? అని ఎదురుచూసే దుస్థితే ఎక్కువ. ఏదో ఒక కారణం చెప్పి తొలగిస్తుండటంతో తమను రెగ్యులర్‌ చేయాలని ఆందోళన చేసే సాహసం ఈ ఉద్యోగులు చేయలేకపోతున్నారు. 

Updated Date - 2022-08-14T08:36:24+05:30 IST