ఖాతాదారులు పాస్‌ పుస్తకాలను తనిఖీ చేయించుకోవాలి

ABN , First Publish Date - 2020-05-21T10:55:59+05:30 IST

స్థానిక పోస్టాఫీసులో నిధుల గోల్‌మాల్‌ విషయంలో ఖాతాదారులు తమ పాస్‌ పుస్తకాలను తీసుకొచ్చి విచారణ

ఖాతాదారులు పాస్‌ పుస్తకాలను తనిఖీ చేయించుకోవాలి

జిల్లా పోస్టల్‌ అధికారి హరిప్రసాద్‌ శర్మ


కురిచేడు, మే 20 : స్థానిక పోస్టాఫీసులో నిధుల గోల్‌మాల్‌ విషయంలో ఖాతాదారులు తమ పాస్‌ పుస్తకాలను తీసుకొచ్చి విచారణ చేయించుకోవాలని జిల్లా పోస్టల్‌ శాఖ ఎస్‌ఎ్‌సపీ మల్లాది హరినాధశర్మ చెప్పారు. బుధవారం కురిచేడుకు వచ్చిన ఆయన పోస్టాఫీసులో విచారణ అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఖాతాదారుల మొత్తాలు వారికి తెలియకుండా గోల్‌మాల్‌ చేసిన విషయం 2013లోనే ప్రారంభమైనట్లు తమ విచారణలో తేలిందన్నారు. ప్రధానంగా ఆర్డీ ఖాతాలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల నుంచి ఖాతాదారులకు తెలియకుండా రుణాలు తీసుకున్నారని, డిపాజిట్లు గడువు ముగిశాక ఖాతాదారులకు తెలియకుండా డ్రా చేశారని చెప్పారు.


పోస్టల్‌ అధికారి, ఏజెంట్లు కుమ్మక్కై అక్రమాలకు తెరలేపారన్నారు. ఖాతాదారులు తమ ఎస్బీ ఖాతాలను చాలాకాలం నుంచి వినియోగించకుండా వదిలి వేసిన ఖాతాలను తిరిగి వారికి తెలియకుండా తెరచి వాటి ద్వారా డబ్బులు కాజేశారని చెప్పారు. ఈ మొత్తం కోటి రూపాయలకు పైగా ఉంటుందని అంచనా వేశామన్నారు. 


ఖాతదారులు హైదరాబాద్‌, రాజమండ్రి, నరసరావుపేట, వైజాగ్‌కు చెందిన వారు కూడా ఉన్నారని ఎస్‌ఎ్‌సపీ చెప్పారు. వారందరికీ విషయం తెలిసేలా ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. పాస్‌పుస్తకాలలో జమ అయి, పోస్టల్‌ స్టాంప్‌ ఉంటే ఖాతాదారుల మొత్తాలకు ఇబ్బంది ఉండదన్నారు. ఇద్దరి ఏజెన్సీలు రద్దు చేసినట్లు, మరో ఇద్దరివి సస్పెన్షన్‌లో ఉంచినట్లు తెలిపారు. ఇక్కడ నిధుల గోల్‌మాల్‌లో పాలు పంచుకున్న పోస్టల్‌ అధికారి కందుకూరులో పనిచేస్తూ సెలవులో ఉన్నాడన్నారు. తుది విచారణ అనంతరం మొత్తం లెక్కలు తేలుస్తామని చెప్పారు.

Updated Date - 2020-05-21T10:55:59+05:30 IST