యాంత్రీకరణకు ఎసరు

ABN , First Publish Date - 2022-09-08T05:37:32+05:30 IST

ప్రతిరైతు భరోసా కేంద్రానికి ఒక సీహెచ్‌సీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం గతేడాదే ముందుకు వచ్చింది. సాంకేతిక కారణాలు, బ్యాంకులు సకాలంలో రుణాలు మంజూరు చేయని కారణంగా అమలు చేయడంలో కొంత ఆలస్యమైంది.

యాంత్రీకరణకు ఎసరు

కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల ద్వారా చిన్న రైతులకు యంత్ర పరికరాలు

అధికార పార్టీ నాయకులు, వారి కుటుంబ సభ్యులకే లబ్ధి..

నెరవేరని కేంద్ర ప్రభుత్వ లక్ష్యం


నాడు వ్యవసాయమంటే కాడెద్దులు, నాగలి వుంటే చాలు. నేడు వ్యవసాయ రంగంలో  యంత్ర పరికరాల వినియోగం క్రమేణా పెరుగుతోంది. దీంతో ధరలు కూడా పెరుగుతున్నాయి. వీటిని కొనుగోలు చేయాలంటే సన్న, చిన్నకారు రైతులు ఆర్థికంగా కష్టమే. అందుకే ప్రభుత్వం చిన్న రైతులకు కూడా ఆధునిక యంత్రాలను అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేసి వాటి ద్వారా తక్కువ అద్దెకు యంత్రాలు అందించాలని భావించింది. అయితే దాన్ని కూడా పక్కదారి పట్టిస్తున్నారు. యంత్ర పరికరాలు అధికార పార్టీ నాయకులు ఇళ్ల వద్దే ఉంటున్నాయి. దీంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది..


(నూజివీడు టౌన్‌)

ప్రతిరైతు భరోసా కేంద్రానికి ఒక సీహెచ్‌సీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం గతేడాదే ముందుకు వచ్చింది. సాంకేతిక కారణాలు, బ్యాంకులు సకాలంలో రుణాలు మంజూరు చేయని కారణంగా అమలు చేయడంలో కొంత ఆలస్యమైంది. రెండు నెలల క్రితం మెగామేళా నిర్వహించి, రాష్ట్ర ముఖ్యమంత్రి ట్రాక్టర్లను పంపిణీ చేశారు. అయితే ఆ యంత్ర పరికరాలు అధికార పార్టీ నాయకుల సొంత అవస రాలకు వారి కుటుంబ సభ్యులకే వినియోగిస్తున్నారనే ఆరోపణలు వున్నాయి. కేంద్రప్రభుత్వం బక్కచిక్కిన రైతులకు వీటిద్వారా లబ్ధి చేకూర్చాలని పథకాన్ని తీసుకువచ్చినా రాష్ట్రంలో ఈ పథకం ద్వారా సన్న, చిన్నకారు రైతులకు చాలా తక్కువ లబ్ధి కలుగు తోంది. ఏలూరు జిల్లాలోని నూజివీడు వ్యవసాయ సహాయ సంచాలకుల పరిధిలో నూజివీడు, ముసునూరు, ఆగిరిపల్లి మండలాలు వుండగా నియోజకవర్గ పరిధిలో చాట్రాయి మండలం కూడా వుంది. వీటి పరిధిలో వ్యవసాయ ఉత్పత్తుల కేంద్రాలు 78 వున్నాయి. 2021–22 సంవత్సరంలో ప్రతి రైతు భరోసా కేంద్రం పరిధిలో కామన్‌ హైరింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని (సీహెచ్‌సీ) ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ప్రతి ఆర్బీకే పరిధిలో ఐదుగురు ఔత్సాహిక రైతులను గుర్తించి బృందాలుగా ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రానికి అవసరాన్ని బట్టి రూ.10 నుంచి రూ.15 లక్షలు విలువ చేసే యంత్ర పరికరాలను అందించాలని నిర్ణయించారు. యూనిట్‌ విలువలో ప్రభుత్వం 40 శాతం రాయితీ ఇస్తుండగా బ్యాంకుల ద్వారా 50 శాతం రుణం, మిగిలిన పదిశాతం లబ్ధిపొందే రైతులు భరించాల్సి వుంది. కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌ (వినియోగదారుల అద్దె కేంద్రం) ద్వారా స్థానిక అవసరాన్ని బట్టి ట్రాక్టర్‌తో పాటు కల్టివేటర్‌, ట్రక్‌, విత్తనాలు చల్లే పరికరం, పవర్‌టిల్లర్‌, విత్తన నూర్పిడి యంత్రాలను అద్దెకు అందిస్తారు.


మార్గదర్శకాలు రావడంలో ఆలస్యం 

రైతులకు వ్యవసాయ పరికరాలను మూడుదశల్లో అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా తొలివిడతలో గత సంవత్సరం రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా లబ్ధిదారులకు యంత్ర పరికరాలు ఇవ్వాలని భావించారు.అయితే అనుకున్న సమ యానికి ట్రాక్టర్లు అందకపోవడంతో రెండో దశలో 2021 సెప్టెంబరులో తిరిగి డిసెంబర్‌లో ఇవ్వాలని భావించారు. ఎట్టకేలకు 2022లో రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా ట్రాక్టర్లను, ఇతర యంత్ర పరికరాలను ఇవ్వాలని మెగా మేళా  నిర్వహించారు. నూజివీడు వ్యవసాయ సహాయ సంచాలకుల పరిధిలో నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు మండలాలు వుండగా, నియోజకవర్గ పరిధిలో చాట్రాయి మండలం కూడా కలుస్తోంది. ఇందులో మొత్తం ఆర్బీకేలు 78 వుండగా, కామన్‌ హైరింగ్‌ సెంటర్లు 63 ఉన్నాయి. తొలి విడతగా 46 కామన్‌ హైరింగ్‌ సెంటర్లకు వైఎస్సార్‌ యంత్ర సేవా పథకంలో రాయితీలు ఇవ్వాలని నిర్ణయించారు. పూర్తి విలువ 3.27 కోట్లు కాగా, అందులో ప్రభుత్వం 1.57 కోట్లు రాయితీగా అందించింది. కొనుగోలు చేసిన యంత్ర పరిక రాలను చిన్న, సన్నకారు రైతులకు తక్కువ ధరకు అద్దెకిస్తూ అందరికి యంత్రపరికరాలు అందుబాటు లోకి తేవాలనేది ప్రభుత్వ లక్ష్యం కాగా ఆయా గ్రామాల్లో ఈ యంత్రపరికరాలు అధికార పార్టీ నాయకుల ఇళ్లవద్దే వుంటున్నాయి. సంబంధిత నాయకులు, వారి బంధువులకే ఎక్కువుగా లబ్ధి కలుగుతోంది. అద్దె వివరాలు, ఆర్బీకేల్లో ప్రత్యేక రిజిస్టర్‌ను పెట్టి మెయింటినెన్స్‌ చేయాల్సి వుండగా  క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు కావడం లేదు. 


దెబ్బతింటున్న కేంద్ర లక్ష్యం 

చిన్న, సన్నకారు రైతులకు యంత్ర పరికరాలను దగ్గర చేయాలనే లక్ష్యంతో వేలకోట్ల రూపాయలు వెచ్చించి కేంద్ర ప్రభుత్వం కస్టమ్‌ హైరింగ్‌ సెంట ర్లను రూపకల్పన చేయగా, ఒక్కరూపాయి రాష్ట్ర వాటా లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత పథకాన్ని తమదిగా చెప్పుకుంటూ వైఎస్సార్‌ యంత్ర సేవ పేరుతో సీహెచ్‌సీలకు యంత్ర పరిక రాలను అందించింది. అయితే ఇక్కడ సంబంధిత పథకానికి పూర్తిస్థాయిలో కేంద్రం నిధులు అందిస్తుండగా, రాష్ట్రప్రభుత్వం మాత్రం సొమ్ము ఒకడిది సోకు ఒకడిది అన్నచందాన రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్రాన్ని ట్రాక్టర్లు, ఇతర పరికరాలపై ముద్రించి, సీహెచ్‌సీ లకు పంపింది.అయితే సదరు పరికరాలపై స్థానిక అధికార పార్టీ నాయకులు రైతు గ్రూపుల ముసు గులో సీఎం బొమ్మను సైతం తొలగించి యంత్ర పరికరాలను ప్రభుత్వం సబ్సిడీపై సీహెచ్‌ సీలకు అందించిందనే విషయం గ్రామీణ ప్రాంతాల్లోని  రైతులకు తెలియనివ్వకుండా స్వప్రయోజనాలకు వినియోగిస్తున్నారనే ఆరోపణలు వున్నాయి.


Updated Date - 2022-09-08T05:37:32+05:30 IST