కులం పేరుతో తిట్లు..ఇంకానా?

ABN , First Publish Date - 2021-10-19T06:40:40+05:30 IST

‘‘కులం పేర్లను ఇప్పటికీ తిట్టుపదాలుగా వాడుతున్నారు. రాజకీయ నేతల వాదవివాదాల్లో, సినిమాల్లో ఈ పదాలు యధేచ్ఛగా వాడేస్తున్నారు. మా కులాలను అవమానిస్తున్నారు. మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నారు’’ అంటూ కొన్ని కులాల ప్రతినిధులు బీసీ కమిషన్‌ ఎదుట తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

కులం పేరుతో తిట్లు..ఇంకానా?
బీసీ కమిషన్‌ చైర్మన్‌ శంకర నారాయణకు వినతి పత్రం అందజేస్తున్న ఎంబీసీ ఫెడరేషన్‌ అధ్యక్షకార్యదర్శులు

బీసీ కమిషన్‌ ముందు పలు కుల సంఘాల ఆవేదన


కుల సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఫిర్యాదులు


తిరుపతి (విశ్వవిద్యాలయాలు), అక్టోబరు 18: ‘‘కులం పేర్లను ఇప్పటికీ తిట్టుపదాలుగా వాడుతున్నారు. రాజకీయ నేతల వాదవివాదాల్లో, సినిమాల్లో ఈ పదాలు యధేచ్ఛగా వాడేస్తున్నారు. మా కులాలను అవమానిస్తున్నారు. మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నారు’’ అంటూ కొన్ని కులాల ప్రతినిధులు బీసీ కమిషన్‌ ఎదుట తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.వెనుకబడిన కులాల సమస్యలపై తిరుపతిలోని మహిళా విశ్వవిద్యాలయంలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో సోమవారం రాష్ట్ర బీసీ కమిషన్‌ బహిరంగ విచారణ చేపట్టింది. పలు సంఘాల ప్రతినిధులు తమ సమస్యలను కమిషన్‌ దృష్టికి తీసుకువచ్చారు. వినతిపత్రాలు సమర్పించారు.  ఈ సందర్భంగా కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ శంకర నారాయణ మాట్లాడుతూ, సమాజంలో కులాల మధ్య అంతరాలను తొలగించి సమానత్వాన్ని సాధించడానికి బీసీ కమిషన్‌ కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగానే క్షేత్రస్థాయిలో బడుగు, బలహీన వర్గాల సమస్యలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందజేస్తామన్నారు. అన్ని జిల్లాల్లో పర్యటించి బీసీ వర్గాల వాస్తవ స్థితిగతులను అధ్యయనం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్‌ సభ్యులు ఎం.కృష్ణప్ప, వెంకట సత్య దివాకర్‌ పక్కి, అవ్వారు ముసలయ్య, సభ్య కార్యదర్శి చంద్రశేఖరరాజు, మాజీ మంత్రి నరసయ్య గౌడ్‌, జిల్లా బీసీ సంక్షేమ శాఖ డీడీ కుష్బు కొతారియా, పలువురు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.


పెరిక కులస్తులకు కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని హైకోర్టు అదేశాలిచ్చినా ధిక్కరిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని పెరిక కులసంఘం నాయకులు నర్రిశెట్టి వెంకటేశ్వర్లు, వనపర్తి బద్రి కమిషన్‌ దృష్టికి తీసుకువచ్చారు. విద్యార్ధులకు ఇబ్బంది రాకుండా కుల సర్టిఫికెట్లు మంజూరు చేసేలా ఆదేశాలివ్వాలని టీటీడీ పాలకమండలి సభ్యుడు పోకల అశోక్‌కుమార్‌ కోరారు.

తమ కులం పేర్లను తిట్లుగా వాడుతున్నారని పింజారి, ఉప్పర, పిచ్చుకకుంట్ల తదితర కుల సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.

 నాయిబ్రాహ్మణులపై జరుగుతున్న దాడులను, కుల వివక్షను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని వాయిద్య కళాకారుల సంఘం రాష్ట్ర గౌరవ సలహాదారు, నాయీబ్రాహ్మణ సంక్షేమ కమిటీ మాజీ డైరెక్టర్‌ రుద్రకోటి సదాశివం కోరారు.



సేవా వృత్తులు చేస్తున్న చాకలి, మంగలి కులాలను, వస్తుఉత్పత్తి కులాలలైన కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, జాండ్ర, విశ్వబ్రాహ్మణ కులాలను, సమాజంలో నిరాదరణకు గురైన  దొమ్మర, నాగవంశం, కళావంతుల కులాలను, సంచార కులాలైన జంగం, జోగి, చేపల వేటలో ఉండే బెస్త, జాలరి, గంగపుత్ర కులాలను, ఉప్పర, వడ్డెర వంటి వాటిని అత్యంత వెనుకబడిన కులాలు(ఎంబీసీ)గా గుర్తించి, ప్రత్యేకమైన గ్రూపుగా చేర్చాలని ఎంబీసీ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఇనుకొండ సుబ్రహ్మణ్యం, కార్యదర్శి అంబూరు సింధుజ కోరారు. 



రాయలసీమలో సూర్యబలిజ కుల సర్టిఫికెట్లు ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారంటూ ఆ కుల సంఘం నాయకుడు దాసరి కేశవులు కమిషన్‌కు వినతి పత్రం సమర్పించారు.సర్టిఫికెట్‌ కోసం అడిగితే అవమానిస్తున్నారని, చిత్తూరు జిల్లాలో ఈ పరిస్థితి మరీ తీవ్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 


తిరుమలలో తమ సామాజిక వర్గానికి చెందిన వారు శంఖం ఊదిన తర్వాతే సన్నిధి గొల్ల శ్రీవారి ఆలయాన్ని తెరిచే సంప్రదాయాన్ని పునరుద్ధరించాలని  విన్నవించారు.  

ఎంబీసీలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఏపీ బీసీ ఉద్యోగ సంఘం నాయకుడు గోపాల్‌, శాలివాహన సంఘం నాయకుడు బీవీ కేశవులు వినతిపత్రం అందజేశారు.

ఫ వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఏపీ వాల్మీకి, బోయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. 

పెరిక బలిజ, కృష్ణ బలిజ పేరుతో వ్యవహరింపబడుతోన్న తమకు బీసీ ధ్రువీకరణ పత్రం జారీ చేసేలా చర్యలు చేపట్టాలని ఆ కుల సంఘం ప్రతినిధులు కోరారు.

దూదేకుల సామాజిక వర్గానికి ప్రభుత్వం జారీ చేసే కుల ధ్రువీకరణ పత్రంలో దూదేకుల-ముస్ల్లింగా వ్యవహరించాలని కోరారు.



టీటీడీలో బీసీ రిజర్వేషన్లు పక్కాగా అమలు చేయండి


టీటీడీలో బీసీ వర్గాలకు సంబంధించిన రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పక్కగా అమలు చేయాలని బీసీ కమిషన్‌ చైర్మన్‌ శంకర నారాయణ టీటీడీ అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై జరిగిన సమీక్షా సమావేశంలో టీటీడీలో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్ల అమలు వివరాలను పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి, జేఈవో సదా భార్గవి వివరించారు. ఎస్వీబీసీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, గోసంరక్షణ, పూలతో అగరబత్తీలు, దేవతామూర్తుల తయారీ వంటి కార్యక్రమాలను కమిషన్‌ అభినందించింది.టీటీడీ జేఈవో వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-19T06:40:40+05:30 IST