కూర.. కారమే!

ABN , First Publish Date - 2022-05-17T09:06:50+05:30 IST

కూరగాయలను ముట్టుకుంటే మంట పుడుతోంది. ఒకప్పుడు మార్కెట్‌కు వెళ్లి సంచి నిండా కూరగాయలు తెచ్చిన డబ్బులతో ఇప్పుడు ఒక్క పూటకు సరిపోయేలా కూడా రావడంలేదు. మరోవైపు వంటనూనెల ధరలు సలసలమంటున్నాయి. లీటర్‌ ఆయిల్‌ ఏకంగా రూ.200కు చేరువవుతోంది. ఇలా.. ఊహకు కూడా అందని రీతిలో పెరుగుతున్న ధరలతో పేద, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఏమీ కొనలేక, తినలేక అర్ధాకలితో ఉండాల్సిన దుస్థితి నెలకొంటోంది. వ్యాపారులది మాత్రం అన్నింటికీ ఒకే సమాధానం.. అదే, ‘‘పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరిగాయి.. దాంతో అన్ని వస్తువుల ధరలూ పెరుగుతున్నాయి’’. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధ ప్రభావం హైదరాబాద్‌ నగరంలో ఇంకా కొనసాగుతోంది.

కూర.. కారమే!

భగ్గుమంటున్న నూనెలు, కూరగాయల ధరలు

సామాన్యులకు అందనంత స్థాయికి పెరుగుదల

రైతు బజార్‌లో కిలో టమాట రూ.54

బ్రాండెడ్‌ ఆయుల్‌ లీటర్‌ 192, పామాయిల్‌ 142

అదే బాటలో అల్లం, వెల్లుల్లి, ఆవాలు, కారం రేట్లు

భారీగా పెరిగిన పచ్చడి మామిడికాయలధర

బెంబేలెత్తిపోతున్న పేద, మధ్య తరగతి ప్రజలు

ధరల పెరుగుదలలో దేశంలోనే ముందున్న తెలంగాణ

ఏప్రిల్‌ రిటైల్‌ ద్రవ్యోల్బణం 9 శాతంగా నమోదు


కూరగాయలను ముట్టుకుంటే మంట పుడుతోంది. ఒకప్పుడు మార్కెట్‌కు వెళ్లి సంచి నిండా కూరగాయలు తెచ్చిన డబ్బులతో ఇప్పుడు ఒక్క పూటకు సరిపోయేలా కూడా రావడంలేదు. మరోవైపు వంటనూనెల ధరలు సలసలమంటున్నాయి. లీటర్‌ ఆయిల్‌ ఏకంగా రూ.200కు చేరువవుతోంది. ఇలా.. ఊహకు కూడా అందని రీతిలో పెరుగుతున్న ధరలతో పేద, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఏమీ కొనలేక, తినలేక అర్ధాకలితో ఉండాల్సిన దుస్థితి నెలకొంటోంది. వ్యాపారులది మాత్రం అన్నింటికీ ఒకే సమాధానం.. అదే, ‘‘పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరిగాయి.. దాంతో అన్ని వస్తువుల ధరలూ పెరుగుతున్నాయి’’.


హైదరాబాద్‌ సిటీ, మే 16 (ఆంధ్రజ్యోతి): ఉక్రెయిన్‌-రష్యా యుద్ధ ప్రభావం హైదరాబాద్‌ నగరంలో ఇంకా కొనసాగుతోంది. దాదాపు మూడు నెలలుగా వివిధ రకాల నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతోపాటు స్థానికంగా లభించే కూరగాయలు, పండ్ల రేట్లు కూడా కొండెక్కి కూర్చుంటున్నాయి. నగర మార్కెట్‌లో వంటనూనె ధర మూడు నెలల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం ప్రతి ఆయిల్‌ ప్యాకెట్‌పైనా 10-30 శాతం పెరిగింది. రిటైల్‌ దుకాణాల్లో మరింత ఎక్కువగా ఉంటోంది. క్రూడాయిల్‌ ధరలు పెరగడం, ఇతర దేశాల నుంచి వంటనూనెల దిగుమతి భారీగా తగ్గడంతో.. డిమాండ్‌ పెరిగి వ్యాపారులు దోపిడీకి పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తూ ఇష్టారాజ్యంగా రేట్లు పెంచుతున్నారు. హోల్‌సేల్‌ మార్కెట్లలో వంటనూనెల ధరలు ఓ మాదిరిగా ఉన్నప్పటికీ.. రిటైల్‌ దుకాణాల్లో అడ్డగోలుగా దోచుకుంటున్నారు. బ్రాండెడ్‌ ఆయిల్‌ను కొన్ని దుకాణాల్లో లీటర్‌ రూ.200 వరకు విక్రయిస్తున్నారు. పామాయిల్‌ ధర కూడా గతంలో లీటర్‌కు రూ.128 ఉండగా.. ప్రస్తుతం రూ.142కు అమ్ముతున్నారు. ప్రతి రకం వంటనూనె రేట్లనూ పెంచేశారు. దీంతో అన్ని వర్గాల ప్రజలూ ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా నెలవారీ బడ్జెట్‌పై ఆధారపడిన వేతన జీవుల ఆర్థిక అంచనాలు తారుమారవుతున్నాయి. గతంలో సరుకుల కొనుగోలు సందర్భంగా మూడు, నాలుగు నూనె ప్యాకెట్లు కొనుగోలు చేసిన వారు.. తాజాగా రెండు ప్యాకెట్లతోనే సరి పెట్టుకుంటున్నారు. 


ధరలతో కూర‘గాయాలు’..!

ఓ వైపు పెరిగిన ఆయిల్‌ ధరలతో ప్రజలు సతమతమవుతుండగా.. మరోవైపు కూరగాయల ధరలు ఇబ్బందికి గురిచేస్తున్నాయి. గతంలో రూ.100కు నాలుగైదు రకాల కూరగాయలు సంచి నిండా రాగా.. ప్రస్తుతం ఆకాశాన్నంటుతున్న ధరలతో ఒకటి, రెండు రకాల కూడా రావడంలేదు. ప్రధానంగా కూరగాయల్లో అందరూ ఇష్టపడే టమాట రేటు అందనంత స్థాయికి ఎగబాకుతోంది. నెల రోజుల క్రితం సరూర్‌నగర్‌ రైతుబజార్‌లో కిలో రూ.10 పలికిన టమాట ధర.. తాజాగా సోమవారం రూ.54కు చేరింది. కాగా, కాలనీల్లోని దుకాణాల్లో రూ.80, సూపర్‌మార్కెట్లలో రూ.100 ఉంది. టమాటతోపాటు పచ్చిమిర్చి, కాకరకాయ, ఫ్రెంచ్‌బీన్‌ రేట్లు మండిపోతున్నాయని, అసలు కూరగాయల మార్కెట్‌కు వెళ్లాలంటేనే భయమేస్తోందని ప్రజలు వాపోతున్నారు. 


మామిడి పచ్చడికి దూరం..

వేసవికాలం రాగానే ప్రజలందరూ మామిడికాయ పచ్చడి పెట్టుకుంటుంటారు. ఏటా మార్చి నుంచి మే చివరి వరకు మామిడి సీజన్‌ నడుస్తుంది. హైదరాబాద్‌కు ఎక్కువగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కొల్లాపూర్‌ నుంచి పచ్చడి కాయలు వస్తుంటాయి. ఇబ్రహీంపట్నం, అచ్చంపేట, కల్వకుర్తి, వనపర్తి, నల్లగొండతోపాటు ఏపీలోని కృష్ణా, అనంతపురం జిల్లాల నుంచి తినే మామిడి కాయలు దిగుమతి అవుతుంటాయి. అయితే  ఈసారి మామిడికాయలు చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలు కురిసి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో వచ్చిన కాయలను ఆయా ప్రాంతాల రైతులు లారీలు, డీసీఎంలలో ఢిల్లీ మార్కెట్‌కు తరలిస్తున్నారని, దీంతో నగరంలో మామిడికాయల కొరత ఏర్పడుతోందని మార్కెట్‌ అధికారులు చెబుతున్నారు. గతేడాది పచ్చడి కాయల ధర టన్నుకు రూ.15 వేలు ఉండగా, ఈసారి రూ.20 వేలు ఉందని  పేర్కొంటున్నారు. కాగా, కొన్ని ప్రాంతాల్లో చిన్న సైజు పచ్చడికాయకు రూ.8 నుంచి 10 తీసుకుంటున్నారు. పెద్ద సైజుకు రూ.20 నుంచి రూ.25కు అమ్ముతున్నారు. ఇక మామిడి పండ్ల ధర గతంలో టన్ను (క్వాలిటీ ఉన్నవి)కు రూ.33 వేలు ఉండగా.. ప్రస్తుతం రూ.65 వేలు పలుకుతోంది. ఇదిలా ఉండగా మామిడికాయలతోపాటు పచ్చడి తయారీకి కావాల్సిన నూనె, ఆవాలు, అల్లం, వెల్లుల్లి, కారం రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో సామాన్య ప్రజలు కనీసం పచ్చడి మెతుకులు కూడా తినలేని పరిస్థితి ఏర్పడింది.

 

అకాల వర్షాలు.. రవాణా చార్జీలు..

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం కారణంగా డీజిల్‌ ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. దీంతో రైతుల నుంచి నేరుగా సరుకును కొనుగోలు చేసే వ్యాపారులు డీజిల్‌ రేట్లను సాకుగా చూపిస్తూ కూరగాయలు, పండ్ల రేట్లను అమాంతంగా పెంచుతున్నారు. అకాల వర్షాలతో పంటలు దెబ్బతింటుండడంతో రైతులు అటు ఇటుగా చూసుకుని వ్యాపారులకు సరుకును అప్పగిస్తునప్పటికీ.. మార్కెట్లకు వచ్చేసరికి వారు కృత్రిమ కొరత సృష్టించి ధరల దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రభుత్వమే చొరవ చూపి ధరలను నియంత్రించాలని పలువురు కోరుతున్నారు. 


తెలంగాణలో అధిక ధరల పోటు 

ధరల పెరుగుదలలో తెలంగాణ రాష్ట్రం.. దేశంలోని ఇతర  రాష్ట్రాల కంటే ముందుంది. ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా రిటైల్‌ ద్రవ్యోల్బణం గత ఎనిమిదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా 7.8 శాతంగా నమోదైంది. అయితే తెలంగాణ, హరియాణ, మధ్యప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌  రాష్ట్రాల్లో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఏకంగా 9 శాతంగా నమోదైంది. పశ్చిమ బెంగాల్‌, మధ్యప్రదేశ్‌ 9.1 శాతంతో దేశంలోనే అగ్రస్థానంలో ఉండగా, తెలంగాణ, హరియాణ 9 శాతంతో తర్వాతి స్థానంలో నిలిచాయి. ఇదే సమయంలో కేరళలో 5.1 శాతం, తమిళనాడులో 5.4 శాతం మాత్రమే రిటైల్‌ ద్రవ్యోల్బణం నమోదు కావడం గమనార్హం. మరో ఏడు రాష్ట్రాల్లో 8 శాతం దాటిపోయింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంతో తలెత్తిన సరఫరా సమస్యలతో రిటైల్‌ మార్కెట్లో ధరల పోటు బాగా పెరిగిపోవడమే ఇందుకు కారణం. తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాల్లో అధిక పెట్రో పన్నులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా ఉండడం అధిక రిటైల్‌ ద్రవ్యోల్బణానికి దారి తీస్తోందని ప్రముఖ ఆర్థికవేత్త డీకే జోషి  అభిప్రాయపడ్డారు. 

Updated Date - 2022-05-17T09:06:50+05:30 IST