ఉపాధ్యాయులకు ఊరట

ABN , First Publish Date - 2022-06-21T05:26:49+05:30 IST

పరస్పర బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

ఉపాధ్యాయులకు ఊరట


  • అండర్‌ టేకింగ్‌ ఇచ్చిన ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీ
  • జిల్లా నుంచి ఇతర జిల్లాలకు 304 మంది ఉపాధ్యాయులు
  • ఆ జిల్లాల నుంచి అంతే సంఖ్యలో  బదిలీ
  • అడిగినంత ముట్టజెప్పితేనే పరస్పర బదిలీకి అంగీకారం
  • వికారాబాద్‌  జిల్లాలో రూ.22 లక్షలు పలికిన బదిలీ రేటు!

పరస్పర బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగ, ఉపాధ్యాయుల నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిశీలించిన ప్రభుత్వం ఎట్టకేలకు పరస్పర బదిలీలకు అవకాశం కల్పించింది.  ఇందుకు సంబంధించి సోమవారం ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఇతర శాఖల్లో పరస్పర బదిలీపై ఎంతమంది బదిలీ అయ్యారనే సమాచారంపై మంగళవారం నాటికి స్పష్టత వచ్చే  అవకాశం ఉంది.  అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పరస్పర బదిలీల్లో పెద్ద ఎత్తున బేరసారాలు చోటు  చేసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది.

వికారాబాద్‌, జూన్‌20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : పరస్పర బదిలీల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో ఆనందం వెల్లువిరుస్తోంది. బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ ఆకాంక్ష సాకారం చేసుకునేందుకు వివిధ మార్గాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తీసుకు వస్తున్నారు. భార్యాభర్తల (స్పౌజ్‌) బదిలీ అంశం ఎటూ తేలకపోవడంతో కనీసం పరస్పర బదిలీకైనా అవకాశం కల్పించాలంటూ ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల రాష్ట్ర నాయకులు సంబంధిత ఉన్నతాధికారులు, సంబంధిత శాఖల మంత్రులపై పెద్ద ఎత్తున ఒత్తిళ్లు తీసుకు వచ్చారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిశీలించిన ప్రభుత్వం ఎట్టకేలకు పరస్పర బదిలీలకు అవకాశం కల్పించింది. పరస్పర బదిలీలు కోరుకుంటున్న వారి నుంచి గత మార్చి ఒకటో తేదీ నుంచి అదేనెల 15వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించింది. సాధారణంగా ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు బదిలీ అయ్యే ఉద్యోగ, ఉపాధ్యాయుల సర్వీ్‌సను జీరోగా పరిగణిస్తారు. జీవో 317 ద్వారా ఇతర జిల్లాలకు కేటాయించిన ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ సర్వీసుకు నష్టం జరగకుండా పరస్పర బదిలీలకు అవకాశం కల్పించాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చారు.  పరస్పర బదిలీలపై కొందరు హైకోర్టును ఆశ్రయించగా కేసు జూలై 18వ తేదీకి వాయిదా పడింది. ఈ బదిలీల్లో సీనియారిటీ అంశమనేది హైకోర్టు తీర్పునకు లోబడి ఉంటుదంటూ పరస్పర బదిలీలకు సంబంధించిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. వివిధ అంశాలను పరిశీలించిన ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు పచ్చజెండా ఊపింది. ఉపాధ్యాయుల పరస్పర బదిలీలపై సమీక్ష నిర్వహించిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని సోమవారం విద్యా శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో జిల్లా వ్యాప్తంగా 304మంది ఉపాధ్యాయులు లబ్ధి పొందనున్నారు. ఇతర జిల్లాల నుంచి వికారాబాద్‌ జిల్లాకు రావడానికి, ఈ జిల్లా నుంచి ఇతర జిల్లాలకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయుల్లో 304 మంది పరస్పర బదిలీకి తమ అంగీకారం తెలియజేస్తూ అండర్‌ టేకింగ్‌ ఇచ్చారు. ఇతర శాఖల్లో పరస్పర బదిలీపై ఎంత మంది బదిలీ అయ్యారనే సమాచారంపై స్పష్టత లేదు. మంగళవారం నాటికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

పెద్ద ఎత్తున బేరసారాలు!

పరస్పర బదిలీల్లో పెద్ద ఎత్తున బేరసారాలు చోటు చేసుకున్నాయి. జీవో 317 కారణంగా తమ నివాస ప్రాంతాలకు దూరంగా నియామకమైన ఉద్యోగ, ఉపాధ్యాయులు అయిదారు నెలలుగా తమ సొంత ప్రాంతానికి వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. పరస్పర బదిలీలకు దరఖాస్తు చేసుకునందుకు ప్రభుత్వం గత ఫిబ్రవరి నెలలో షెడ్యూల్‌ జారీ చేసింది. జీవో 317 కారణంగా రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్‌ తదితర జిల్లాల నుంచి వికారాబాద్‌ జిల్లాకు వచ్చిన ఉద్యోగ, ఉపాధ్యాయులు తిరిగి తమ  సొంత ప్రాంతాలకు వెళ్లడానికి తమ స్థానంలో ఆ జిల్లాల నుంచి పరస్పర బదిలీపై ఇక్కడకు వచ్చే వారికోసం తీవ్రంగా అన్వేషించారు. ఎదుటి ఉద్యోగుల అవసరాన్ని ఆసరాగా తీసుకుని పరస్పర బదిలీపై వచ్చే ఉద్యోగులు తమకు గుడ్‌విల్‌ రూపంలో పెద్ద మొత్తంలో ముట్టజెప్పాలంటూ డిమాండ్‌ చేసినట్లు ఉద్యోగ వర్గాల్లో ప్రచారంలో ఉంది. రంగారెడ్డి, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లో 24 శాతం హెచ్‌ఆర్‌ఏ వర్తించే ప్రాంతాల నుంచి వికారాబాద్‌ జిల్లాకు వచ్చే ఉద్యోగులు ముఖ్యంగా ఉపాధ్యాయులు పెద్ద మొత్తంలో ఆశించారు. వికారాబాద్‌ జిల్లా నుంచి రంగారెడ్డి, మేడ్చల్‌ -మల్కాజ్‌గిరి జిల్లాలకు వెళ్లడానికి దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులు, అక్కడి నుంచి వచ్చే వారిలో కొందరికి గుడ్‌విల్‌ రూపంలో రూ.10 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు ముట్టజెప్పినట్లు ప్రచారంలో ఉంది. హెచ్‌ఆర్‌ఏ, పోస్టింగ్‌ ప్రాంతం ఆధారంగా ఈ గుడ్‌విల్‌ ఆఫర్‌లో హెచ్చుతగ్గులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒకే కేడర్‌, సేమ్‌ సబ్జెక్ట్‌ ఉపాధ్యాయులు లభించడం కష్టతరం కావడంతో అవతలి వారు అడిగినంత ఇవ్వాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వికారాబాద్‌ జిల్లా  నుంచి పాత జిల్లాకు వెళ్లే ఒకరు అక్కడి నుంచి వచ్చే ఒకరికి ఏకంగా రూ.22 లక్షలు ముట్టజెప్పి అండర్‌ టేకింగ్‌ తీసుకున్నారంటే పరస్పర బదిలీల్లో ఏ మేర డబ్బులు చేతులు మారాయనేది ఊహించవచ్చు. పరస్పర బదిలీ కోసం ఇద్దరు ఉద్యోగుల మధ్య మొదట ఒప్పందమైనా ఆ తరువాత డబ్బుల చెల్లింపుల్లో పరస్పరం అంగీకారం కుదరక అండర్‌ టేకింగ్‌ ఇవ్వని ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఏది ఏమైనా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పరస్పర బదిలీల్లో పెద్ద ఎత్తున బేరసారాలు చోటు చేసుకోవడం గమనార్హం.

Updated Date - 2022-06-21T05:26:49+05:30 IST