కోఆపరేటివ్‌ రూరల్‌ బ్యాంకులో అవినీతి?

ABN , First Publish Date - 2021-10-17T05:16:59+05:30 IST

జిల్లాలో రైతు సేవలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఇందుకూరుపేట కో ఆపరేటివ్‌ రూరల్‌ బ్యాంకులో అవినీతి వెలుగు చూస్తోంది.

కోఆపరేటివ్‌  రూరల్‌ బ్యాంకులో అవినీతి?
కోఆపరేటివ్‌ రూరల్‌ బ్యాంకు

ఇందుకూరుపేట, అక్టోబరు 16 : జిల్లాలో రైతు సేవలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఇందుకూరుపేట కో ఆపరేటివ్‌ రూరల్‌ బ్యాంకులో అవినీతి వెలుగు చూస్తోంది. కొత్త చైర్మన్‌గా మావులూరు శ్రీనివాసులురెడ్డి బాధ్యతలు చేపట్టాక ఈ మేరకు రైతులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇందుకూరుపేటకు చెందిన ఒక రైతు దాదాపు రూ.75లక్షల రుణం కావాలని తన పేరు, బినామీ పేర్లపై బ్యాంకుకు దరఖాస్తు చేశాడు. ఆ రుణం రాపూరు ప్రాంతంలో భూమి కొనుగో లుకు అని  తెలియడంతో సభ్యులు అంగీకరించలేదు. రైతు తన సమీప బంధువు కావడంతో పాత చైర్మన్‌ రుణం మంజూరు చేశారని రైతులు ఫిర్యాదు చేశారు. మండల పరిధి దాటి కొనుగోలుకు బ్యాంకు చట్టం అనుమతి ఇవ్వదని, నిబంధనలకు వ్యతిరేకంగా అప్పటి పాలకులు పనిచేశారని సిబ్బంది సైతం అంటున్నారు. అలాగే గంగపట్నంకు చెందిన రైతు భూమి డాక్యుమెంట్లు తాకట్టు పెట్టుకొని రూ.10లక్షల రుణం ఇచ్చారు.  రుణం తిరిగి చెల్లించకుండానే ఆ డాక్యుమెంట్లను రైతుకు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ రైతు ఆ డాక్యుమెంట్లను మరో బ్యాంకులో పెట్టి రుణం తీసుకున్నారని, ఆ తర్వాత ఆ భూమిని కూడా అమ్మేశాడని బ్యాంకు చైర్మన్‌ దృష్టికి వచ్చింది. ఇందుకూరుపేటకు చెందిన మరో రైతు తన భూమి డాక్యుమెంట్ల ద్వారా రుణం తీసుకుని, వడ్డీతోపాటు మొత్తం చెల్లించాడు. అయినా ఇంతవరకు తనకు డాక్యుమెంట్లు ఇవ్వలేదని బాధిత రైతు ఫిర్యాదు చేశాడు. బ్యాంకు కార్యదర్శిగా పనిచేస్తున్న అధికారి కూడా  తాను ఇక్కడ పనిచేయలేనని, మరో చోటకు బదిలీ చేయాలని కోరుతుండడం బ్యాంకు అవినీతి పరాకాష్టకు చేరిందనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ అవినీతి అంతా ఇటీవల జరిగిన బ్యాంకు కమిటీ సర్వసభ్య సమావేశంలోనే చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.

డాక్యుమెంట్లు ఇవ్వడంలేదు

రుణం చెల్లించి 18 నెలలు దాటింది. నా డాక్యుమెంట్లు ఇవ్వకపోగా రూ.200 పెట్టి నకళ్లు తీసుకోవాలని గతంలో పని చేసిన చైర్మన్‌ చెప్పారు. అందుకే ఫిర్యాదు చేశాను.

సూరిబాబు, రైతు 

చర్యలు చేపడుతున్నాం 

అవినీతి మాత్రం జరిగింది. చర్యలు చేపడుతున్నాం. ఎవరినీ ఉపేక్షించేది లేదు. అవసరమైతే క్రిమినల్‌ చర్యలు చేపడతాం. 

 ఎం.శ్రీనివాసులురెడ్డి, బ్యాంకు చైర్మన్‌

Updated Date - 2021-10-17T05:16:59+05:30 IST