కరెంట్‌ బంద్‌!

ABN , First Publish Date - 2022-08-19T07:17:57+05:30 IST

బహిరంగ విపణిలో కరెంట్‌ కొనుగోళ్లు, అమ్మకాలు జరపకుండా తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది.

కరెంట్‌ బంద్‌!

ఓపెన్‌ యాక్సెస్‌లో కొనేది, అమ్మేది లేదు

నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం


తెలంగాణ, ఏపీ సహా 13 రాష్ట్రాలపై ఆంక్షలు

బకాయిలు భారీగా పెరగడమే కారణం

రూ.1,380 కోట్లతో తెలంగాణ అగ్రస్థానం

బకాయిల్లేవన్న ట్రాన్స్‌కో సీఎండీ 

కేంద్రంపై 22న కోర్టు ధిక్కార పిటిషన్‌

రాష్ట్రంలో నేటి నుంచి కరెంట్‌ కోతలు?

సంకేతాలిచ్చిన విద్యుత్తు సంస్థలు

ఆంధ్రప్రదేశ్‌ బకాయిలు రూ.412 కోట్లు


హైదరాబాద్‌, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): బహిరంగ విపణిలో కరెంట్‌ కొనుగోళ్లు, అమ్మకాలు జరపకుండా తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిషేధం శుక్రవారం తెల్లవారుజాము నుంచి (19వ తేదీ) అమల్లోకి రానుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌  సహా 13 రాష్ట్రాలపై ఈ నిషేధం విధించారు. ఈ మేరకు విద్యుత్‌ క్రయవిక్రయాల లావాదేవీలు నిర్వహించే పవర్‌ సిస్టమ్‌ ఆపరేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(పోసోకో), ఇండియన్‌ ఎనర్జీ ఎక్స్ఛేంజ్‌ లిమిటెడ్‌(ఐఈఎక్స్‌), పవర్‌ ఎక్స్ఛేంజ్‌ ఇండియా లిమిటెడ్‌(పీఎక్స్‌ఐఎల్‌), హిందూస్థాన్‌ పవర్‌ ఎక్స్ఛేంజ్‌ లిమిటెడ్‌(హెచ్‌పీఎక్స్‌) సంస్థలకు ఆదేశాలు అందాయి. వెనువెంటనే నిషేధం అమలులోకి రానుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, మణిపూర్‌, మిజోరం, తమిళనాడు, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, బిహార్‌, జార్ఖండ్‌, జమ్మూ కశ్మీర్‌లలోని 27 పంపిణీ సంస్థలకు (డిస్కమ్‌లు) ఈ నిషేధం వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా జెన్‌కోలకు రూ.5 వేల కోట్ల దాకా ఆయా డిస్కమ్‌లు బాకీలు పడ్డాయి. అందులో తెలంగాణ డిస్కమ్‌లు రూ.1380 కోట్ల బకాయిలతో అగ్రస్థానంలో ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో తమిళనాడు(రూ.924 కోట్లు), రాజస్థాన్‌(రూ.500 కోట్లు), జమ్మూకశ్మీర్‌(రూ.434 కోట్లు), ఏపీ(రూ.412 కోట్లు), మహారాష్ట్ర (రూ.381 కోట్లు), ఛత్తీస్‌గఢ్‌(రూ.274 కోట్లు), మధ్యప్రదేశ్‌(రూ.230 కోట్లు), జార్ఖండ్‌(రూ.214 కోట్లు), బిహార్‌(రూ.172 కోట్లు) ఉన్నాయి.


చివరి అస్త్రంగా 

విద్యుత్తు కొనుగోళ్ల బకాయిలను నిర్ణీత వ్యవధిలోగా చెల్లించని డిస్కమ్‌లను దారిలో పెట్టడానికి కేంద్రం ఆర్నెల్ల క్రితం సర్‌ఛార్జి విధానాన్ని తీసుకొచ్చింది. జెన్‌కోలు బిల్లు జారీ చేసిన రెండున్నర నెలల్లో బకాయిలు చెల్లించకపోతే ప్రతినెలా 0.5ు సర్‌ఛార్జీ కింద వసూలు చేయాలని అందులో ప్రతిపాదించారు. అయినప్పటికీ చెల్లింపులు చేయకపోతే జెన్‌కోలకు విద్యుత్‌ సరఫరాను కుదించే అధికారం ఉంది.


డిస్కమ్‌లు జెన్‌కోల బకాయిలు చెల్లించడానికి వాయిదాల పద్ధతిని కూడా ఈ రూల్స్‌లో ప్రతిపాదించారు. వాయిదాల గడువు మీరితే ఆలస్య రుసుము విధిస్తారు. సౌర, పవన విద్యుత్‌ ఉత్పత్తిదారులకు డిస్కమ్‌లు సకాలంలో చెల్లింపులు చేయడం లేదనే ఫిర్యాదులతోనే ఈ రూల్స్‌ ను సిద్ధం చేశారు. చివరి అస్త్రంగా విద్యుత్‌ ఎక్స్ఛేంజీల్లో కొనుగోళ్లు, అమ్మకాలు జరపకుండా నిషేధం విధిస్తారు. బకాయిలు చెల్లించని డిస్కమ్‌లకు విద్యుత్‌ను నియంత్రించే అధికారం ప్రాంతీయ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌(ఆర్‌ఎల్‌డీ)కి అప్పగించారు. 


నేటి నుంచి కరెంట్‌ కోతలు

కేంద్రం తాజా నిర్ణయంతో రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరా వ్యవస్థలో కుదుపు ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణలో గురువారం ఉదయం 7:58 గంటల సమయంలో 12,144మెగావాట్ల డిమాండ్‌ నమోదైంది. గతేడాది ఇదే సమయంతో పోల్చితే డిమాండ్‌ 3481 మెగావాట్లు అధికంగా నమోదైంది. శుక్రవారం నుంచి రాష్ట్రంలో విద్యుత్‌ అవసరాలు తీర్చలేని పరిస్థితి నెలకొనే అవకాశాలున్నాయి. కరెంట్‌ కోతలు తప్ప మరో మార్గం లేదని భావిస్తున్నారు. ఇదే విషయమై ముందస్తు సంకేతాలిస్తూ వినియోగదారులు సహకరించాలని విద్యుత్‌ సంస్థలు పిలుపునిచ్చాయి. దాంతో ఇదివరకు లాగే వ్యవసాయ వినియోగదారులతో పాటు గ్రామాలు, మండల కేంద్రాల్లో కరెంట్‌ కోతలు అమలు కానున్నాయి. ప్రస్తుతం తెలంగాణవ్యాప్తంగా జలాశయాలన్నీ నిండుగా ఉండటంతో జల విద్యుత్‌ కూడా జోరుగా ఉత్పత్తవుతోంది. రోజుకు 46 మిలియన్‌ యూనిట్ల దాకా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఇక జెన్‌కోకు చెందిన థర్మల్‌ కేంద్రాల నుంచి 61 మిలియన్‌ యూనిట్ల దాకా ఉత్పత్తి అవుతుంది. ఎన్టీపీసీ, ఛత్తీస్‌గఢ్‌, ఇతర విద్యుత్‌ సంస్థలతో ముందుగానే చేసుకున్న పీపీఏల కింద మరో 70 మిలియన్‌ యూనిట్లు వస్తుంది. రాష్ట్రంలో రోజుకు సగటున 200మిలియన్‌ యూనిట్ల దాకా విద్యుత్‌ వినియోగం ఉంటుంది. ఇందులో దాదాపు ఓపెన్‌యాక్సె్‌స నుంచి కరెంట్‌ కొనుగోలు చేసే వాటా 30 మిలియన్‌ యూనిట్ల దాకా(15 శాతం) ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం గత రెండు రోజులుగా ఓపెన్‌ యాక్సె్‌సలో 580 మెగావాట్లు, 1984 మెగావాట్ల చొప్పున కరెంటు కొనుగోలు చేసింది. విద్యుత్‌ డిమాండ్‌ అధికంగా ఉన్నపుడు కొంటూ, డిమాండ్‌ లేని సమయంలో తనకు అదనంగా అందుబాటులో ఉన్న విద్యుత్‌ను అమ్ముతూ ఎక్ఛ్ఛేంజీల ద్వారా తెలంగాణ విద్యుత్‌ సంస్థలు ఎంతో లాభపడుతున్నాయి. కేంద్రం తాజా నిర్ణయంతో కొనుగోళ్లు, విక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. దాంతో పీక్‌ సమయాల్లో విద్యుత్‌ కోతలు విధిస్తూ డిమాండ్‌ లేని సమయాల్లో ఉత్పత్తిని తగ్గించుకుంటూ ఇబ్బంది పడాల్సి వస్తుంది.

Updated Date - 2022-08-19T07:17:57+05:30 IST