సెల్ఫ్‌ రీడింగే దిక్కు..!

ABN , First Publish Date - 2021-05-07T10:11:06+05:30 IST

కరెంటు బిల్లుల జారీ, వసూళ్లపై కొవిడ్‌ ప్రభావం పడింది. ఇంటింటికీ తిరిగి బిల్లులు ఇస్తున్న విద్యుత్‌ సిబ్బంది కరోనా బారిన పడుతున్నారు.

సెల్ఫ్‌ రీడింగే దిక్కు..!

కరెంటు బిల్లులు ఇచ్చే వారిపై వైరస్‌ పంజా

ఒక్కో సెక్షన్‌లో నలుగురైదుగురికి పాజిటివ్‌

ఆధునిక పద్ధతులను పట్టించుకోని ఎస్పీడీసీఎల్‌

ఎన్పీడీసీఎల్‌లో సెల్ఫ్‌ రీడింగ్‌ విధానం అమలు


హైదరాబాద్‌, మే 6 (ఆంధ్రజ్యోతి): కరెంటు బిల్లుల జారీ, వసూళ్లపై కొవిడ్‌ ప్రభావం పడింది. ఇంటింటికీ తిరిగి బిల్లులు ఇస్తున్న విద్యుత్‌ సిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. తెలంగాణలోని రెండు డిస్కమ్‌లలో కరోనా పంజా విసరడంతో ఎన్పీడీసీఎల్‌(వరంగల్‌)లో సెల్ఫ్‌ రీడింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టగా.. ఎస్పీడీసీఎల్‌ మాత్రం ఫిజికల్‌ రీడింగ్‌కే మొగ్గుచూపుతోంది. ఏప్రిల్‌ నెల విద్యుత్‌ వినియోగానికి సంబంధించి ఈనెల 10లోపు రీడింగ్‌ పూర్తి చేసి బిల్లులు అందించాల్సి ఉంది. గత ఏడాది కరోనా ప్రభావంతో రెండు నెలల పాటు పూర్తిగా రీడింగ్‌ నిలిపివేయడంతో ఆ ప్రభావం కరెంటు బిల్లులపై పడింది.


అయితే విద్యుత్‌ సంస్థలకు నిపుణులు ప్రత్యామ్నాయాలను సూచించినా వాటిని యాజమాన్యాలు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. సరిగ్గా ఏడాది తర్వాత కరోనా మళ్లీ పంజా విసిరినప్పటికీ ఉద్యోగులు రీడింగ్‌ తీయాల్సిందేనని సంస్థ పట్టుబట్టడంతో ఆ ప్రభావం క్షేత్రస్థాయి సిబ్బందిపై పడుతోంది. ఒక్కో సెక్షన్‌లో నలుగురైదుగురు కరోనా బారిన పడుతున్నారు. ఇక రీడింగ్‌ తీసేవారిలో 60 శాతం మంది ఆర్టిజన్లే. కరోనా తీవ్రత నేపథ్యంలో ఎన్పీడీసీఎల్‌ సెల్ఫ్‌ రీడింగ్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. టెక్నాలజీ అందుబాటులో ఉన్నా, ఎస్పీడీసీఎల్‌ మాత్రం ఫిజికల్‌ రీడింగ్‌కే ప్రాధాన్యమిస్తోంది. దీంతో ఇప్పటిదాకా 20-30 శాతం ఇళ్లకే మీటర్‌ రీడింగ్‌ పూర్తిచేశారు. ఈ దఫా ఒకటో తేదీ నుంచే రీడింగ్‌ తీయాలని సిబ్బందిని ఎస్పీడీసీఎల్‌ ఆదేశించింది. అయితే రీడింగ్‌కు వెళ్లిన వారిలో 30శాతం మంది కరోనా బారిన పడ్డారు.


ఆధునిక విధానాలకు మంగళం..

రీడింగ్‌ తీసి.. బిల్లును పేపర్‌పై ఇవ్వకుండా అందుబాటులో ఉన్న మొబైల్‌ నంబర్లకు పంపించే విధానాన్ని అనుసరించవచ్చు. ఆటోమేటిక్‌గా వినియోగదారుడి ప్రమేయంతో రీడింగ్‌ తీసే అవకాశం ఉన్నా.. దీన్ని అనుసరించడానికి యంత్రాంగం నిరాకరించింది. అదనపు లోడ్‌ క్రమబద్ధీకరణ సమయంలో ఈ విధానం అమలు చేసినప్పటికీ కష్టకాలంలో దీన్ని అటకెక్కించారు. ఎన్నో పద్ధతులుండగా.. దేనినీ అమలు చేయకుండా డిస్కమ్‌లు చిరుద్యోగుల ప్రాణాలతో ఆడుకుంటున్నాయని విమర్శలు వస్తున్నాయి. 


యాప్‌తో సెల్ఫ్‌ రీడింగ్‌..

ఎన్పీడీసీఎల్‌(వరంగల్‌) పరిధిలో భారత్‌ సెల్ఫ్‌ మీటర్‌ రీడింగ్‌ పేరుతో ఉన్న యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అందులో సెల్ఫ్‌ రీడింగ్‌ అనే ఆప్షన్‌ను క్లిక్‌ చేసి, యూనిక్‌ సర్వీస్‌ నంబర్‌, మొబైల్‌ నంబర్‌ను ఎంటర్‌ చేసి, మీటర్‌ రీడింగ్‌ను స్కాన్‌ చేస్తే వినియోగదారుడి మొబైల్‌కు బిల్లు వస్తుంది. ఏప్రిల్‌ నెల వినియోగం కోసం సెల్ఫ్‌ మీటర్‌ రీడింగ్‌ విధానం అమలు చేయనున్నారు. బిల్లులు కూడా ఆన్‌లైన్‌లో చెల్లించాలని ఎన్పీడీసీఎల్‌ కోరుతోంది.

Updated Date - 2021-05-07T10:11:06+05:30 IST