వంటింట్లో విద్యుత్ స్తంభం.. షాకైన ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-02-24T20:05:25+05:30 IST

విద్యుత్ అనేది ఇప్పుడు ప్రతి ఇంటికీ ప్రధాన అవసరం. అయితే అనంతపురం జిల్లాలో ఓ ఇంటిలో విద్యుత్ స్తంభం కూడా భాగమైపోయింది.

వంటింట్లో విద్యుత్ స్తంభం.. షాకైన ఎమ్మెల్యే

అనంతపురం: విద్యుత్ అనేది ఇప్పుడు ప్రతి ఇంటికీ ప్రధాన అవసరం. అయితే అనంతపురం జిల్లాలో ఓ ఇంటిలో విద్యుత్ స్తంభం కూడా భాగమైపోయింది. అది కూడా వంటింట్లో విద్యుత్ స్తంభం ఉండడం ప్రధాన సమస్యగా మారింది. వంటింట్లో విద్యుత్ స్తంభాన్ని చూసి స్థానిక ఎమ్మెల్యే షాకయ్యారు.


అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని గొట్లూరు గ్రామంలో భాగ్యమ్మ అనే మహిళకు దాదాపు 15 ఏళ్ల క్రితం ప్రభుత్వం నుంచి ఇంటి కోసం స్థలం మంజూరు అయింది. అయితే ఆ స్థలంలో విద్యుత్ స్తంభం ఉంది. ఆమె అప్పుడే ఆ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా అప్పట్లో ఎవరూ స్పందించలేదు. దీంతో చేసేది లేక ఎలాగోలా అక్కడే ఇల్లు నిర్మించుకున్నారు. ఇంటి నిర్మాణంలో ఆ విద్యుత్ స్తంభం వంటింట్లో భాగమైపోయింది. 14 ఏళ్లుగా వంటింట్లో ఆ విద్యుత్ స్తంభంతో భాగ్యమ్మ భయం భయంగా జీవనం సాగిస్తోంది. ఆ విద్యుత్ స్తంభం ఇనుముతో తయారైనది కావడంతో వర్షం పడితే కంటిమీద కునుకు లేకుండా ఉండే పరిస్థితి నెలకొంది. వర్షాకాలంలో వంటింట్లోకి వెళ్లి వంట చేసే పరిస్థితి లేదని, ఆ సమయంలో పక్కింటి వాళ్ల సాయంతో కడుపు నింపుకునేవాళ్లమని భాగ్యమ్మ ఆవేదన వ్యక్తం చేస్తోంది. అయితే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ‘గుడ్ మార్నింగ్ ధర్మవరం’ కార్యక్రమంలో భాగంగా రెండ్రోజుల క్రితం గొట్లూరు గ్రామానికి వెళ్లారు. ఆ సమయంలో బాధితురాలు భాగ్యమ్మ ఎమ్మెల్యేతో తన గోడును వెళ్లబోసుకుంది. వంటింట్లో ఉన్న ఆ విద్యుత్ స్తంభాన్ని చూసి షాకైన ఎమ్మెల్యే.. అధికారులు ఎలా అనుమతి ఇచ్చారంటూ విస్మయం వ్యక్తం చేశారు. ఆ విద్యుత్ స్తంభాన్ని తొలగించి ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. వారంలో రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.





Updated Date - 2021-02-24T20:05:25+05:30 IST