మళ్లీ కరెంట్‌ చార్జీల బాదుడు?

ABN , First Publish Date - 2022-08-19T07:22:00+05:30 IST

మరోసారి కరెంటు చార్జీలను వడ్డించేందుకు డిస్కమ్‌లు సిద్ధం అవుతున్నాయి.

మళ్లీ కరెంట్‌ చార్జీల బాదుడు?

4092 కోట్లు అదనంగా రాబట్టే యత్నం

ట్రూ-అప్‌ వసూలుకు డిస్కమ్‌ల నిర్ణయం

14 ఏళ్ల లోటు పూడ్చుకుంటామని పిటిషన్‌

సెప్టెంబరు 26న ఈఆర్‌సీ విచారణ


హైదరాబాద్‌, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): మరోసారి కరెంటు చార్జీలను వడ్డించేందుకు డిస్కమ్‌లు సిద్ధం అవుతున్నాయి. నాలుగు నెలల క్రితమే రూ.5,596 కోట్ల అంచనా లోటును పూడ్చుకొనే పేరుతో కరెంటు చార్జీలను పెంచారు. తాజాగా డిస్ట్రిబ్యూషన్‌ బిజినెస్‌ ట్రూ అప్‌ పేరిట మరో రూ.4092 కోట్లను  రాబట్టుకోవడానికి డిస్కమ్‌లు సన్నద్ధమయ్యాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(టీఎ్‌సఈఆర్‌సీ) ముందు పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ మొత్తం ఇప్పటి లోటు కాదు. తెలంగాణ ఏర్పడటానికి ముందు 8 ఏళ్ల కాలం, తెలంగాణ ఏర్పడిన తర్వాత 6 ఏళ్ల కాలం కలిసి మొత్తం 14 ఏళ్ల వ్యవధిలో పోగయిన డిస్ట్రిబ్యూషన్‌ బిజినెస్‌ లోటు ఇది. విద్యుత్‌ పంపిణీకి ఈఆర్‌సీ ఆమోదించిన వ్యయం కాకుండా అదనంగా ఖర్చయితే ఆ లోటును పూడ్చుకొనే ప్రయత్నాన్ని డిస్ట్రిబ్యూషన్‌ బిజినెస్‌ ట్రూఅప్‌ అంటారు. వీటి వసూలు కోసం తెలంగాణ డిస్కమ్‌లు రెండూ ఈఆర్‌సీ దగ్గర పిటిషన్లు వేశాయి. 2006-07 సంవత్సరం నుంచి 2020-21 దాకా దక్షిణ డిస్కమ్‌ రూ.3,259 కోట్ల కోసం, ఉత్తర డిస్కమ్‌ రూ.833.23 కోట్ల కోసం పిటిషన్లు వేశాయి.


       మొత్తం రూ.4092 కోట్లను వినియోగదారుల నుంచి రాబట్టుకోవడానికి అనుమతి కోరాయి. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత కానీ ఎన్నడూ లేనంత స్థాయిలో ఇటీవల విద్యుత్‌ చార్జీలను పెంచారు. గృహ వినియోగదారులకు యూనిట్‌కు 0.50 పైసలు, ఎల్‌టీ(లోటెన్షన్‌)లో గృహేతర వినియోగదారులతో పాటు హెచ్‌టీ(హైటెన్షన్‌) వినియోగదారులకు యూనిట్‌కు రూ.1 పెంచారు. చార్జీల పెంపు రూపంతో రూ.5,596 కోట్ల భారం ప్రజలపై పడింది. అయితే డిస్ట్రిబ్యూషన్‌ బిజినెస్‌ ట్రూఅప్‌ కాకుండా రిటైల్‌ ట్రూఅప్‌ కింద వేల కోట్లు రాబట్టుకోవడానికి డిస్కమ్‌లు పిటిషన్లను సిద్ధం చేస్తున్నాయి. విద్యుత్‌ కొనుగోళ్లకు ఈఆర్‌సీ ఆమోదించిన వ్యయం కాకుండా వాస్తవికంగా అయిన వ్యయాన్ని రిటైల్‌ ట్రూఅప్‌ అంటున్నారు. ఇది రూ.35 వేల కోట్ల మేర ఉందని చెబుతున్నా ఇందులో ఎంత మొత్తానికి పిటిషన్లు వేస్తారనేది తెలీదు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి వార్షిక ఆదాయ అవసరాలు(ఏఆర్‌ఆర్‌) దాఖలు చేసే సమయంలో రిటైల్‌  ట్రూఅప్‌ పిటిషన్లు కూడా త్వరలో దాఖలు చేస్తామని డిస్కమ్‌లు చెప్పాయి. 14 ఏళ్ల కాలానికి దాఖలు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ బిజినెస్‌ ట్రూఅ్‌పలో ఆపరేషన్‌ మెయింటెనెన్స్‌ చార్జీలు, మూలధనంపై రాబడి, ఆదాయంపై పన్నులు, భద్రతా చర్యల కోసం ప్రత్యేక కేటాయింపులు, టారిఫేతర ఆదాయం, వీలింగ్‌ చార్జీల ఆదాయం లెక్కలు అంచనాలు తప్పడంతో కొన్ని సంవత్సరాల్లో కమిషన్‌ ఆమోదించిన దానికన్నా అధికంగా ఖర్చయిందని డిస్కమ్‌లు చెబుతున్నాయి. మరికొన్ని సంవత్సరాల్లో ఆమోదించిన దానికన్నా తక్కువగానే ఖర్చయిందని, అన్నింటినీ సర్దుబాటు చేయగా, రూ.4092 కోట్ల అదనపు వ్యయం తేలిందని, దాన్ని డిస్ట్రిబ్యూషన్‌ బిజినెస్‌ ట్రూ అప్‌ కింద రాబట్టుకోవడానికి అనుమతించాలని డిస్కమ్‌లు తమ పిటిషన్లలో కోరాయి. ఈ పిటిషన్లపై వచ్చే నెల 8వ తేదీలోగా టీఎ్‌సఈఆర్‌సీ కార్యాలయంలో గానీ, ఆయా డిస్కమ్‌ల ప్రధాన కార్యాలయాల్లో కానీ అభ్యంతరాలు/సూచనలు/సలహాలు అందించాలని టీఎ్‌సఈఆర్‌సీ నోటిఫికేషన్‌ ద్వారా కోరింది. ఈ పిటిషన్లపై సెప్టెంబరు 26న ఉదయం 11 గంటలకు టీఎ్‌సఈఆర్‌సీ కార్యాలయంలో బహిరంగ విచారణ జరుగనుంది. అనంతరం బిజినెస్‌ ట్రూఅప్‌ కింద ఎంత వసూలు చేసుకోవచ్చనే విషయమై ఈఆర్‌సీ తీర్పు వెలువరించనుంది. 

Updated Date - 2022-08-19T07:22:00+05:30 IST