కోతల్లేని కరెంట్‌..

ABN , First Publish Date - 2020-06-01T11:01:58+05:30 IST

ఆరేళ్ల కింద వేసవి వచ్చిందంటే చాలు విద్యుత్‌ కోతలు.. పరిశ్రమలకు పవర్‌ హాలిడేస్‌.. మిగిలిన రోజుల్లోనూ కరెంటు

కోతల్లేని కరెంట్‌..

హైదరాబాద్‌ సిటీ, మే 31 (ఆంధ్రజ్యోతి): ఆరేళ్ల కింద వేసవి వచ్చిందంటే చాలు విద్యుత్‌  కోతలు.. పరిశ్రమలకు పవర్‌ హాలిడేస్‌.. మిగిలిన రోజుల్లోనూ కరెంటు ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు పోతుందో తెలియదు. ఇది ఆరేళ్ల క్రితం నగర విద్యుత్‌ వ్యవస్థ పరిస్థితి. ఇప్పుడు కరెంట్‌ కోత అన్న మాట వినిపించడం లేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు నాటికి గ్రేటర్‌ పరిధిలో రోజూవారి 55 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం ఉండగా, రోజూ మూడు నుంచి ఆరు గంటల పాటు  కరెంట్‌ కోతలు ఉండేవి. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత 2014 నవంబర్‌ నాటికి కోతలు లేని విద్యుత్‌ను అందిస్తున్నారు. ప్రస్తుతం రోజుకు 70 ఎంయూల నుంచి 72 ఎంయూల  వినియోగం ఉంది. 


మణిహారం మెట్రో... 

 మహానగరానికి మణిహారంగా మెట్రో రైలు ప్రాజెక్టు నిలుస్తోంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు ముందే ఈ పనులు ప్రారంభమైనా, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పనులు ఊపందుకుని దశలవారీగా మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రభుత్వ ప్రైవే టు భాగస్వామ్య ప్రాజెక్టుగా, దేశంలోనే అత్యాధునిక సాంకేతికత కలిగిన వ్యవస్థగా మెట్రో నిలిచింది.  దేశంలోనే మొదటి సారిగా కమ్యూనికేషన్‌ బేస్ట్‌ ట్రైన్‌ కంట్రోల్‌ (సీబీటీసీ) టెక్నాలజీతో డ్రైవర్‌ లేకుండానే మెట్రో రైళ్లు పరుగులు పెట్టాయి. ఎల్‌అండ్‌టీ సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలతో మెట్రో కారిడార్లు, మెట్రో స్టేషన్లను నిర్మించింది. 2017 నవంబర్‌ 29 మొదటిసారిగా మెట్రో సేవలను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఆ తర్వాత 2018, 19, 20లో దశలవారీగా మొత్తం 66 కి.మీ మేర మెట్రో రైళ్లు పరుగులు  పెడుతున్నాయి. సుమారు 52 మెట్రో రైళ్లు, 65 మెట్రో స్టేషన్‌లు,  రెండు మెట్రోల డిపోలు, 66 కి.మీ మెట్రో కారిడర్‌తో దేశంలోనే రెండో అతిపెద్ద మెట్రోగా హైదరాబాద్‌ మెట్రో నిలిచింది. అమీర్‌పేట, ఎంజీబీఎస్‌, పరేడ్‌ గ్రౌండ్‌-జేబీఎస్‌ ప్రాంతాల్లో ఇంటర్‌ చేంజ్‌ స్టేషన్లు ఉన్నాయి. 


 కొత్త కార్పొరేషన్లు..

 ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన తర్వాత నగర  శివారు ప్రాంతాల్లో మరింత మెరుగైన పాలన, అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా గ్రేటర్‌ చుట్టూ కొత్తగా నిజాంపేట, బండ్లగూడ జాగీర్‌, బోడుప్పల్‌, ఫిర్జాదీగూడ, బడంగ్‌పేట, మీర్‌పేట, జవహర్‌నగర్‌లను కార్పొరేషన్లుగా ఏర్పాటు చేశారు. మణికొండ, నార్సింగి, దుండిగల్‌, కొంపల్లి, జల్‌పల్లి, పెద్ద అంబర్‌పేట, తుర్కయాంజాల్‌లు మున్సిపాలిటీలుగా అవతరించాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ తరహాలో ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణ, మెరుగైన మౌలిక వసతులు కల్పించనుండటంతో శివారు ప్రాంతాలన్నీ సరికొత్త నగరాలుగా రూపుదిద్దుకుంటున్నాయి.  


ఆదాయ వనరుగా హెచ్‌ఎండీఏ

 ఉమ్మడిరాష్ట్రంలో కేవలం ఓ ప్రభుత్వ అనుబంధ సంస్థగా మాత్రమే ఉన్నా హెచ్‌ఎండీఏ ఆరేళ్లలో ప్రభుత్వానికి ఆదాయవనరుగా మారింది. ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని ఉప్పల్‌ భగాయత్‌కు శాశ్వత పరిష్కారం చూపడంతో వందలాది మంది రైతులకు స్థలాలు దక్కాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన ఫేజ్‌-1, ఫేజ్‌-2 లేఔట్లలోని ప్లాట్లను రెండు విడతలుగా విక్రయించడం ద్వారా రూ. వెయ్యి కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది. ఇదే తరహాలోనే మరిన్ని ప్రాంతాల్లో ల్యాండ్‌పూలింగ్‌ పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో గల లేఅవుట్లలో మిగిలిపోయిన ప్లాట్లను విక్రయించడం ద్వారా హెచ్‌ఎండీఏ భారీగానే ఆదాయం పొందింది. వేల కోట్ల విలువ చేసే కోకాపేట భూములను సుప్రీంకోర్టు వరకు వెళ్లి దక్కించుకుంది. ఆ భూముల్లో భారీ లేఅవుట్లు వేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. హైటెక్‌ సిటీ తరహాలోనే విజన్‌ సిటీకి హెచ్‌ఎండీఏ రూపకల్పన చేసింది. విజన్‌సిటీ ఏర్పాటైతే  హైదరాబాద్‌ అభివృద్ధిలో ఒక కలికితురాయిగా నిలువనుంది.  శివారులోని కీసర, ప్రతాపసింగారం,  మోకిల, కొర్రెముల, చౌటుప్పల్‌, మేడ్చల్‌ తదితర ప్రాం తాల్లో భూములను సేకరించి ప్లాట్లను చేసేందుకు చర్యలు చేపడుతోంది. 


పరుగులు తీసిన రియాల్టీ

 ఆరు నెలల క్రితం ఆర్థికమాద్యంతో దేశవ్యాప్తంగా రియల్‌ రంగం ఢీలా పడినా, నగరంలో మాత్రం ప్రగతి ఆగలేదు. ఔటర్‌ రింగ్‌ రోడ్డును కేంద్రంగా నిర్మాణాలు, స్థలాల విక్రయాల జోరు కొనసాగుతోంది. వెస్ట్‌ వైపు భారీ కంపెనీలు తప్ప, సాధారణ కంపెనీలు పెట్టుబడులు పెట్టే పరిస్థితి కనిపించడం లేదు. ఐటీ రంగం కోకాపేట, కొల్లూరు తదితర ప్రాంతాలకూ విస్తరించింది. పశ్చిమాన పుంజుకున్న రియల్‌ ఎస్టేట్‌ ప్రస్తు తం అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో  ఐటీ సంస్థలన్నీ కేంద్రీకృతం అవుతుండడంతో పెద్ద సంస్థలు తమ ప్రీమియం ప్రాజెక్ట్‌లను చేపడుతున్నాయి. ఆఫీసు స్పేస్‌కు డిమాండ్‌ పెరగడంతోపాటు అదే స్థాయి లో రెసిడెన్షియల్‌ నిర్మాణాలూ జోరందుకున్నాయి. యాదగిరిగుట్ట క్షేత్రం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టడం, వరంగల్‌-హైదరాబాద్‌ పారిశ్రామిక కారిడార్‌ కావడంతో ఈ మార్గంలో పెద్ద ఎత్తున రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వచ్చా యి.


బెంగళూరు జాతీయ రహదారిలో ఇప్పటికే ఎలకా్ట్రనిక్స్‌ ఉత్పత్తి క్లస్టర్‌ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏరోస్పేస్‌ రంగం, లాజిస్టిక్‌ హబ్స్‌ తోపాటు భవిష్యత్‌లో టౌన్‌షిప్స్‌ వచ్చే అవకాశం ఉండటంతో ఇటువైపూ రియల్‌ రంగం జోరుమీదుంది. శ్రీశైలం, సాగర్‌ మార్గంలో ఫార్మాసిటీ, లాజిస్టక్‌ హబ్స్‌ ఏర్పాటుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం భారీగానే సాగింది. విజయవాడ, నాగ్‌పూర్‌ జాతీయ రహదారిలతోపాటు కరీంనగర్‌ మార్గంలోనూ పెద్దఎత్తున లేఅవుట్లను ఏర్పాటుచేశారు. నాగ్‌పూర్‌ జాతీయ రహదారి వెంట ఔ టర్‌ రింగ్‌రోడ్డు వరకు కొంపల్లి మార్గంలో పెద్దఎత్తున నిర్మాణాలు వచ్చాయి.  

Updated Date - 2020-06-01T11:01:58+05:30 IST