కరెన్సీ నోట్లపై ఒక మూలన కనిపించే ఈ అడ్డ గీతల అర్థమేమిటో తెలుసా? ఇలా ఉండటానికి గల కారణమిదే!

ABN , First Publish Date - 2022-01-09T13:56:07+05:30 IST

నోట్లపై కనిపించే ఈ గీతలను బ్లీడ్ మార్క్స్ అంటారు.

కరెన్సీ నోట్లపై ఒక మూలన కనిపించే ఈ అడ్డ గీతల అర్థమేమిటో తెలుసా? ఇలా ఉండటానికి గల కారణమిదే!

మీరు కరెన్సీ నోట్లను జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక మూలన చిన్నపాటి అడ్డ గీతలు కనిపిస్తాయి. ఇవి ఎందుకు ఉంటాయోనని ఎప్పుడైనా ఆలోచించారా? రూ. 100, 200, 500, 2000 నోట్లపై కనిపించే ఈ లైన్ల వెనుకగల అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

నోట్లపై కనిపించే ఈ గీతలను బ్లీడ్ మార్క్స్ అంటారు. ఈ బ్లీడ్ మార్కులను దృష్టి లోపం ఉన్నవారి కోసం ప్రత్యేకంగా రూపొందిస్తారు. నోటుపై ఉన్న ఈ లైన్లను టచ్ చేసి.. అది ఎన్ని రూపాయల నోటు అనేది చెప్పొచ్చు. రూ. 100, 200, 500, 2000 నోట్లపై ఈ గుర్తులు కనిపిస్తాయి. ఈ గీతలు వాటి విలువను తెలియజేస్తాయి. రూ. 100 నోటుకు రెండు వైపులా నాలుగు లైన్లు ఉంటాయి. రూ. 200 నోటుకు రెండు వైపులా నాలుగు లైన్లు ఉంటాయి. పైగా అక్కడ రెండు సున్నాలు కూడా ఉంటాయి. రూ. 500 నోటుకు 5, రూ. 2000 నోటుకు రెండు వైపులా ఏడేసి లైన్లు చొప్పున ఉంటాయి. ఈ గీతల సహాయంతోనే అంధులకు దాని విలువ ఎంతో తెలుస్తుంది. 


రూ. 2000 నోటు వెనుక వైపు మంగళయాన్ ఫోటో ముద్రితమై ఉంటుంది. ఇది భారతదేశానికి చెందిన మార్స్ మిషన్‌లో భాగం. రూ.500 నోటులో ఎర్రకోట చిత్రం కనిపిస్తుంది. రూ. 200 రూపాయల నోటు వెనుక భాగంలో సాంచి స్థూపం కనిపిస్తుంది. ఇది మధ్యప్రదేశ్‌లోని విదిశా జిల్లాలో ఉంది. రూ. 100 నోటులో 'రాణి కి వావ్' చిత్రం ముద్రితమైవుంటుంది. ఇది గుజరాత్‌లోని పటాన్ జిల్లాలో ఉన్న మెట్ల బావి. దీనిని సోలంకి రాజవంశానికి చెందిన రాణి ఉదయమతి తన భర్త భీమ్‌దేవ్- I జ్ఞాపకార్థం నిర్మించారు. ఇది 2014 సంవత్సరంలో యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు సంపాదించుకుంది. 



Updated Date - 2022-01-09T13:56:07+05:30 IST