గిలానీ మృతితో కశ్మీర్‌లో కర్ఫ్యూ తరహా పరిస్థితి..

ABN , First Publish Date - 2021-09-02T16:56:16+05:30 IST

వేర్పాటువాద నేత సైయద్ అలీ షా గిలానీ మృతి నేపథ్యంలో ముందస్తు చర్యగా కశ్మీర్‌లో కర్ఫ్యూ తరహా పరిస్థితిని ...

గిలానీ మృతితో కశ్మీర్‌లో కర్ఫ్యూ తరహా పరిస్థితి..

శ్రీనగర్: వేర్పాటువాద నేత సైయద్ అలీ షా గిలానీ మృతి నేపథ్యంలో ముందస్తు చర్యగా కశ్మీర్‌లో కర్ఫ్యూ తరహా పరిస్థితిని అధికార యంత్రాంగం విధించింది. గిలానీ నివాసానికి దారితీసే రోడ్లను మూసేశారు. ఆయన ఇంటిచుట్టూ భారీ పోలీసు బలగాలను మోహరించారు. వదంతుల వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపివేయనున్నారు. ఆయన సోపోర్ జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో ఆ జిల్లాలో కఠిన ఆంక్షలు అమల్లోకి తెచ్చారు. శాంతిభద్రతలకు భంగం కలిగే అవకాశాలున్న ప్రాంతాల్లో భారీగా భద్రతా బలగాలను దింపారు.


పాకిస్థాన్ అనుకూలవాది అయిన గిలానీ మూడు దశాబ్దాలుగా జమ్మూకశ్మీర్‌లో వేర్పాటువాద ఉద్యమాన్ని విస్తరించారు. బుధవారం రాత్రి తన నివాసంలో గిలానీ కన్నుమూశారు. 92 ఏళ్ల గిలానీకి ఆరుగురు కుమార్తెలు ఉన్నారు. 1968లో భార్య మరణించినప్పటి నుంచి ఆయన తిరిగి పెళ్లి చేసుకోలేదు. రెండు దశాబ్దాలుగా ఆయన మూత్రపిండాల వ్యాధి, వయోసంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. సోపోర్ నుంచి ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. హురియత్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకుడుగా సభ్యుడైన ఆయన 2000లో దాని నుంచి బయటకు వచ్చి సొంతంగా తెహ్రిక్-ఇ-హురియత్‌ను స్థాపించారు.  1981లో ఆయన పాస్‌పోర్ట్‌ను సీజ్ చేసిన అధికారులు కేవలం 2006లో హజ్ యాత్రకు అనుమతించే విషయంలో మినహా తిరిగి పాస్‌పోర్ట్ ఆయనకు అప్పగించలేదు. ఈడీ, పోలీస్, ఆదాయం పన్ను శాఖ నుంచి ఆయనపై పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కాగా, హైదర్‌పొరలో ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి.

Updated Date - 2021-09-02T16:56:16+05:30 IST