మహారాష్ట్రలోని 4 పట్టణాల్లో Curfew

ABN , First Publish Date - 2021-11-15T13:37:15+05:30 IST

మహారాష్ట్రలోని అమరావతి నగరంలో ఆదివారం బంద్ సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులు నిరసనకు దిగడంతో జిల్లాలోని మరో నాలుగు పట్టణాల్లో కర్ఫ్యూను విస్తరించినట్లు పోలీసులు తెలిపారు....

మహారాష్ట్రలోని 4 పట్టణాల్లో Curfew

అమరావతి: మహారాష్ట్రలోని అమరావతి నగరంలో ఆదివారం బంద్ సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులు నిరసనకు దిగడంతో జిల్లాలోని మరో నాలుగు పట్టణాల్లో కర్ఫ్యూను విస్తరించినట్లు పోలీసులు తెలిపారు.అమరావతి నగరంలో శుక్ర, శనివారాల్లో జరిగిన రాళ్లదాడి ఘటనలకు సంబంధించి మొత్తం 50 మందిని పోలీసులు అరెస్టు చేశారు.ఆదివారం అమరావతిలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని పోలీసులు చెప్పారు. అమరావతిలో స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కు చెందిన ఎనిమిది బెటాలియన్లు, వివిధ జిల్లాల నుంచి అదనపు పోలీసులను నగరంలో మోహరించినట్లు జిల్లా సంరక్షక మంత్రి యశోమతి ఠాకూర్ తెలిపారు.


‘‘అమరావతిలో పరిస్థితి అదుపులో ఉంది, ఎస్సార్‌పీఎఫ్ కు చెందిన ఎనిమిది బెటాలియన్లు జల్నా, నాగ్‌పూర్, వార్ధా, బుల్దానా జిల్లాల నుంచి అదనపు పోలీసు బలగాలను రప్పించాం’’ అని యశోమతి చెప్పారు. పోలీసులు సున్నితమైన ప్రాంతాలలో ప్లాగ్ మార్చ్‌ జరిపారు.అమరావతిలోని గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ బంద్ పాటించింది.శుక్రవారం రాళ్ల దాడికి నిరసనగా ర్యాలీ చేపట్టినందుకు మహారాష్ట్ర మాజీ వ్యవసాయ మంత్రి అనిల్ బోండే, ఎమ్మెల్సీ ప్రవీణ్ పోటే, అమరావతి రూరల్ బీజేపీ అధ్యక్షురాలు నివేదిత చౌదరిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


వరుద్, షెందూర్జనాఘాట్ గ్రామాల్లో నినాదాలు చేసినందుకు మొత్తం 8 మంది బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.అమరావతి జిల్లాలోని మోర్షి, వరుద్, అచల్‌పూర్, అంజన్‌గావ్ సుర్జీ పట్టణాలకు కర్ఫ్యూ విస్తరించినట్లు పోలీసు అధికారి తెలిపారు.

Updated Date - 2021-11-15T13:37:15+05:30 IST