Abn logo
May 6 2021 @ 01:09AM

నిర్మానుష్యం..

  అమలులోకి వచ్చిన పగటి కర్ఫ్యూ

ఎక్కడికక్కడే మధ్యాహ్నం 12 తర్వాత వ్యాపార, వాణిజ్య దుకాణాలన్నీ మూత

  పూర్తిగా బోసిపోయిన కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలు, ఇతర పట్టణాలు
 
(కాకినాడ, ఆంధ్రజ్యోతి) కొవిడ్‌ కేసుల ఉధృతి నేపథ్యంలో జిల్లాలో గడిచిన వారం రోజులుగా సాయంత్రం ఆరు నుంచి ఉదయం ఆరు వరకు అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలను స్వచ్చందంగా మూసివేస్తున్నారు. దీంతో రాత్రి నుంచి ఉదయం వరకు జనసంచారం దాదాపు తగ్గిపోయింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పగటి పూట కర్ఫ్యూను రెండు వారాల పాటు విధించడంతో బుధవారం నుంచి ఇది అమల్లోకి వచ్చింది. దీంతో ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే అన్ని వ్యాపార కార్యకలాపాలు నడపాలని, విద్యా సంస్థలు కూడా ఇదే సమయం పాటించాలని ఉత్తర్వులు ఇవ్వడంతో తొలిరోజు ఎక్కడికక్కడ ఒక్కసారిగా జనం బయటకు వచ్చారు. మధ్యాహ్నం 12 తర్వాత ఏమీ దొరకదనే ఉద్దేశంతో రైతుబజార్ల వద్దకు ఉదయం ఆరు నుంచే పోటెత్తారు. దీంతో కాకినాడ,  రాజమహేంద్రవరం నగరాలు, అమలాపురం, మండపేట, రామచంద్రపురం తదితర పట్టణాల్లోను రైతుబజార్లు కిక్కిరిశాయి. కిరాణా, వస్త్ర,      బంగారు దుకాణాలు, మాల్స్‌, మార్టులు, ఇతర చిన్నాచితకా వ్యాపారాలు కూడా ఓ మోస్తరు జనంతో నిండిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రధాన నగరాలు, పట్టణాల్లో జనసందోహం పెరిగింది. ముఖ్యంగా కిరాణా, కూరగాయలు కొనుగోలు చేయడానికి ఇతర ప్రాంతాల నుంచి నగరాలకు వచ్చేవారి సంఖ్య బుధవారం ఎక్కువగా కనిపించింది. సామర్లకోట, పిఠాపురం,పెద్దాపురం తదితర ప్రాంతాల నుంచి కాకినాడకు కిరాణా, మసాలా, ఇతర మాల్స్‌కు అధికంగా జనం వచ్చారు. ధవళేశ్వరం, కాతేరు, కడియం, సీతానగరం, రాజానగరం... ఇలా అనేక ప్రాంతాల నుంచి రాజమహేంద్రవరానికి అనేకమందిఉదయాన్నే వచ్చి పన్నెండు తర్వాత వెనుదిరిగారు. దీంతో ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు ఈ రెండు నగరాల్లో మునుపటి రోజులతో పోల్చితే జనం తాకిడి పెరిగింది. ఒకపక్క కర్ఫ్యూ అమల్లో ఉన్నా ఐదుగురికి మించి ఒకేచోట గుమిగూడదనే నిబంధనలు ఎక్కడా అమలు కాలేదు. అటు సమయం కూడా ముంచుకు వస్తుండడంతో జిల్లావ్యాప్తంగా అనేక దుకాణాల్లో రద్దీ ఏర్పడింది. ఆ సమయంలో ఎక్కడా భౌతిక దూరం అమలు కాలేదు. తీరా 11.30 గంటల సమయంలో అనేక మంది వర్తకులు దుకాణాలను పూర్తిగా మూసివేయగా, కొన్నిచోట్ల పోలీసులు పర్యవేక్షిస్తూ మూసివేయించారు. రహదారులన్నీ పూర్తిగా బోసిపోయాయి. తిరిగి ఉదయం ఆరు వరకు ఎక్కడా ఏవీ తెరుచుకునే పరిస్థితి లేకపోవడంతో ఎక్కడికక్కడ జనం ఇళ్లకే పరిమితమయ్యారు. కానీ కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల్లో మాత్రం అక్కడక్కడా జనం          అవసరం లేకపోయినా రహదారులపైకి వచ్చేశారు. కర్ఫ్యూ అమలు పన్నెండు తర్వాత ఎలా అమలవుతుందో చూడ్డానికి కొందరైతే.. బైక్‌ రైడ్‌ల పేరుతో మరికొందరు యువత యథేచ్చగా బయట సంచరించారు. గ్రామాల్లో మాత్రం అక్కడక్కడా కిరాణా దుకాణాల వెనుక నుంచి         వ్యాపారాలు నడిపాయి. తొలి రోజు కర్ఫ్యూలో భాగంగా పోలీసులు పెద్దగా కఠినంగా వ్యవహరించలేదు. దుకాణాలను మాత్రం మూసివేసేలా పర్యవేక్షించి, జనం రాకపోకల విషయంలో కాస్త చూసీచూడనట్టుగా వున్నారు. అనేక చోట్ల రహదారులపై రద్దీ నెలకొంది. ఉదయం ఆరు నుంచి పన్నెండు గంటల వరకే మద్యం దుకాణాలు పనిచేస్తాయని ప్రభుత్వం పేర్కొనడంతో మందుబాబులు దుకాణాల ముందు బారులు తీరారు. ఎక్కడా మాస్కులు లేకుండా, భౌతిక దూరం పాటించకుండా మందుకోసం ఎగబడ్డారు. ఇక్కడ పోలీసు పహారా లేకపోవడంతో ఎవరికి వారు ఇష్టానుసారంగా వ్యవహరించి కొవిడ్‌ నిబంధనలకు తూట్లు పొడిచారు. జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ బస్టాండ్లన్నీ బోసిపోయాయి. మధ్యాహ్నం పన్నెండు తర్వాత సర్వీసులు నడపకూడదని ఆదేశాలుండడంతో దూరప్రాంతాలకు వెళ్లే సర్వీసులను అధికారులు రద్దు చేశారు. జిల్లా పరిధిలో తిరిగే బస్సులను మాత్రం పన్నెండులోపే బస్టాండ్లకు రావాలని ఆదేశించారు. విలీన మండలాల్లోకి తెలంగాణ, ఒడిసా, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి రాకపోకలు లేకుండా సరిహద్దుల్లో పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.

Advertisement