బ్రేకింగ్ : ఏపీలో నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగింపు

ABN , First Publish Date - 2021-05-17T18:53:31+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకూ ఉన్న కర్ఫ్యూను నెలఖరు వరకూ

బ్రేకింగ్ : ఏపీలో నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగింపు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకూ ఉన్న కర్ఫ్యూను నెలాఖరు వరకూ పొడిగిస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఏపీ కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నిశితంగా చర్చించి కర్ఫ్యూను పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా ఇంకా అదుపులోకి రాలేదని.. సత్ఫలితాలు రావాలంటే కనీసం నాలుగు వారాలు కర్ఫ్యూ ఉండాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రూరల్ ప్రాంతంలో కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను జగన్ ఆదేశించారు. వాలంటీర్లు, ఆశావర్కర్లు, సచివాలయ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సీఎం సూచించారు. ముఖ్యంగా కొవిడ్ కారణంగా తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని.. పిల్లలకు ఆర్థికసాయంపై కార్యాచరణ రూపొందించాలని అధికారులను జగన్‌ ఆదేశించారు. అయితే కర్ఫ్యూ సడలింపులను తగ్గించాలని అధికారులు అభిప్రాయపడ్డారు. ఇందుకు జగన్ స్పందిస్తూ.. రాష్ట్రంలో కర్ఫ్యూ విధించి 10 రోజులు మాత్రమే అయిందని జగన్ సమావేశంలో చెప్పారు.


రెండు గంటలకుపైగా సమావేశం..

ఏపీ కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశం సుమారు రెండు గంటలకు పైగా జరిగింది. రాష్ట్రంలో పెరుగుతున్న పాజిటివిటీ రేటు, కరోనా కేసులపై కమిటీ ప్రధానంగా చర్చించి.. పైవిధంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాగా.. ఏపీలో రేపటితో కర్ఫ్యూ ముగియనుంది. ఇప్పటి వరకూ ఉదయం 6 నుంచి 12 వరకు కర్ఫ్యూ నుంచి సడలింపును ప్రభుత్వం ఇచ్చింది. పాజిటివిటీ రేటు రోజు రోజుకూ పెరుగుతుండటంతో ఈ సడలింపును మరింత కుదించే యోచనలో ప్రభుత్వం ఉందని మొదట వార్తలు వచ్చినప్పటికీ.. ఆ కర్ఫ్యూనే నెలాఖరు వరకు ప్రభుత్వం పొడిగించింది.

Updated Date - 2021-05-17T18:53:31+05:30 IST