నిర్మానుష్యం!

ABN , First Publish Date - 2021-05-06T05:29:28+05:30 IST

కరోనా కట్టడిలో భాగంగా పాక్షిక కర్ఫ్యూ నిబంధనలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి.

నిర్మానుష్యం!
నక్కపల్లిలో నిర్మానుష్యంగా ఉన్న నేషనల్‌ హైవే

  


గ్రామీణ జిల్లాలో కర్ఫ్యూ అమలు

మధ్యాహ్నం 12 గంటల తరువాత దుకణాలు మూసివేత

ఇళ్లకే పరిమితమైన జనం.. బోసిపోయిన రహదారులు

కరోనా కట్టడి చర్యలకు ప్రజలు సంపూర్ణ మద్దతు


నర్సీపట్నం, మే 5: కరోనా కట్టడిలో భాగంగా పాక్షిక కర్ఫ్యూ నిబంధనలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. మధ్యాహ్నం 12గంటలకు దుకాణాలన్నీ మూసివేశారు. ఆర్టీసీ బస్సులు డిపోలకు చేరుకున్నాయి. ఆటోలు, కార్లు వంటివి తిరగక రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించారు. కాగా, పట్టణంలో ఉదయం 11.30 గంటల ప్రాంతంలో మార్కెట్లో రోడ్లు కిక్కిరిసిపోయాయి. మెయిన్‌రోడ్డు కృష్ణాబజార్‌లో ట్రాఫిక్‌ సమస్య తలెత్తింది.  

మాకవరపాలెం: మండలంలో కర్ఫ్యూ ప్రారంభమైంది. మధ్యాహ్నం పన్నెండు గంటలకే  దుకాణాలను మూసివేశారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. 

నాతవరం :  కర్ఫ్యూ అమలు కావడంతో రోడ్లన్నీ బోసిపోయాయి. మండలంలో మధ్యాహ్నం పన్నెండు గంటల లోపే దుకాణాలను మూసివేశారు. రోడ్లపై పెద్దగా వాహనాలు సైతం కనిపించలేదు.  

గొలుగొండ/కృష్ణాదేవిపేట : మండలంలో కర్ఫ్యూ కారణంగా మధ్యాహ్నం రోడ్లన్నీ బోసిపోయి కనిపించాయి. ఉదయం పన్నెండు గంటల వరకు షాపులు తెరిచారు. ఆ తరువాత అందరూ మూసి వేసి ఇళ్లకే పరిమితమయ్యారు. పోలీసు సిబ్బంది ఎక్కడికక్కడ  కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు.

పాయకరావుపేట నియోజకవర్గంలో..

పాయకరావుపేట: పాక్షిక కర్ఫ్యూ అమలుతో బుధవారం మధ్యాహ్నం నుంచి పాయకరావుపేట పట్టణం బోసిపోయింది.  మందుల దుకాణాలు, ఆస్పత్రులు ల్యాబ్‌లు మినహా మిగిలినవన్నీ మూతపడ్డాయి.  జన సంచారం తగ్గిపోయి పలు సెంటర్లు ఖాళీగా కనిపించాయి. పోలీసులు అప్రమత్తమై అనవసరంగా రోడ్లపై వచ్చేవారికి కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. 

ఎస్‌.రాయవరం :  మండలంలో కర్ఫ్యూ అమలవుతోంది. ఎస్‌ఐ చక్రధర్‌ పర్యవేక్షణలో పోలీసు సిబ్బంది పలు గ్రామాల్లో పర్యటించారు. 12 గంటల తరువాత అన్ని గ్రామాల్లో దుకాణాలను వ్యాపారులు మూసివేశారు. నిత్యం రద్దీగా ఉండే అడ్డరోడ్డు-తిమ్మాపురం కూడలి, మార్కెట్‌ ప్రాంతాలు నిర్మానుష్యంగా కన్పించాయి.

నక్కపల్లి : మండలంలో బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి పకడ్బందీగా కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ఎస్‌ఐ అప్పన్న నక్కపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్‌, ఉపమాక హైవే జంక్షన్‌, వేంపాడు టోల్‌ప్లాజా వద్ద ప్రజలెవ్వరూ రోడ్లపైకి రాకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. నిత్యావసర సరకులు రవాణా చేసే వాహనాలు తప్ప, మధ్యాహ్నం 12 గంటల తరువాత హైవే ఎక్కిన వాహనాల నంబర్లను పోలీసులు నమోదు చేసుకున్నారు. వీటిపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.  

 కోటవురట్ల : మండలంలో కర్ఫ్యూ అమలులోకి వచ్చింది. మధ్యాహ్నం పన్నెండు గంటల తరువాత రోడ్లపై జనసంచారం కానరాలేదు. ఉదయం ఆరు గంటల నుంచే దుకాణాల వద్ద సందడి నెలకొంది. జనం అవసరమైన సమగ్రిని కొనుగోలు చేసుకుని మధ్యాహ్నం ఇళ్లకే పరిమితమయ్యారు. 

ఎలమంచిలి నియోజకవర్గంలో..

ఎలమంచిలి : కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రభుత్వం విధించి కర్ఫ్యూ ఎలమంచిలిలో బుధవారం అమలులోకి వచ్చింది. ఉదయం నుంచి సందడిగా ఉన్న రోడ్లు మధ్యాహ్నం పన్నెండు గంటలకు బోసిపోయాయి. పట్టణ ఎస్‌ఐ నరసింగరావు సిబ్బందితో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అనవసరంగా రోడ్లపై వచ్చేవారిని హెచ్చరిస్తున్నారు.  144 సెక్షన్‌ అమలులో ఉన్నట్టు ఆయన చెప్పారు.   

అచ్యుతాపురం : కర్ఫ్యూ అమలు కావడంతో అచ్యుతాపురంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దుకాణాలు తెరుచుకున్నాయి. పన్నెండు గంటల తరువాత జనం ఇంటిబాట పట్టారు. రోడ్లపై ఎవరూ కనిపించలేదు. ఎలమంచిలి సీఐ నారాయణరావు, అచ్యుతాపురం ఎస్‌ఐ లక్ష్మణరావు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. 

మునగపాక: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం  ప్రకటించిన కర్ఫ్యూతో గ్రామాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. మధ్యాహ్నం పన్నెండు గంటల లోపే కార్యక్రమాలన్నీ చక్కబెట్టుకొని జనం ఇంటికి చేరుకున్నారు. 

రాంబిల్లి : కర్ఫ్యూ అమలుతో ఈ ప్రాంతం సందడి కోల్పోయింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రతిచోటా జనసంచారం కనిపించింది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రభుత్వం పాక్షిక కర్ఫ్యూ విధించడంతో మధ్నాహ్నం పన్నెండు గంటలకు జనం ఇంటిబాట పట్టారు. ఎస్‌ఐ వి.అరుణ్‌కిరణ్‌ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Updated Date - 2021-05-06T05:29:28+05:30 IST