గుండె గుబిల్లు

ABN , First Publish Date - 2021-04-14T06:30:57+05:30 IST

గ్రేటర్‌వాసులకు ఏప్రిల్‌ నెల విద్యుత్‌ బిల్లులు పెరిగిపోయాయి.

గుండె గుబిల్లు

వేసవిలో పెరిగిన వినియోగం

200 యూనిట్లు దాటితే మోగుతున్న చార్జీలు

ఒక్క యూనిట్‌ పెరిగితే భారం రూ. 247

చుక్కలు చూపిస్తున్న విద్యుత్‌ బిల్లులు

కూకట్‌పల్లికి చెందిన రాజే్‌షకు ఈ ఏడాది జనవరి వరకు ప్రతి నెల రూ.760లోపు విద్యుత్‌ బిల్లు వచ్చేది. మార్చిలో ఎండలు పెరగడంతో 10 యూనిట్లు అదనంగా వినియోగించాడు. దీంతో   బిల్లు రూ.1072 వచ్చింది. అదనంగా పడిన భారం రూ. 312. నాన్‌ టెలిస్కోపిక్‌ పద్ధతిలో బిల్లులు వసూలు చేస్తుండంతో 200 యూనిట్లు దాటితే బిల్లుల మోత మోగుతోందని చెప్పేందుకు ఇదో ఉదాహరణ. 

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌వాసులకు ఏప్రిల్‌ నెల విద్యుత్‌ బిల్లులు పెరిగిపోయాయి. వేసవి నేపథ్యంలో ఇళ్లలో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వినియోగిస్తుండటంతో విద్యుత్‌ మీటర్లు విష్ణు చక్రాలవుతున్నాయి. 200 యూనిట్లకు పైగా.. అదనంగా ఒక్క యూనిట్‌ పెరిగినా స్లాబ్‌ రేట్‌ మారుతోంది. వాస్తవంగా డొమెస్టిక్‌ కేటగిరీలో 200 యూనిట్ల లోపు విద్యుత్‌ వాడితే 0-100 యూనిట్ల వరకు రూ.3.30, 101-200 యూనిట్ల వరకు ఒక్కో యూనిట్‌కు రూ. 4.30 చార్జీ వేస్తుంటారు. 200 యూనిట్లు దాటితే ఒక్కో యూనిట్‌కు రూ. 5 చార్జీ చేస్తున్నారు. దీంతో ఒక్క యూనిట్‌ పెరిగినా స్లాబ్‌రేట్‌ మారి మొత్తం 200 యూనిట్లకు రూ. 5 చార్జీ వసూలు చేయడంతో బిల్లులు రూ. వేలు దాటిపోతున్నాయి. 201-300 యూనిట్ల వరకు ఒక్కో యూనిట్‌కు రూ.7.20 చార్జీ చేయడంతో 300 యూనిట్లు దాటితే బిల్లు మోతమోగిపోతోంది. 


నాన్‌ టెలిస్కోపిక్‌ పద్ధతిలో బిల్లులు...


టెలిస్కోపిక్‌ విధానంలో అదనపు చార్జీల వర్తింపు కేవలం అదనపు వినియోగం వరకే పరిమితమవుతోంది. 200 యూనిట్లు వాడితే మొదటి 0-100 యూనిట్లకు రూ.3.30 చొప్పున, తర్వాత 101-200 యూనిట్లకు యూనిట్‌కు రూ.4.30 చార్జీలు వసూలు చేయాలి. 2015-16 నుంచి నాన్‌ టెలిస్కోపిక్‌ పద్ధతిని అమలు చేస్తున్నారు. ఇందులో 0-200 యూనిట్లను ఒకే స్లాబుగా చేసి ఒక్కో యూనిట్‌ రూ. 5 చార్జీని విధిస్తుండడంతో వినియోగదారుపై అదనపు భారంపడుతోంది. గ్రేటర్‌లో మొ త్తం 52లక్షల కనెక్షన్లు ఉంటే. అందులో 45లక్షల గృహ వినియోగ కనెక్షన్లు ఉన్నాయి.  ఇందులో సుమారు 50 శాతం గృహ కనెక్షన్‌దారులు నెలకు 200 యూనిట్లకు పైగా విద్యుత్‌ వాడుతున్నారు.


ఒక్క యూనిట్‌ పెరిగినా..

విద్యుత్‌ వాడకంతో పెరిగిన చార్జీలతో పాటు కస్టమర్‌ చార్జీల భారం వినియోగదారులపై అదనంగా పడుతోంది. 51-100 యూనిట్లలోపు వాడే వినియోగదారులకు కస్టమర్‌ చార్జీ రూ.30 వేస్తే, 101 యూనిట్లు వాడితే ఒక్క యూనిట్‌కు కస్టమర్‌ చార్జీ కింద రూ.20 అదనంగా కలిపి రూ. 50 చార్జీలను వినియోగదారులనుంచి డిస్కం వసూలు చేస్తోంది. 201-300 యూనిట్ల వరకు కస్టమర్‌ చార్జీ రూ. 60 వసూలు చేస్తున్నారు. 


లోడ్‌ క్రమబద్ధీకరించుకోవాలి 


గృహాల్లో లోడ్‌కు మించి విద్యుత్‌ వాడుతుంటే వెంటనే క్రమబద్ధీకరించుకోవాలి.  లేదంటే డెవల్‌పమెంట్‌ చార్జీ చెల్లించాల్సి వస్తుంది. నగరంలో చాలామంది విద్యుత్‌ కనెక్షన్లు తీసుకునేటప్పుడు 1, 2 కిలోవాట్‌ లోడ్‌తో కనెక్షన్లు తీసుకుంటారు. తర్వాత మీటర్లపై లోడ్‌ వేస్తూ ఎక్కువ కిలోవాట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. దీంతో ఈ అదనపు లోడ్‌పై విద్యుత్‌ శాఖ డెవల్‌పమెంట్‌ చార్జీలను వసూలు చేస్తోంది. ఒక కిలోవాట్‌ అదనపు లోడ్‌కు డెవల్‌పమెంట్‌ చార్జి కింద రూ. 1,416 వసూలు చేస్తోంది. దీంతో పాటు అప్లికేషన్‌ ఫీజు రూ. 29.50, సెక్యూరిటీ డిపాజిట్‌ రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది. అదనపు లోడ్‌ వినియోగిస్తున్న వారు సంస్థ వెబ్‌సైట్‌లో లోడ్‌ వివరాలను అప్‌డేట్‌ చేసి, అందుకు తగిన డెవల్‌పమెంట్‌ చార్జీని చెల్లించాల్సి ఉంటుంది.  

Updated Date - 2021-04-14T06:30:57+05:30 IST