Abn logo
Feb 27 2021 @ 01:05AM

అమరావతిపై కపటప్రేమ!

రాష్ట్ర ప్రజలు తన చేతిలో మోసపోవడానికి అలవాటు పడ్డారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధీమా. తాను ఏది చెబితే ప్రజలు అదే నమ్ముతారని ఆయనకు అపార నమ్మకం. అమరావతి పేరు పలకడానికి కూడా ఇష్టపడని జగన్ ప్రభుత్వానికి హఠాత్తుగా దానిపై అవ్యాజప్రేమ పుట్టుకురావడం వింతగా ఉంది. కానీ, ఇది ప్రేమే అనుకుంటే భ్రమే అవుతుంది. జగన్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి 21 నెలలుగా అమరావతిని చంపేయడానికి చెయ్యని ప్రయత్నం లేదు. నేడు ఒక్కసారిగా ప్రేమ పుట్టుకొచ్చి రూ.3 వేలకోట్లతో మౌలిక వసతుల కల్పనకు క్యాబినెట్ ఆమోదం తెలపడానికి కారణం విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతుండటమే. అమరావతిని గ్రాఫిక్స్ అనీ, ఎడారి అనీ, స్మశానం అనీ నానావిధాలా తూలనాడారు అందరూ. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ జరిగిందని నానా యాగీ చేశారు.


అబద్ధాలతో అమరావతి రెక్కలు విరిచారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని 440 రోజులుగా రైతులు, మహిళలు ఆందోళన చేస్తున్నా, 115 మంది రైతులు గుండె ఆగి చనిపోయినా, ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోని పాలకులు వీళ్ళు. ఎవరు అడ్డు వస్తారో చూస్తాం, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధానిని విశాఖకు తరలించి తీరతామని మంత్రులు, పార్టీ నాయకులు సవాళ్లు విసిరారు. అమరావతిలో ప్రాజెక్టులకు రుణాలిచ్చేందుకు ముందుకు వచ్చిన బ్యాంకులను వెళ్ళగొట్టారు. సీఆర్‌డీఏ రద్దు చేసి వికేంద్రీకరణ బిల్లును మందబలంతో అసెంబ్లీలో ఆమోదించుకున్నారు. హైకోర్టులో ఉన్న కేసుల విచారణ కారణంగా తరలింపు ఆగింది తప్ప రాజధానిని ఆగమేఘాలమీద విశాఖకు తరలించడానికి జగన్మోహన్‌రెడ్డి చెయ్యని ప్రయత్నం లేదు. నేడు పురపాలక ఎన్నికలు రావడంతో అక్కడ రూ.3000 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన పేరిట కొత్త విన్యాసానికి తెరదీశారు. 


రాజకీయ అవసరాల కోసం జనవంచనలో జగన్ ఘనుడు. అమరావతిపై ఆయన ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని ప్రజలు గ్రహించాలి. రాజధానిని అమరావతి లోనే కొనసాగించాలని ఉద్యమి‍స్తున్న వారిపై ప్రభుత్వం సాగించిన దమనకాండ ప్రజలు మర్చిపోలేదు. భూములిచ్చిన రైతులను పెయిడ్ ఆర్టిస్టులుగా, ఉద్యమాన్ని పెయిడ్ ఉద్యమంగా చిత్రించారు. పురపాలక ఎన్నికలు, గుంటూరు, విజయవాడ కార్పొరేషన్ల ఎన్నికల దృష్ట్యా అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన, 75 శాతం నిర్మాణమైన భవనాలను పూర్తి చేయడం వంటి ప్రతిపాదనలు ముందుకొచ్చాయి. ఆ రెండు కార్పొరేషన్లలో గెలవడం ద్వారా రాజధానిని విశాఖకు తరలించేందుకు తమకు ప్రజామద్దతు లభించిందని చెప్పుకోవడానికే అధికారపార్టీ ఈ రకమైన వ్యూహాలు పన్నుతోంది.


ఇక్కడి కార్పొరేషన్లలో, మున్సిపాలిటీలలో ఓటమి చెందితే రాజధాని తరలింపునకు అవరోధం ఏర్పడుతుందని గ్రహించిన అధికార పార్టీ ఒక ఎత్తుగడగా మాత్రమే అమరావతి అభివృద్ధి అంశాన్ని ఇలా తెరపైకి తెచ్చింది. రైతుల, నగర, పట్టణ ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చేందుకే రాజధానిపై ఈ సమీక్షలు, ఆదేశాలు. ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్ అధ్యక్షతన 9 మంది ఉన్నతాధికారులతో కమిటీ వేయడం, గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన అమరావతిలో పర్యటించడం, తర్వాత సిఎం ముఖ్య సలహాదారు నీలం సాహ్ని, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి వై. శ్రీలక్ష్మి పర్యటనలు, ఆ తర్వాత కమిటీ సభ్యులతో సీఎస్ భేటీ, అమరావతిలో కల్పించాల్సిన మౌలిక సదుపాయాల అధ్యయనం కోసం కర్ణాటక, జమ్ము కాశ్మీర్‌లలో పర్యటించమంటూ అధికారులను ఆదేశించడం వంటివన్నీ ప్రజలను, రైతులను మరోసారి మాయచేసే ప్రయత్నంలో భాగమే.


రైతుల నుంచి సేకరించిన భూములు అమ్మివేయాలని మొన్నటివరకు ఆలోచన చేసిన ప్రభుత్వానికి ఒక్కసారిగా మౌలికవసతుల కల్పన గుర్తుకు రావడం విస్మయం కలిగిస్తోంది. మూడు రాజధానుల ప్రాతిపాదనకు వ్యతిరేకంగా అమరావతి రైతులు న్యాయస్థానాల్లో దాఖలు చేసిన కేసులు విచారణ జరుగుతున్న నేపథ్యంలో, వారికి అన్యాయం చేయడం లేదన్న అభిప్రాయం కలిగించడంకోసం, న్యాయస్థానాల్లో వ్యతిరేక తీర్పులు రాకుండా జాగ్రత్తపడటం కోసం ఇదొక ఎత్తుగడ. అమరావతి నిర్మాణానికి వేల కోట్ల రూపాయల ఋణం ఇవ్వడానికి ముందుకు వచ్చిన ప్రపంచబ్యాంకు, ఇతర ఆర్థిక సంస్థలను వెళ్లగొట్టిన ప్రభుత్వం ఈ రోజు రూ.3000 కోట్ల రుణంతో అమరావతిలో ఏదో అభివృద్ధి చేయబోతున్నట్లు భ్రమలు కలిగించాలని చూస్తోంది. ప్రభుత్వం గ్యారెంటీగా ఉంటానన్నా అంత ఋణం ఇవ్వడానికి ముందుకు వచ్చేది ఎవరు? ప్రజల కళ్ళకు గంతలు కట్టే రాజకీయంలో రాటు తేలిపోయింది జగన్ బృందం. అధికారంలోకి వచ్చినది మొదలు అమరావతిపై పలు అసత్యాలు, ఆరోపణలతో ప్రజలను ప్రభుత్వం ఏ విధంగా మోసగించిందో తెలియంది కాదు. పురపాలక ఎన్నికల్లో ఓటర్లను ఓడించి తాను గెలవడానికి జగన్ పన్నిన పన్నాగం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. 


దేవినేని ఉమామహేశ్వర రావు

మాజీ మంత్రి

Advertisement
Advertisement
Advertisement