‘కళలు’ కల్లలాయే..

ABN , First Publish Date - 2022-05-14T05:36:51+05:30 IST

చిన్న పిల్లల్లో అంతర్గతంగా దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు, వివిధ కళల్లో శిక్షణ ఇవ్వడం ద్వారా వారిని ఉత్తమ కళాకారులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏర్పాటైన బాల భవన్‌ తన ఉనికిని కోల్పోతోంది. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో ఒక వెలుగు వెలిగిన బాలభవన్‌.. ప్రస్తుతం అత్యంత దయనీయ స్థితిలో ఉంది. సొంత భవనంలేక, కనీస సౌకర్యాలకు నోచుకోక, శిక్షకులు లేక పూర్తిగా కుంటుపడిపోతోంది. గతంలో ఏడుగురు శిక్షకులతో నడిచిన బాల భవన్‌.. ప్రస్తుతం ఇద్దరితోనే పని చేస్తోంది. బాల భవన్‌ ఉనికి పూర్తిగా నామావశిష్టంగా మారిపోయింది.

‘కళలు’ కల్లలాయే..
హనుమకొండ జేఎన్‌ఎ్‌స గ్యాలరీ సెల్లార్‌లోని బాలభవన్‌ లోపలి దృశ్యం

సమస్యల గుండంలో ‘బాల భవన్‌’
సొంత భవనం లేక ఇబ్బందులు
జేఎన్‌ స్టేడియం గ్యాలరీ సెల్లార్‌లో నిర్వహణ
సిబ్బంది కొరత.. ఉన్నది ఇద్దరే..
సదుపాయాల కోసం విన్నపాలు బుట్టదాఖలు
పట్టించుకోని జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు
చిన్న పిల్లలకు అందని ద్రాక్షగా మారిన కళలు


చిన్న పిల్లల్లో అంతర్గతంగా దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు, వివిధ కళల్లో శిక్షణ ఇవ్వడం ద్వారా వారిని ఉత్తమ కళాకారులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏర్పాటైన బాల భవన్‌ తన ఉనికిని కోల్పోతోంది. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో ఒక వెలుగు వెలిగిన బాలభవన్‌.. ప్రస్తుతం అత్యంత దయనీయ స్థితిలో ఉంది. సొంత భవనంలేక, కనీస సౌకర్యాలకు నోచుకోక, శిక్షకులు లేక పూర్తిగా కుంటుపడిపోతోంది. గతంలో ఏడుగురు శిక్షకులతో నడిచిన బాల భవన్‌.. ప్రస్తుతం ఇద్దరితోనే పని చేస్తోంది. బాల భవన్‌ ఉనికి పూర్తిగా నామావశిష్టంగా మారిపోయింది.

హనుమకొండ, మే13 (ఆంధ్రజ్యోతి) : నాలుగు దశాబ్దాల కిందట 1980కు ముందు హనుమకొండలో బాలభవన్‌ ఏర్పాటైంది. మొదట ఈ బాలభవన్‌ హనుమకొండ పబ్లిక్‌ గార్డెన్‌ సమీపంలో ఒక పోలీసు క్వార్టర్‌లో నడిచింది. ఆ తర్వాత దీనిని హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలోకి మార్చారు. స్టేడియం గ్యాలరీ కింద సెల్లార్‌ దీనిని ఏర్పాటు చేశారు.
అప్పటి నుంచి బాల భవన్‌ అక్కడే నడుస్తోంది. ఇందులో 5 నుంచి 16 యేళ్ల బాలబాలికలకు వారికి ఇష్టమైన నృత్యం, సంగీతం, చిత్రలేఖనం, యోగా తదితర వాటిల్లో శిక్షణ ఇస్తారు. గతంలో దీన్ని ఎందరో బాలబాలికలు వినియోగించుకున్నారు. పాఠశాలలకు వెళుతూనే ఉదయం, సాయంత్రం బాల భవన్‌లో శిక్షణ పొంది రాణించారు. బాలశ్రీ, బాలరత్న, బాల సూర్య వంటి పురస్కారాలను అందుకున్నారు.

ఇద్దరే దిక్కు
బాల భవన్‌లో ఒక సూపరింటెండెంట్‌తో పాటు అటెండర్‌, ఆయా, డ్రాయింగ్‌,  సంగీతం, మృదంగం, టైలరింగ్‌ టీచర్లు మొత్తం ఏడుగురు ఉండేవారు. 2015లో అటెండర్‌, ఆయా డ్రాయింగ్‌, సంగీతం టీచర్లు రిటైరయ్యారు. ప్రస్తుతం మిగిలింది సూపరింటెండెంట్‌, మృదంగం శిక్షకుడే. ఏడేళ్లుగా ఈ  ఇద్దరే బాలభవన్‌ను చూసుకుంటున్నారు. డ్రాయింగ్‌, సంగీతం, టైలరింగ్‌ శిక్షకులు లేకపోవడంతో వీటిలో పిల్లలకు శిక్షణ ఇచ్చేవారు లేకుండా పోయారు. దీంతో ఇప్పుడు ఈ తరగతులు నడవడం లేదు. ఇక మిగిలింది మృదంగం శిక్షకుడు ఒక్కరే. ఆయనే వారంలో మూడు రోజులు మర్కజీ, ప్రాక్టీసింగ్‌ స్కూల్లో విద్యార్థులకు మృదంగం పాఠాలు చెబుతున్నారు. మిగిలిన రోజులు బాలభవన్‌లో శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం అటెండర్‌, ఆయా పనులను కూడా ఆయనే చేయాల్సి వస్తోంది.సూపరింటెండెంట్‌ నృత్య తరగతులను తీసుకుంటున్నారు.

ఎంత వేడుకున్నా..
బాలభవన్‌లో కొత్తవారిని నియమించాలని, సొంత భవనం ఏర్పాటు చేయాలని, శిక్షణ పరికరాలను సమకూర్చాలని కోరుతూ ప్రభుత్వానికి ఎన్ని సార్లు లేఖలు రాసినా ఫలితం లేకుండా పోయింది. అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా స్పందన లేదు. ప్రజాప్రతినిధులను ఎంత వేడుకున్నా ఆరణ్యరోదనే అయింది. బాలభవన్‌కు కలెక్టర్‌ చైర్మన్‌, డీఈవో కన్వీనర్‌. వారు కూడా పట్టించుకోవడం లేదు. పిల్లల నుంచి  కొద్దిపాటి ఫీజు తీసుకొని ఆ వచ్చిన మొత్తాన్ని వేతనాలుగా చెల్లించడం ద్వారా డ్రాయింగ్‌, డ్యాన్స్‌, సంగీతం (గాత్రం), యోగాలో ప్రైవేటు టీచర్లతో తరగతులను నిర్వహించేందుకు గతంలో ప్రయత్నాలు జరిగాయి. అధికారులు ఇందుకు కూడా అనుమతివ్వకపోవడంతో అది కూడా ఆగిపోయింది. ప్రస్తుతం శిక్షణ ఇచ్చేవారు లేక, విద్యార్థులు రాక బాలభవన్‌ బోసిపోయి కనిపిస్తోంది. మరో పక్క జేఎన్‌ఎస్‌ నుంచి బాలభవన్‌ను ఖాళీ చేయాలని యువజన, క్రీడా శాఖ నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి.

కనీస సౌకర్యాలు కరువు
సెల్లార్‌లో ఇరుకు గదిలో ఉన్న బాలభవన్‌లో కనీస సౌకర్యాలు లేవు. గ్యాలరీ కింద ఏర్పాటు చేయడం వల్ల నిలబడితే పైకప్పు తలకు తగులుతూ ఉంటుంది. సంగీత, వాయిద్య పరికరాలను, దస్త్రాలను భద్రపరచడానికి సైతం చోటు లేదు. కరెంట్‌ సరిగా ఉండదు. ఫ్యాన్లు లేవు. దీనికితోడు బాలభవన్‌కు ఇప్పుడు కొత్త సమస్య ఎదురైంది. స్టేడియంలో సింఽథటిక్‌ ట్రాక్‌ నిర్మాణం జరిగిన తర్వాత రెండు గేట్లలో బాలభవన్‌వైపు ఉన్న ప్రధాన గేట్‌ను శాశ్వతంగా మూసివేశారు. దీనితో పిల్లలు స్టేడియం వెనుక శ్రీదేవిమాల్‌కు వెళ్లే రోడ్డువైపున గేట్‌ నుంచి చుట్టూ తిరిగి రావలసి వస్తోంది. ఇటువైపు ఆర్టీసీ బస్సులు, వచ్చే పోయే వాహనాలతో ట్రాఫిక్‌ రద్దీ అధికంగా ఉంటుంది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను బాల్‌భవన్‌కు పంపడానికి భయపడుతున్నారు. భద్రత దృష్ట్యా వారే స్వయంగా తోడ్కోనిరావలసి వస్తోంది.



Read more