సాగుపై కసరత్తు

ABN , First Publish Date - 2020-05-22T11:13:08+05:30 IST

సమగ్రసాగు విధా నాన్ని ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేయబోతున్నందున ఇక జిల్లాలోని వ్యవసాయరంగంలో సంస్కరణలు

సాగుపై కసరత్తు

ఎర్ర నేలల్లో తెల్ల బంగారం 

నల్ల రేగడితో సమానంగా పత్తిసాగు 

మొక్కజొన్న పంటకు ఇక స్వస్తి

జిల్లాలో మారనున్న పంటసాగు విధానం 

డిమాండ్‌కు అనుగుణమైన వ్యవసాయం 

నిర్మల్‌ జిల్లాలో 1.95 లక్షల ఎకరాల్లో పత్తిసాగు లక్ష్యం 

తగ్గనున్న సోయాసాగు.. విత్తన సబ్సిడీ నిలిపివేత.. 


నిర్మల్‌, మే 21 (ఆంధ్రజ్యోతి) : సమగ్రసాగు విధా నాన్ని ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేయబోతున్నందున ఇక జిల్లాలోని వ్యవసాయరంగంలో సంస్కరణలు మొదలు కాబోతున్నాయి. ప్రభుత్వం క్రాఫ్‌ మ్యాపింగ్‌ పేరిట బహిరంగ మార్కెట్‌లో అత్యధిక ధర, డిమాండ్‌ ఉన్న పంటలను మాత్రమే సాగుచేయాలని సాంప్రదాయంగా ఒకే రకమైన పంటలసాగుకు స్వస్తి పలకాలంటూ నిర్ణయించింది. దీని కోసం గాను ప్రభుత్వం సూచించే పంటలను మాత్రమే సాగు చేయాలని నిబంధన విధించబోతోంది. ఈ నిబంధనను అతిక్రమించే వారికి ప్రభుత్వపరంగా అందించే సంక్షేమ ప్రయోజనాలన్నింటిని నిలిపి వేయబోతున్నారు.


ముఖ్యంగా గిట్టుబాటు ధరకల్పనతో పాటు రైతుబంధు, పంటబీమా, సబ్సిడీపై విత్తనాలు లాంటి వాటిని రద్దు చేయాలని నిర్ణయించారు. కాగా నిర్మల్‌ జిల్లాలో ఇక్కడి భూములకు అనుగుణమైన పంటలను సాగుచేయాలని నిర్ధారించారు. దీనికి సంబంధించి గురువారం సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో పెద్దఎత్తున సమీక్ష సమావేశం జరిగింది. అయితే ఇప్పటికి జిల్లా అధికారులు క్రాఫ్‌మ్యాపింగ్‌కు అనుగుణంగా జిల్లాలో సాగుచేయాల్సిన పంటల నివేదికలను ప్రభుత్వానికి నివేదించారు. దీనికి అనుగుణంగా జిల్లాలో ఇక డిమాండ్‌ లేని మొక్కజొన్న పంటను పూర్తిగా నిషేధించబోతున్నారు. ఇక నుంచి జిల్లాలో మొక్కజొన్న పంటసాగు కనుమరుగయ్యే అవకాశాలున్నాయి. వరిపంటను మాత్రం యధావిధిగా లక్ష ఎకరాల్లో సాగుచేయాలని నిర్ణయించగా, పత్తి పంట విస్తీర్ణాన్ని మాత్రం పెంచనున్నారు.


జిల్లాలో 60శాతం ఎర్రనేలలు, 40 శాతం నల్లరేగడి నేలలు ఉన్నాయి. ఇప్పటి వరకు నల్లరేగడి నేలల్లోనే మాత్రం సాగవుతున్న పత్తిపంటను అనుకూలంగా లేని ఎర్రనేలల్లో కూడా సాగుచేయనున్నారు. ప్రస్తుతం 1.45 లక్షల ఎకరాల్లో పత్తిపంటను సాగుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ దీనిని క్రాఫ్‌మ్యాపింగ్‌కు అనుగుణంగా మరో రూ.50వేలు అదనంతో మొత్తం 1.95 లక్షల ఎకరా ల్లో తెల్లబంగారాన్ని పండించాలని నిర్ణయించారు. అలా గే 40 నుంచి 50వేల ఎకరాల్లో కందుల పంటను, దీనికి తోడుగా కూరగాయల విస్తీర్ణాన్ని పెంచబోతున్నారు.


అయితే క్రాఫ్‌మ్యాపింగ్‌పై సంబంధిత యంత్రాంగం తీవ్రమైన కసరత్తు జరిపి ఖరీఫ్‌ సాగులక్ష్యాన్ని ఖరారు చేస్తున్నారు. ముఖ్యంగా రైతులకు క్రాఫ్‌మ్యాపింగ్‌ ఆధా రంగా పంటలను సాగు చేసేందుకు రైతులను అధికారులు సంసిద్ధం చేయబోతున్నారు. దీనికోసం గాను మొక్కజొన్న పంటను సాగుచేయవద్దంటూ రైతులకు అవగాహన కల్పించబోతున్నారు. అలాగే పత్తిపంటను నల్లరేగడితో పాటు దానికి అనుగుణమైన నేలల్లో సాగు చేయాలని, దీంతో పాటు కందులు, ఇతర పప్పు ధాన్యా లు, కూరగాయల పంటలను మార్కెట్‌లో గిట్టుబాటు ధర, డిమాండ్‌ను పరిగణలోకి తీసుకొని సాగుచేయాలని అధికారులు రైతులకు సూచించనున్నారు. 


మొక్కజొన్న సాగుకు కాలం చెల్లినట్లే..

కాగా ఇప్పటి వరకు జిల్లాలో విస్తారంగా సాగైన మొక్కజొన్న పంటపై ఈ సారి నిషేధం విధించబోతున్నారు. ఇటీవలే మొక్కజొన్న పంట దిగుబడులు, పెద్ద ఎత్తున పెరగడం, అలాగే మార్కెట్‌లో ఆ పంటకు ఆశించిన ధర , డిమాండ్‌ లేకపోవడం, ఎగుమతులకు సైతం అవకాశాలు లేనందున ఈ పంటను సాగు చేయవద్దనే నిర్ణయానికి వచ్చారు. ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్న నిల్వలు పేరుకుపోవడం, తీవ్రమైన సమస్యకు కారణమవుతోంది. ఇలాంటి పరిణామాల కారణంగా ఈ సారి మొక్కజొన్న పంటను పూర్తిగా సాగు చేయవద్దని ఒకవేళ సర్కారు హెచ్చరికలను బేఖాతరు చేస్తూ మొక్కజొన్నను సాగుచేసినట్లయితే ప్రభుత్వపరంగా రైతులకు ఎలాంటి ప్రయోజనాలు ఉండబోవంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. 


పెరగనున్న పత్తి పంట విస్తీర్ణం..

1.45 లక్షల ఎకరాల్లో ఈ సారి పత్తి సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ క్రాఫ్‌మ్యాపింగ్‌ కారణంగా ఈ పంట విస్తీర్ణాన్ని 1.95 లక్షల ఎకరాలకు పెంచారు. గతం కన్నా 50 వేల ఎకరాల్లో అదనంగా ఈ పంటను పండించబోతున్నారు. పత్తిపంటకు బహిరంగ మార్కెట్‌లో ఆశించిన డిమాండ్‌ ఉండడం, ధర కూడా ఎక్కువగానే పలుకుతుండడంతో ఈ పంటసాగు రైతులకు మేలు చేకూరుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో ఎక్కువగా పత్తిపంటను సాగు చేయవద్దని సూచించిన ప్రభుత్వం ఈ సారి మాత్రం డిమాండ్‌ను పరిగణలోకి తీసుకొని ఈ పంటసాగుకు ప్రోత్సాహం అందిస్తోంది. కాగా ప్రతియేటా పత్తిపంటకు వివిధ రకాల తెగుళ్లు తీవ్రనష్టం చేకూరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ తెగుళ్ల కారణంగా పంట దిగుబడులు తగ్గుతుండడమే కాకుండా ఆ పంటనాణ్యత కూడా దెబ్బ తింటోంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ సర్కారు మాత్రం పత్తిపంటకు మొగ్గుచూపడం రైతాంగంలో చర్చకు తావిస్తోంది. 


వరి మాత్రం యధాతథం..

కాగా సోయాపంటను సగం తగ్గించనుండగా మొక్కజొన్నను పూర్తిగా నిలిపి వేసిన ప్రభుత్వం వరిసాగును మాత్రం యధాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఇప్పటికే లక్ష ఎకరాల్లో అధికారులు వరి పంట సాగులక్ష్యాన్ని నిర్ధారించినప్పటికీ దానినే క్రాఫ్‌ మ్యా పింగ్‌ విధానంతో కూడా కొనసాగించేందుకు నిర్ణయించారు. అయితే ఈ వరిధాన్యంలో దొడ్డురకం, సన్నరకం సాగుకు సంబంధించి అధికారులు రైతులకు సూచనలు జారీ చేయనున్నారు. అధికారుల సూచనలు పరిగణలోకి తీసుకొని రైతులు వరిసాగుకు సిద్ధం కావాల్సి ఉంటుంది. వీటితో పాటు కందులు, కూరగాయలు, ఇతర పంటల సాగును కూడా ప్రోత్సహించనున్నారు. 


తగ్గనున్న సోయాసాగు..విత్తన సబ్సిడీ నిలిపివేత... 

కాగా సోయా పంటసాగును కూడా గణనీయంగా తగ్గించనున్నారు. ఈ సారి లక్ష ఎకరాల్లో సోయా పంటను సాగుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ దానిని 60వేల ఎకరాలకు కుదించారు. సోయా పంట ను సాగుచేసే రైతులకు ఇక నుంచి అన్ని రకాల సబ్సిడీలు రాయితీలను నిలిపి వేయబోతున్నారు. పరో క్షంగా సోయాపంట సాగును తగ్గించేందుకే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. దీనికి తోడు గా మొదట్లో లాభాలు తెచ్చిన సోయాపంట క్రమంగా వాతావరణ పరిస్థితులు, భూసారం, తదితర సమస్యల కారణంగా దిగుబడులు తగ్గిపోతున్నాయి. 40శాతం వరకు సోయావిత్తనాలు మొలకెత్తకపోతుండడం కూడా సమస్యను జఠిలం చేస్తోంది. దీని కారణంగా విత్తన కంపెనీలు సైతం రాయితీలు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు.

Updated Date - 2020-05-22T11:13:08+05:30 IST