వికారాబాద్ జిల్లాలో ఆశల సాగు..

ABN , First Publish Date - 2022-06-16T04:17:06+05:30 IST

వానాకాలం సాగుకు రైతులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దుక్కులు సిద్ధం చేశారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకుంటున్నారు. రైతులతో ఫర్టిలైజర్‌ దుకాణాలు రద్దీగా కన్పిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రభుత్వం అన్ని రకాల విత్తనాలను సబ్సిడీపై సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు.

వికారాబాద్ జిల్లాలో ఆశల సాగు..

  •  పొలాల్లో వానాకాలం కోలాహలం
  •  దుక్కులు చేసుకుంటున్న రైతులు
  •  ఎరువులు, విత్తనాల దుకాణాల్లో రద్దీ 
  •  రికార్డు స్థాయిలో పత్తివేసే అవకాశం

వానాకాలం సాగుకు రైతులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దుక్కులు సిద్ధం చేశారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకుంటున్నారు. రైతులతో ఫర్టిలైజర్‌ దుకాణాలు రద్దీగా కన్పిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రభుత్వం అన్ని రకాల విత్తనాలను సబ్సిడీపై సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. అలాగే పెట్టుబడి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రైతుబంధును కూడా వెంటనే తమ ఖాతాల్లో వేస్తే అప్పు తెచ్చుకునే బాధ తప్పుతుందని  అన్నదాతలు అభిప్రాయపడుతున్నారు. కాగా  వానాకాలం సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 5.9లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగుచేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు.  విత్తనాలు, ఎరువులను సిద్ధంగా చేశామని పేర్కొంటున్నారు.

పరిగి, జూన్‌ 15: వర్షాకాలం వచ్చేసింది. సాగు పనులతో రైతుల హడావిడి మొదలైంది. విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లకు వస్తున్న రైతులతో పరిగి, వికారాబాద్‌, తాండూరు, కొడంగల్‌, మర్పల్లి, మోమిన్‌పేట్‌ పట్టణాల్లోని దుకాణాల వద్ద సందడి నెలకొంటోంది. ఈసారి పత్తి,  మొక్కజొన్న పంటలు ఎక్కువ సాగుచేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. వాటికి లభిస్తున్న ధరతో అటువైపు మొగ్గు చూపుతున్నారు. అయితే రైతులకు కావాల్సిన పంటలకు, అవసరమైన మేర సబ్సిడీ విత్తనాలను ప్రభుత్వం అందించడం లేదు. సీజన్‌లో ఎరువులు, విత్తనాల కొరత రైతులను యేటా వేధిస్తూనే ఉంది. అయితే కొందరు రైతులు ముందస్తుగా ఎరువులు, విత్తనాలు నిల్వ చేసుకున్నారు. అలా చేసుకోలేని వారికి మార్కెట్‌లో అవి దొరకకుంటే అదును దాటిపోయే ఆస్కారం ఉంది. కాబట్టి అధికారులు రైతులకు కావాల్సిన ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది.

సింహ భాగంలో పత్తి, కంది పంటల సాగు

వికారాబాద్‌ జిల్లాలో వానకాలంలో 5.9లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ప్రధానంగా పత్తి, మొక్కజొన్న, వరి, కంది సాగు చేస్తారు. అయితే మొక్కజొన్నకు బదులు వేరే పంట వేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. పత్తిని గతేడాది 2లక్షల ఎకరాల్లో వేయగా.. ఈ సారి ఆ సాగు 2.6లక్షల ఎకరాలకు పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. పత్తి ధర అనూహ్యంగా పెరగడంతో దాని సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. కందులు 1.66లక్షల ఎకరాలు, లక్ష ఎకరాల్లో మొక్కజొన్న, వరి 35వేల ఎకరాలు, పెసర 20,800, జొన్న 15వేలు, మినుములు 9,500ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేస్తున్నారు. కొంత విస్తీర్ణంలో కూరగాయలు, ఇతర పంటలు సాగుచేసే ఆస్కారం ఉంది.

అవసరమైన మేర ఎరువులు, విత్తన నిల్వలు

జిల్లాలో అన్ని రకాల ఎరువులు కలిసి 74,683 టన్నులు అవసరం. ఇప్పటికే 80శాతం ఎరువుల నిల్వలు ఉన్నాయి. డీఏపీ 15,867టన్నులు, యూరియా 28,360టన్నులు, ఎంవోపీ 6,206 టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 21,899 టన్నులు, ఎస్‌ఎస్పీ 2,351 టన్నులు అవసరం ఉంది. జిల్లాకు అవసరమైన ఎరువులు, విత్తనాల్లో 80శాతం నిల్వలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. విత్తనాల్లో పత్తి 5.94లక్షల ప్యాకెట్లు, మొక్కజొన్న 1247 క్వింటాళ్లు, కందులు 7876క్వింటాళ్లు, జొన్న 508క్వింటాళ్లు, వరి 70,481క్వింటాళ్లు, మినుములు 399, శనగలు 752క్వింటాళ్ల చొప్పున అవసరం ఉన్నాయి. కావాల్సిన మేరకు నిల్వ ఉన్నాయని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు.

రైతుబంధు కోసం ఎదురు చూపులు

ఏటా జూన్‌లో వేసే రైతుబంధు డబ్బులు ఈ సారి ఎప్పుడు వేస్తారా? అని రైతులు ఎదురు చూస్తున్నారు. జూన్‌లోనే ఎకరానికి రూ.5వేలు రైతుల ఖాతాల్లో వేస్తామని ప్రభుత్వం ఇప్పటికే పేర్కొన్నా.. ఈ నెలలో పది రోజులు దాటింది. కానీ ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ప్రకటనా వెలువడడం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రైతుబంధు కొంత ఆలస్యం అవుతుందా? అనే సందిగ్ధం రైతుల్లో కలుగుతోంది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి డబ్బులు రూ.2వేలు వేసినా చాలా మంది రైతులకు అవి పడలేదు. ఈకేవైసీ చేసుకున్నా చాలా మందికి రాలేదని తెలుస్తోంది. కేంద్ర పథకం డబ్బులు ఎలా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రైతుబంధు కోసమే రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎలాంటి పంటల నిబంధనా పెట్టకుండా డబ్బు వేయాలని కోరుతున్నారు.

  • సబ్సిడీ విత్తనాలివ్వాలి: గొగ్గి అనంతయ్య, రైతు, బాసుపల్లి

వానకాలం సాగుకు పొలాలను సిద్ధం చేశాం. సబ్సిడీపైగానీ, మార్కెట్‌లోగానీ విత్తనాలు అందుబాటులో లేవు. అన్ని రకాల విత్తనాలను ప్రభుత్వం రాయితీపై సరఫరా చేయాలి. రైతుబంధు కూడా ఈ వారంలోనే జమచేస్తే మాకు పెట్టుబడికి ఉపయోగపడుతుంది. ఆలస్యమైతే మల్లా  మిత్తికి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వం, అధికారులు అవసరమై అన్ని చర్యలు చేపట్టి రైతులకు సహకరించాలి. 

  • వానాకాలం సాగు ప్రణాళిక సిద్ధం:  గోపాల్‌, జిల్లా వ్యవసాయాధికారి, వికారాబాద్‌  

జిల్లాలో వానవాలం సాగుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాం. వివిధ రకాల పంటలు 5.9లక్షల ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేసి అందుకు తగ్గ విత్తనాలు, ఎరువులు సిద్ధం చేశాం. ఈ సారి వర్షాలు కురిసి పంటలు సాగుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.

Updated Date - 2022-06-16T04:17:06+05:30 IST