కర్బూజా రైతు కుదేలు!

ABN , First Publish Date - 2020-04-04T10:36:49+05:30 IST

జిల్లాలోని అనేక మంది రైతులకు కర్బూజా పంట ద్వారా ఎంతో కొంత ఆదాయం చేతికి అందేది.

కర్బూజా రైతు కుదేలు!

కర్బూజా రైతు కుదేలయ్యాడు. లాక్‌డౌన్‌తో ఎక్కడికక్కడ పొలాల్లోనే పంట నిలిచిపోయింది. రోజుల తరబడి నిల్వ ఉండిపోవడంతో ప్రస్తుతం కుళ్లిపోతోంది. గత నాలుగేళ్లుగా జిల్లాలో రైతులు కర్బూజా పంట సాగుచేస్తున్నారు. గతంలో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునేవారు. వేసవిలో డిమాండ్‌ ఉండడం, పంట గిట్టుబాటవుతుండడంతో జిల్లాలో రైతులు సాగుకు ఆసక్తి కనబరిచారు. ముఖ్యంగా వంశధార, నాగావళి, మహేంద్రతనయ, బాహుదా నదీ పరీవాహక ప్రాంతాల్లో మెట్ట భూముల్లో  కర్బూజా సాగుచేస్తున్నారు. ప్రస్తుతం పంట చేతికందగా..మార్కెట్‌కు తరలించే మార్గం లేకపోయింది. కళ్లెదుటే పంట నాశనమవుతుండడంతో రైతులు తల్లడిల్లిపోతున్నారు. కొందరు పొలాల్లోనే పంటను వదిలేస్తుండగా...మరికొందరు ఎంతో కొంతకు ఇచ్చి..వదిలించుకుంటున్నారు.



లాక్‌డౌన్‌తో పొలాల్లోనే పంట

రోజుల తరబడి నిల్వతో కుళ్లిపోతున్న కాయలు

భారీగా పడిపోయిన ధరలు

జిల్లా వ్యాప్తంగా రూ.1.28 కోట్లు నష్టం


 (మెళియాపుట్టి/ఆమదాలవలస రూరల్‌): జిల్లాలోని అనేక మంది రైతులకు కర్బూజా పంట ద్వారా ఎంతో కొంత ఆదాయం చేతికి అందేది.   ధరలు బాగా ఉండడంతో పంట వేసిన వారికి గిట్టుబాటయ్యేది. కొన్నేళ్లతో పోలిస్తే...గత రెండు, మూడు సంవత్సరాల్లో కర్బూజా సాగు చేసే రైతుల సంఖ్య పెరిగింది. ఏడాది సుమారు 800 ఎకరాల్లో కర్బూజా సాగుచేసినట్టు వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మెళియాపుట్టి, జలుమూరు, నరసన్నపేట, సరుబుజ్జిలి, రణస్థలం, పాతపట్నం, కొత్తూరు, హిరమండలం, ఎల్‌ఎన్‌పేట మండలాల్లో విరివిగా పంట వేశారు. ఏటా జనవరిలో కర్బూజా విత్తనాలు చల్లుకుంటారు.


మార్చి రెండో వారం నుంచి పంట ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఈ ఏడాది అడపాదడపా వర్షాలు పడడంతో పంట ఆశాజనకంగా ఉంది. ప్రస్తుతం కాయ అందుబాటులోకి వచ్చిన తరుణంలో కరోనా రూపంలో రైతులకు కష్టం వెంటాడింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో పొలాల్లోనే పంట ఉండిపోయింది. రహదారులు చెంతన ఉన్నవారు మాత్రం ఎంతో కొంతకు ఆరుబయట విక్రయిస్తున్నారు. కానీ కరోనా వైరస్‌ వ్యాప్తిపై అపోహలు నెలకొన్న నేపథ్యంలో చాలామంది కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు.


ముందుకు రాని వ్యాపారులు

రైతుల కంటే కర్బూజా విక్రయించే వ్యాపారులకే అధిక లాభాలు తెచ్చిపెడుతోంది. సాధారణంగా ఎకరాకు 20 టన్నుల వరకూ కాయలు దిగుబడి వస్తుంటాయి. పెట్టుబడి  కింద రూ.లక్ష వరకూ రైతులు ఖర్చు పెడుతున్నారు. రైతుల వద్దకు నేరుగా వ్యాపారులు వెళ్లి కాయలను కొనుగోలు చేస్తుంటారు.  కిలో రూ.5 కొనుగోలు చేసి.. గిరాకీని బట్టి కిలో రూ. 15 నుంచి రూ.20 వరకు మార్కెట్‌లో వ్యాపారులు విక్రయిస్తుంటారు. అధికంగా విశాఖ, బరంపురం, పలాస, శ్రీకాకుళం, కాకినాడ నుంచి వ్యాపారులు వచ్చి కాయలను తరలిస్తుండేవారు.


ప్రస్తుతం కిలో రూ.2చొప్పున విక్రయిద్దామన్నా ఎవరూ రావడంలేదు. కొంతమంది  వాహనాల్లో విక్రయించాలని భావిస్తున్నా... రానుపోను ఖర్చులు రావడంలేదని రైతులు వాపోతున్నారు. ప్రస్తుత సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా రూ.1.28 కోట్ల మేర కర్బూజా రైతులు నష్టపోయినట్లు తెలుస్తోంది. అక్కడక్కడా కొంతమంది రైతులు ఆటోలు, ట్రాక్టర్లలో కాయలు వేసుకొని సమీపంలోని పట్టణాల్లో ఎంతోకొంతకు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఎంతో కొంత చేతికి అందుతోంది.


అప్పులే మిగిలాయి..పోలాకి కాళిదాస్‌, కర్బూజా రైతు, టకోయి

ఏటా ఏదో రూపంలో నష్టపోతున్నాం.  ఈ ఏడాది ఆరు ఎకరాల్లో కర్బూజా పంట వేసినా ఒక్కకాయ విక్రయించలేకపోయాను. పంట చేతికి వచ్చిన సమయంలో లాక్‌డౌన్‌ రూపంలో నష్టపోయాం. ప్రభుత్వం ఆదుకుంటే అప్పుల నుంచి బయటపడతా.. లేకుంటే చావే శరణ్యం.


 రైతుల నుంచి ఫిర్యాదులు...  మోహనరావు, వ్యవసాయ శాఖ అధికారి, మెళియాపుట్టి

 ఈ ఏడాది కర్బూజా ఆశాజనకంగా పండినా లాక్‌డౌన్‌ నేపథ్యంలో మార్కెటింగ్‌ నిలిచిపోయింది. రైతుల నుంచి వినతులు వస్తున్నా ఏమీ చేయలేని పరిస్థితి. అందుకే వలంటీర్ల ద్వారా గ్రామాల్లో పంట నష్టంపై అంచనాలు రూపొందిస్తున్నాం. ప్రభుత్వానికి నివేదిస్తున్నాం. 

        

అమ్మకాలు లేవు.. ఎ.రమణ, లంకాం, శ్రీకాకుళం రూరల్‌

ఏటా వేసవిలో కర్బూజా విక్రయించి ఉపాధి పొందుతున్నాం. ఈ ఏడాది విక్రయాలు గణనీయంగా పడిపోయాయి. పొలాల నుంచి పంటను తీసుకురావడానికి వ్యయప్రయాసలకోర్చుతున్నాం. నాలుగు రోజుల కిందట లోడు తెచ్చాం. కానీ అమ్మకాలు లేక కాయలు కుళ్లిపోతున్నాయి. కాయ రూ.20కు ఇస్తామన్నా ఎవరూ ఆసక్తిచూపడం లేదు.  


నష్ట పోతున్నాం .. భాస్కరరావు, పొడుగుపాడు, సరుబుజ్జిలి 

గత ఏడాదిలా ఈసారి వ్యాపారం సాగుతుందని భావించాం.  అధికంగా కర్బూజా కొనుగోలు చేశాం. కరోనా ప్రభావంతో వ్యాపారాలు సాగడంలేదు. కాయలు చెల్లకపోవడంతో నష్టపోతున్నాం.  


Updated Date - 2020-04-04T10:36:49+05:30 IST