పేదరైతుకు ‘డ్రాగన్‌’ అందని మావేనా?

ABN , First Publish Date - 2020-09-23T10:00:37+05:30 IST

ఉపాధిహామీ పథకం ద్వారా డ్రాగన్‌ ఫ్రూట్స్‌ సాగు చేసుకునేందుకు కేంద్రం అనుమతించినా... రాష్ట్రంలో మాత్రం దానిని

పేదరైతుకు ‘డ్రాగన్‌’ అందని మావేనా?

కేంద్రం వరమిచ్చినా... పట్టించుకోని రాష్ట్రం

ఉపాధిలో డ్రాగన్‌ ఫ్రూట్స్‌ సాగుకు కేంద్రం ఓకే

రాష్ట్ర సర్కారూ అనుమతిస్తే అన్నదాతకు భారీ ఊరట


అమరావతి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): ఉపాధిహామీ పథకం ద్వారా డ్రాగన్‌ ఫ్రూట్స్‌ సాగు చేసుకునేందుకు కేంద్రం అనుమతించినా... రాష్ట్రంలో మాత్రం దానిని పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. డ్రాగన్‌ ఫ్రూట్స్‌ సాగుకు ఉపాధి హామీలో నిధులందించేందుకు కేంద్రం అనుమతించింది. రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు మాత్రం ఈ పంటను ఉపాధి పథకంలో సాగు చేసుకునేందుకు అనుమతివ్వడంలో జాప్యం చేస్తుండటంతో రైతులు నష్టపోతున్నారు. ప్రకాశం, గుంటూరు, కృష్ణాతో పాటు రాయలసీమలోని పలు జిల్లాల్లో ఈ పంటను విస్తారంగా సాగుచేస్తున్నారు. ఈ పంట సాగు ఖర్చుతో కూడినది కావడంతో చిన్న, సన్నకారు రైతులు ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టి సాగుచేసే పరిస్థితి లేదు.


అయితే కేంద్ర ప్రభుత్వం చిన్న రైతులు కూడా ఈ పంట సాగుచేసుకుని లాభాలు గడించాలనే ఆశయంతో ఉపాధి హామీ చట్టంలో ఈ పంటకు అనుమతించారు. మన రాష్ట్రంలో ఈ పంట సాగుచేయాలంటే ఎకరాకు రూ.6లక్షల దాకా ఖర్చవుతుందని అంచనా. ఒక్కో ఎకరాకు రూ.2 లక్షల కంటే ఎక్కువ మెటీరియల్‌ నిధులు ఈ పంట సాగుకు ఖర్చుచేసే వెసులుబాటు లేనందున అనుమతించేందుకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. గతంలో మన రాష్ట్రంలో ఉద్యానవన శాఖ అధికారులు ఈ పంట సాగుచేసుకునే రైతులకు ఎకరాకు రూ.2 లక్షలు సబ్సిడీ అందించేవారు. గతేడాది నుంచి ఈ సబ్సిడీ నిలిపేశారు. గత ఏడాది అయితే ప్రకాశం జిల్లాలో ఒక్క హెక్టార్‌కు మాత్రమే డ్రాగన్‌ఫ్రూట్స్‌ పంట వేసేందుకు అనుమతించారు. ఉపాధి హామీ పథకంలోనైనా ఈ పంట సాగుకు సాయం అందిస్తే అనేక మంది పేద  రైతులు డ్రాగన్‌ ఫ్రూట్స్‌ పంటను సాగుచేసుకునే వీలుంటుంది.

Updated Date - 2020-09-23T10:00:37+05:30 IST