వానాకాలం ప్రణాళిక ఖరారు

ABN , First Publish Date - 2020-04-26T09:28:40+05:30 IST

వానాకాలం (ఖరీఫ్‌) సీజన్‌కు జనగామ జిల్లా వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది.

వానాకాలం ప్రణాళిక ఖరారు

జనగామ జిల్లాలో 3 లక్షల ఎకరాల్లో పంటల సాగు

యాక్షన్‌ప్లాన్‌ తయారు చేసిన వ్యవసాయశాఖ 


జనగామ, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి) : వానాకాలం (ఖరీఫ్‌) సీజన్‌కు జనగామ జిల్లా వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. జిల్లా వ్యాప్తంగా యాసంగి సీజన్‌ ముగిసి ధాన్యం విక్రయాలు జరుగుతుండగా, ముందస్తుగా వానాకాలానికి యాక్షన్‌ప్లాన్‌ను రూపొందించింది. లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో రైతులకు సమస్యలు ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటున్నారు.


జిల్లాలోని 12 మండలాల్లో 3,04,927 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని అగ్రికల్చర్‌ శాఖ అంచనా వేసింది. అత్యధికంగా 1,76,296 ఎకరాల్లో పత్తిపంట సాగు చేస్తారని భావిస్తోంది. 94వేల ఎకరాల్లో వరి, 16,344 మొక్కజొన్న, 2,400 పెసర, 14,072 కంది, 1,098 పొగాకు, 400 వేరుశెనగతో పాటు 94 ఎకరాల్లో ఇతరత్రా పంటలు సాగవుతాయని అంచనా వేశారు. 


ముందుగానే ఎరువులు..

వానాకాలంలో రైతులు ఇబ్బందులు పడకుండా ముందుగానే ఎరువులు దిగుమతిచేసుకుని నిల్వచేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఇందుకుగాను 32,522 మెట్రిక్‌ టన్నుల యూరియా, 17,840 మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు, 15,242 మెట్రిక్‌టన్నుల డీఏపీ, 13,830 మెట్రిక్‌టన్నుల పొటాష్‌ ఎరువులు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు. లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ ముందస్తుగానే ప్రభుత్వ అనుమతులు పొంది ఎరువులను జనగామ జిల్లాకు తెప్పించే ప్రయత్నాల్లో వారు ఉన్నారు. 


ఇబ్బందులు లేకుండా చూస్తాం..నర్సింగం, డీఏవో జనగామ

వచ్చే వానాకాలం సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రణాళిక రూపొందించారు. అంచనా మేరకు ఎరువులను విడతలవారిగా తెప్పిస్తున్నారు. ఇప్పటికే 8వేల టన్నుల ఎరువులను జిల్లాకు తెప్పించి నిల్వచేశాం. విత్తనాల కొరత లేకుండా అన్నిచర్యలు తీసుకుంటున్నాం.


Updated Date - 2020-04-26T09:28:40+05:30 IST