సాగు సందడి

ABN , First Publish Date - 2021-06-10T06:20:13+05:30 IST

జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వాతావరణం కాస్తా చల్లబడింది. ఆకాశం మేఘావృతం అవుతూ చిరుజల్లులు పడుతుండడంతో రైతన్నల్లో ఆనందం నెలకొంటుంది.

సాగు సందడి
సాగు పనులను చేపట్టిన రైతులు

- వానాకాలం సాగుకు సిద్ధమవుతున్న జిల్లా రైతులు
- వరినారుమళ్లు, దుక్కులు సిద్ధం చేస్తున్న అన్నదాతలు
- గత వారం రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలు
- ఇప్పటి వరకు 63 సెం.మీ వర్షపాతం
- ఈ సీజన్‌లో 4.90 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యే అవకాశం
- అందుబాటులో విత్తనాలు, ఎరువులు
- రైతుబంధుతో తీరనున్న పెట్టుబడి కష్టాలు


కామారెడ్డి, జూన్‌ 9(ఆఽంధ్రజ్యోతి):
జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వాతావరణం కాస్తా చల్లబడింది. ఆకాశం మేఘావృతం అవుతూ చిరుజల్లులు పడుతుండడంతో రైతన్నల్లో ఆనందం నెలకొంటుంది. వానాకాలం సాగుకు సిద్ధమవుతూ అన్నదాతలు పొలం బాటపడుతున్నారు. తొలకరి జల్లులు పడడంతో పంటల సాగుకు దుక్కులు దున్నుతూ నేలను చదును చేస్తున్నారు. బోరుబావుల కింద వరి నారుమళ్లను సిద్ధం చేసుకుంటున్నారు. పత్తి, సోయా, మొక్కజొన్న, పప్పు దినుసుల విత్తనాలు విత్తేందుకు గ్రామీణ రైతులు నాగళ్లతో నల్లరేగడ్లను దున్నుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 63 మి.మీ. వర్షాపాతం నమోదు కావడంతో రైతులు పంటలకు సాగుకు పరిగెత్తుతున్నారు. ఇప్పటికే జిల్లా యంత్రాంగం వానాకాలం సాగుకు ప్రణాళికలను రూపొందించింది. ఈ సీజన్‌లో 4.90 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేశారు. ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలను సరఫరా చేయకపోవడంతో ప్రైవేట్‌ దుకాణాలు, డీలర్ల వద్ద కొనుగోలు చేస్తుండడంతో సందడి నెలకొంటుంది. పంటల సాగుకు ప్రభుత్వం రైతుబంధు కింద ఎకరాన రూ.5 వేలు ఇవ్వడంతో మరింత ఉత్సాహంతో రైతులు సాగుకు సన్నద్ధం అవుతున్నారు.
వానాకాలంలో 4.90 లక్షల ఎకరాల్లో పంటల సాగు
జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజన్‌ల పరిధిలో వానాకాలం పంటల సాగుకు సంబంధించిన ప్రణాళికను వ్యవసాయశాఖ ఇప్పటికే రూపొందించింది. గత సీజన్‌తో పోలిస్తే వానాకాలంలో కాస్త సాగు విస్తీర్ణం పెరిగింది. గత వానాకాలం సీజన్‌లో 4.72 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా ఈ సీజన్‌లో 4.90 లక్షల ఎకరాల్లో సాగవుతాయని అంచనా వేశారు. దీంట్లో 2.42 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని, 70వేల ఎకరాల్లో పత్తి, 55 వేల ఎకరాల్లో సోయాబిన్‌, 50వేల ఎకరాల్లో మొక్కజొన్న, 35వేల ఎకరాల్లో కంది, 296 వేల ఎకరాల్లో జొన్నలు, 18 వేల ఎకరాల్లో పెసర్లు, 11వేల ఎకరాల్లో మినుములు, 9వేల ఎకరాల్లో చెరుకు, 362 ఎకరాల్లో కూరగాయల పంటలు సాగవుతాయని అంచనా వేశారు.
లక్షా 2 వేల క్వింటాళ్లలో విత్తనాలు.. లక్షా 23వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులు
జిల్లాలో వానాకాలం పంటల సాగుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలను ఏ యేడు జిలుగు, జనుము మాత్రమే సరఫరా చేసింది. మిగతా విత్తనాలు ప్రైవేట్‌ డీలర్ల వద్ద అందుబాటులో ఉన్నాయి. ఈ వానాకాలంలో 72 వేల 600 క్వింటాళ్లలో వరి విత్తనాలు, 50వేల క్వింటాళ్లలో మొక్కజొన్న, 28వేల క్వింటాళ్లలో పత్తి, 16వేల క్వింటాళ్లలో సోయాబిన్‌, 2800 క్వింటాళ్లలో కంది, 1400 క్వింటాళ్లలో పెసర, 870 క్వింటాళ్లలో మినుము విత్తనాలు అందుబాటులో ఉంచారు. అదేవిధంగా 1.23 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమని నిర్ణయించారు. 65వేల 370 మెట్రిక్‌ టన్నులలో యూరియా 14,410 మెట్రిక్‌ టన్నులలో డీఏపీ 25వేల మెట్రిక్‌ టన్నులలో, కాంప్లెక్స్‌ 8600 మెట్రిక్‌ టన్నులలో ఎరువులు అవసరమని నిర్ణయించగా వీటిని సహకార సంఘాలతో పాటు ప్రైవేట్‌ డీలర్ల వద్ద అందుబాటులో ఉంచారు. ఇప్పటికే ఎరువులు, విత్తనాలను రైతులు కొనుగోలు చేసి సిద్ధంగా ఉన్నారు.
జిల్లాలో కురుస్తున్న వర్షాలు
జిల్లాలో వారం రోజుల నుంచి చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఓ మోస్తారు వర్షం కురిసింది. 31.0 మి.మీల వర్షం పడింది. జూన్‌ 1 నుంచి బుధవారం వరకు మొత్తం 63 మి.మీ వర్షం కురిసినట్లు వాతావరణశాఖ పేర్కొంది. జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వర్షపు నీరు నిలుస్తుండడంతో రైతులు పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. రాజంపేట, దోమకొండ, కామారెడ్డి తదితర మండలాల్లో కురిసిన వర్షాలకు కాలువలు జలకళను సంతరించుకున్నాయి. దీంతో సాగుకు రైతులు పొలం బాట పడుతున్నారు.
దుక్కులు దున్నుతూ.. నారుమళ్లు సిద్ధం చేస్తూ..
ఈ వానాకాలం సీజన్‌లో నైరుతి రుతుపవనాలు ముందుగానే కనికరించడంతో జిల్లా అంతటా చిరుజల్లులు పడుతున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట పొలాల్లో నీరు నిల్వడం, భూమి తడవడంతో రైతులు పొలం బాటపట్టారు. విత్తనాలను విత్తుకోవడానికి ముందస్తుగానే తెచ్చి పెట్టుకున్నారు. చిరుజల్లులు కురుస్తుండడంతో పంట పొలాలను దున్నుతూ భూమి చదును చేస్తున్నారు. పత్తి, సోయా, మొక్కజొన్న, పప్పుదినుసు పంటలను సాగు చేస్తున్నారు. అదేవిధంగా భూసారం పెంచేందుకు జిలుగు, జనుము లాంటి పచ్చిరొట్టె ఎరువులను వేస్తున్నారు. బోరు బావులు, చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల కింద వరి నారుమళ్లను నీరుపెట్టి దమ్ము కొట్టిస్తున్నారు. వరి విత్తనాలు మొలకెత్తగానే నాట్లు వేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆసరాకానున్న రైతుబంధు
జిల్లాలో ఓ వైపు రైతులు వానాకాలం పంటల సాగుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే కిసాన్‌సమ్మాన్‌ నిధి, రైతుబంధు నిధులు రైతులకు కాస్తా ఆసరా కానున్నాయి. ఇప్పటికే రైతుల ఖాతాలో కిసాన్‌ సమ్మాన్‌ నిధి డబ్బులు జమ కాగా ఈనెల 15 నుంచి 25వ తేదీ వరకు రైతులందరికీ ఖాతాలో రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం జమ కానుంది. దీని కోసం రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కాగా రైతుబంధును అందించడానికి వ్యవసాయశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే ఈ సీజన్‌లో 2.59 మందికి పైగా రైతులకు రూ.246 కోట్లు రైతుబంధు కింద అందనుంది. దీంతో పాటు 4వేల మంది రైతులు కొత్తగా చేరే అవకాశం ఉంది. విడతల వారీగా ఈ నిధులను రైతు ఖాతాలో జమ చేయనున్నారు.

Updated Date - 2021-06-10T06:20:13+05:30 IST