సాగు సందడి

ABN , First Publish Date - 2022-07-04T06:18:14+05:30 IST

నైరుతి ప్రభావంతో అక్కడక్కడ కురుస్తున్న వర్షాలు రైతుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి.

సాగు సందడి

 వ్యవసాయ పనుల్లో రైతులు నిమగ్నం

 మూసీ ఆయకట్టులో నారుదశలో వరి సాగు

 ప్రభుత్వం నుంచి అరకొర విత్తనాల పంపిణీ

 ఇబ్బందులు పడుతున్న రైతులు 

నైరుతి ప్రభావంతో అక్కడక్కడ కురుస్తున్న వర్షాలు రైతుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వానాకాలం సాగు పనులను రైతులు ముమ్మరం చేశారు. నాగార్జునసాగర్‌, మూసీ ఆయకట్టుతో పాటు నాన్‌ ఆయకట్టు ప్రాంతాలు వ్యవసాయ పనులతో సందడిగా మారాయి. పత్తి విత్తనాలు విత్తడం దాదాపు పూర్తికావొస్తుండగా, వరి నారుమడులు జోరుగా సాగుతున్నాయి. 

భూదాన్‌పోచంపల్లి


జిల్లావ్యాప్తంగా వరి 2.40లక్షల ఎకరాలు, పత్తి 1.50లక్షల ఎకరాలు, కంది 40వేల ఎకరాలు, జొన్న 1,500ఎకరాల్లో సాగు కావచ్చని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. నల్లగొండ జిల్లాలో వానాకాలం పంటల సాగు అంచనా 11.50లక్షల ఎకరాలు. అందులో వరి 6.70లక్షల ఎకరాలు, పత్తి 4.60లక్షల ఎకరాలు, కంది 20వేల ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. సూర్యాపేట జిల్లాలో వరి 4.40లక్షల ఎకరాలు, పత్తి 1.23లక్షల ఎకరాలు, మిర్చి 20,500 ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. సాగర్‌, మూసీ ఆయకట్టులో వరి నాట్లు వేస్తుండగా, నాన్‌ ఆయకట్టు ప్రాంతాల్లో మెట్టపంటల విత్తనాలు వేయడం దాదాపుగా పూర్తయింది. మూసీ ఆయకట్టు ప్రాంతాల్లో భూదాన్‌పోచంపల్లి, వలిగొండ, బీబీనగర్‌ మండలాల్లో వరి నార్లు పోసి, నాట్లు వేసే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. భువనగిరి మండలంలోని పలు గ్రామాల్లో, మోత్కూరు, అడ్డగూడూరు మండలాల్లో పత్తి, కంది విత్తనాలు విత్తడం పూర్తయింది. చౌటుప్పల్‌, రామన్నపేట, సంస్థాన్‌నారాయణపురం మండలాల్లో పత్తి విత్తనాలు విత్తడం పూర్తికాగా, వరి సాగు చేసే రైతులు పనులు ముమ్మరం చేశారు. పూర్తిగా నాన్‌ ఆయకట్టు ప్రాంతాలైన బొమ్మలరామారం, తుర్కపల్లి, గుండాల, ఆలేరు, రాజాపేట, మోటకొండూరు, యాదగిరిగుట్ట, ఆత్మకూరు(ఎం) మండలాల పరిధిలోనూ సాగు పనులు వేగవంతమయ్యాయి.


విత్తనాలు వెదజల్లే విధానంపై రైతుల దృష్టి

వరి సాగులో నాట్లు వేసే పద్ధతినే ఉమ్మడి జిల్లా రైతులు పాటిస్తున్నారు. అయితే ఈ సారి విత్తనాలు వెదజల్లే విధానంపై వ్యవసాయశాఖ దృష్టి సారించింది. దీనిపై రైతులకు ఇప్పటికే అవగాహన కల్పించింది. వెదజల్లే విధానంలో వరి సాగుకు చాలామంది రైతులు ముందుకు వచ్చారు. అదే సమయంలో పత్తి సాంద్రత విధానంలో సాగును పెంచేందుకు అధికారులు రైతులను ప్రోత్సహిస్తున్నారు.


అన్నదాతకు విత్తన కష్టాలు

వానాకాలానికి అవసరమైన విత్తనాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడతో రైతులు విత్తనాల కోసం పరుగులు తీస్తున్నారు. కేవలం 30శాతం మంది రైతులకే విత్తనాలు అందాయి. మిగిలిన 70శాతం మంది రైతులు ప్రైవేటు డీలర్ల వద్ద అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 2.40లక్షల ఎకరాల్లో వరి సాగు చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేయగా, అందుకు సరిపడా విత్తనాలను అందుబాటులో లేవు. దీంతో అన్నదాతలు విత్తన కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అధికారుల అంచనా ప్రకారం జిల్లా వ్యాప్తంగా 24వేల హెక్టార్లకు సుమారు 48వేల క్వింటాళ్ల వరకు వివిధ రకాల వరి విత్తనాలు అవసరం. కాగా, అధికారులు 25వేల క్వింటాళ్ల విత్తనాలు మాత్రమే అందుబాటులో ఉంచారు. టీఎస్‌ సీడ్స్‌ ద్వారా 20-30కిలోల వరి విత్తనాల బస్తాలను సబ్సిడీపై రూ.800-రూ.1000 వరకు సరఫరా చేస్తున్నారు. ప్రైవేటు డీలర్లు మాత్రం ఒక్కో బస్తాకు అదనంగా రూ.400 నుంచి రూ.600 వరకు వసూలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం డీఏపీ, 28-28, 14-35-14, 20-20-0-13, 15-15-15, ఎంవోపీ యూరియా రకాలను మాత్రమే ఇస్తోంది. అది కూడా 30శాతం మంది రైతులకే అందిస్తోంది. మిగిలిన 70శాతం మంది రైతులు ప్రైవేటు డీలర్ల వద్ద కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. విత్తన డిమాండ్‌ దృష్ట్యా కొందరు డీలర్లు ఆయా రకాల 20కిలోల బస్తాను రూ.1,200 నుంచి రూ.1,350 వరకు విక్రయిస్తున్నారు. మొత్తంగా ఒక్క విత్తన బస్తాకు రూ.400 నుంచి రూ.600 వరకు అదనంగా విక్రయిస్తున్నారు. గత వానాకాలం సీజన్‌ ధరలతో పోలిస్తే ప్రస్తుత సీజన్‌లో ధరలు రెట్టింపయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూసీ ఆయకట్టులో ఎక్కువగా వరి సాగవుతుంది. ఇక్కడ ఎఫ్‌టీయూ-1353, ఎఫ్‌టీయూ-1156, ఎంటీయూ-1010 (తెలంగాణ సోనా), కేఎన్‌ఎం-118 రకాల విత్తనాలు రైతులు అధికంగా వినియోగిస్తున్నారు. ప్రభుత్వం అరకొరగా విత్తనాలు సరఫరా చేస్తుండగా, రైతులు విత్తనశుద్ధి మరవడంతో కొరత ఏర్పడుతోంది. కాగా ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో సాగు విస్తీర్ణం పెరగడంతో ట్రాక్టర్లకు, కూలీలకు డిమాండ్‌ పెరిగింది. దీనికి తోడు పెట్రోల్‌, డీజిల్‌, విత్తనాల ధరలు పెరగడంతో పెట్టుబడులు ఊహించని రీతిలో పెరుగుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి వరి సాగు పెట్టుబడులు రెట్టింపయ్యాయని రైతులు చెబుతున్నారు. 


కురుస్తున్న వాన

నల్లగొండ జిల్లాలో పలు చోట్ల చిరు జల్లులతో పాటు మోస్తరు వర్షం కురిసింది. మునుగోడు మండలంలోని జమస్తాన్‌పల్లిలో దళితబంధు పంపిణీ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన టెంటు ఈదురుగాలులు, వర్షానికి కూలిపోయింది. వర్షంలోనే మంత్రి జగదీ్‌షరెడ్డి లబ్ధిదారులకు వాహనాలను అందజేశారు. చండూరు, హాలియా, కేతేపల్లి, మిర్యాలగూడ, నిడమనూరు, తిప్పర్తి, శాలిగౌరారంతో పాలు పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. మూసీకి 757 క్యూసెక్యుల చొప్పున వరద నీరు వస్తోంది.  645అడుగులు(4.46టీఎంసీ)ల పూర్తి స్థాయి నీటినిల్వ సామర్థ్యం గల మూసీ ప్రాజెక్టు నీటిమట్టం ఇటీవలి వరకు 644అడుగులుగా ఉంది. శాలిగౌరారం మండలంలో మూసీ నీటితో నిండిన రామాంజపురం, కొత్తపల్లి చెరువులు అలుగు పోస్తున్నాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంతోపాటు పలు ప్రాంతాల్లో చిరు జల్లులు, మోస్తరు వర్షం కురిసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు మండలాల్లో చిరుజల్లు వర్షం కురవగా, జిల్లావ్యాప్తంగా 12.8 మి.మీ వర్షపాతం నమోదైంది.


ఎరువుల ధరలు

    రకాలు గత యాసంగిలో ప్రస్తుతం 

ధర (రూ.లో)         ధర 

డీఏపీ 1,250 1,350

28-28 1,275 1,700 

14-35-14 1,275 1,750

20-20-0-13 1,250 1,400

15-15-15  1,050 1,450

ఎంవోపీ 1,075 1,700

యూరియా 266.50 266.50


నిబంధనల మేరకే : అనురాధ, జిల్లా వ్యవసాయ అధికారి 

నిబంధనల ప్రకారమే జిల్లాలో రైతులకు 30, 40శాతం మాత్రమే విత్తనాలు సరఫరా చేసే అవకాశం ఉంది. మిగిలిన రైతులు విత్తనశుద్ధి చేసుకోవాలి. ప్రైవేటు డీలర్ల నుంచి సబ్సిడీ ధరలకు నాణ్యమైన విత్తనాలు పొందేలా చర్యలు తీసుకున్నాం. పూర్తిస్థాయిలో విత్తనాలు సరఫరా చేసేందుకు ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తాం.

Updated Date - 2022-07-04T06:18:14+05:30 IST