సాగు.. బాగు!

ABN , First Publish Date - 2022-06-19T04:34:47+05:30 IST

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్టణీకరణ వల్ల వ్యవసాయ భూముల విస్తీర్ణం తగ్గుతున్నప్పటికీ స్థూలసాగు గణనీయంగా పెరుగుతుండడం ఊరటనిస్తోంది.

సాగు.. బాగు!


  • ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పెరిగిన స్థూలసాగు
  •  పలు ప్రాంతాల్లో రెండో పంట సాగు పెరగడమే కారణం
  •  సాగు విస్తీర్ణం పెరిగిన జిల్లాల్లో వికారాబాద్‌  అగ్రస్థానం
  •  వికారాబాద్‌లో 29.2శాతం పెరిగిన ఎరువుల వినియోగం
  •  మేడ్చల్‌లో సగానికి తగ్గిన ఎరువుల వినియోగం
  •  ఉపాధిలో రంగారెడ్డి వెనుకంజ
  •  తెలంగాణ సామాజిక, ఆర్థిక నివేదికల్లో వెల్లడి


ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్టణీకరణ వల్ల వ్యవసాయ భూముల విస్తీర్ణం తగ్గుతున్నప్పటికీ స్థూలసాగు గణనీయంగా  పెరుగుతుండడం ఊరటనిస్తోంది.గడిచిన ఆర్థిక సంవత్సరం పుష్కలంగా వర్షాలు కురవడంతో పాటు 24గంటల విద్యుత్‌ సరఫరాతో యాసంగిలో ఎక్కువ మంది రైతులు  రెండో పంట కూడా పండించారు.  వికారాబాద్‌ జిల్లాలో  అత్యధికంగా సాగు విస్తీర్ణం పెరిగి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది.


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి, జూన్‌ 18): హైదరాబాద్‌ చుట్టు పక్కల విస్తరించి ఉన్న రంగారెడ్డి, మేడ్చల్‌  జిల్లాలతో పాటు వికారాబాద్‌ జిల్లాలో శరవేగంగా పట్టణీకరణ జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రతి ఏటా వేలాది ఎకరాల వ్యవసాయ భూములు వెంచర్లుగా మారిపోతున్న విషయం విదితమే. అయితే ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన తెలంగాణ సామాజిక ఆర్ధిక ముఖచిత్రం-2022 నివేదికలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వశాఖల సమాచారం ఆధారంగా రాష్ట్ర ఆర్ధిక గణాంకశాఖ  విడుదల చేసిన ఈ నివేదికలో రంగారెడ్డి, మేడ్చల్‌, వికారాబాద్‌  జిల్లాల్లో గత  ఆర్ధిక సంవత్సరం (2021-22)లో స్థూల వ్యవసాయసాగు పెరిగినట్లు వెల్లడైంది. అంటే ఏడాది కాలంలో ఒక వ్యవసాయక్షేత్రంలో పండించే పంటల సంఖ్య ఆధారంగా సాగు సాంద్రత నిర్ధారిస్తారు.  ఏడాదిలో ఒక పంట కంటే ఎక్కువ పంటలు సాగు చేస్తే స్థూలసాగు పెరిగినట్లు అంచనా వేస్తారు. గడిచిన ఆర్ధిక సంవత్సరం పుష్కలంగా వర్షాలు కురవడంతో ఎక్కువ మంది రైతులు యాసంగిలో రెండో పంట కూడా పండించారు. అలాగే రైతులకు అవాంతరాలు లేకుండా ఉచిత విద్యుత్‌ అందిస్తుండడంతో యాసంగిలో కూడా రైతులు రికార్డు స్థాయిలో పంటలు సాగు చేశారు. ఈ కారణంగా ఈ మూడు జిల్లాల్లో నికరసాగు (సాంద్రత) పెరిగింది. రాష్ట్రంలో సగటు 13.7శాతం స్థూలసాగు పెరిగింది. అయితే  వికారాబాద్‌ జిల్లా రాష్ట్రంలో అత్యధికంగా సాగువిస్తీర్ణం పెరిగిన జిల్లాల్లో అగ్రస్థానంలో ఉంది. మెదక్‌ జిల్లా తరువాత వికారాబాద్‌లో అత్యధికంగా 31.6శాతం సాగు విస్తీర్ణం పెరగడం విశేషం . అంతేకాక రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో ఎరువుల వినియోగం గణనీయంగా పెరిగింది. అయితే ఇదే సమయంలో మేడ్చల్‌ జిల్లాలో దాదాపు సగానికిపైగా ఎరువుల వినియోగం తగ్గడం గమనార్హం. ఇక్కడ అంతకు ముందు ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే ఎరువుల వినియోగంలో రాష్ట్ర సగటు  పెరుగుదల 19శాతం ఉండగా వికారాబాద్‌లో  29.2శాతం ( రాష్ట్రంలో 16వ స్థానం) ఉంది. అలాగే రంగారెడ్డి జిల్లాలో 10.6శాతం పెరుగుదల (రాష్ట్రంలో 23వ స్థానం) నమోదైంది. ఇక మేడ్చల్‌ జిల్లాలో  దాదాపు 52.5శాతం ఎరువుల వాడకం తగ్గింది. ఇక్కడ స్థూలసాగు పెరిగినప్పటికీ ఎరువులు వినియోగం ఇంత పెద్ద స్థాయిలో తగ్గడం గమనార్హం. ఇది రాష్ట్రంలో అతి తక్కువ కావడం విశేషం. ఉపాధి హామీ పథకం కింద  2021-22 ఆర్ధిక సంవత్సరం  కూలీలకు పని కల్పించడంలో రంగారెడ్డి జిల్లా బాగా వెనుకబడింది. కూలీలకు ఉపాధి కల్పనలో  రాష్ట్రసగటు 97శాతం ఉండగా మేడ్చల్‌ జిల్లాలో 113శాతం, వికారాబాద్‌ జిల్లాలో 107శాతం ఉపాధి కల్పించారు. రంగారెడ్డిజిల్లాలో మాత్రం 78శాతం మాత్రమే  కూలీలకు ఉపాధి కల్పించారు. అయితే రంగారెడ్డిజిల్లాలో కూలీలకు ఉపాధి పనులు తగ్గడానికి  కారణం కూడా ఉంది. కొవిడ్‌ పరిస్థితుల కారణంగా అంతకు ముందు ఏడాది వివిధ రంగాలకు చెందిన ప్రైవేటు ఉద్యోగులు తమ కంపెనీలు మూతపడడంతో  స్వగ్రామాలకు  వచ్చి ఉపాధి పనులు  చేసుకున్నారు. అయితే గత ఏడాది నుంచి కంపెనీలు తిరిగి తెరుచుకోవడంతో తిరిగి వీరంతా పట్టణబాటపట్టారు. దీంతో గ్రామాల్లో ఉపాధి కూలీ పనులు చేసే వారి సంఖ్య కూడా తగ్గిపోయింది.

స్థూల వ్యవసాయసాగు పెరుగుదల శాతం

వికారాబాద్‌ 31.6

రంగారెడ్డిజిల్లా 20.9

మేడ్చల్‌ 20.5


ఎరువుల వినియోగశాతం

వికారాబాద్‌ 29.2

రంగారెడ్డి 10.6

మేడ్చల్‌ 52.5


కూలీలకు ఉపాధి పనులు శాతం

వికారాబాద్‌ 107

రంగారెడ్డి 78

మేడ్చల్‌ 113

Updated Date - 2022-06-19T04:34:47+05:30 IST