సాగు సంకటం

ABN , First Publish Date - 2021-12-09T06:31:39+05:30 IST

యాసంగి సాగు అన్నదాతలకు సంకటంగా మారింది. వరి వద్దని చెబుతున్న ప్రభుత్వం ప్రత్యామ్నాయం వైపు ద ృష్టి సారించాలని సూచిస్తోంది.

సాగు సంకటం
కామారెడ్డి మండలంలో రైతులకు అవగాహన కల్పిస్తున్న కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌

- వరి వద్దంటున్న అధికారులు

- ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయని వైనం

- పొద్దు తిరుగుడు, వేరు శనగ విత్తనాల కొరత

- ఆందోళనలో అన్నదాతలు


కామారెడ్డి, డిసెంబరు 8: యాసంగి సాగు అన్నదాతలకు సంకటంగా మారింది. వరి వద్దని చెబుతున్న ప్రభుత్వం ప్రత్యామ్నాయం వైపు ద ృష్టి సారించాలని సూచిస్తోంది. దీని సాధ్యాసాధ్యాలపై ఓవైపు అధికార యాంత్రాంగం తర్జనభర్జన పడుతుండగా మరోవైపు రైతులు అయోమయానికి గురవుతున్నారు. పంటల సాగుపై రైతులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి, భూగర్భజలాలు పుష్కలంగా ఉండడంతో ఈ సారి మంచి దిగుబడులు వస్తాయని ఆశించారు. వీరంతా వరి సాగుకు సిద్ధమైన తరుణంలో ఇక వడ్లు కొనేది లేదని ప్రభుత్వం చేసిన ప్రకటన అన్నదాతల ఆశలను నీరు గార్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న ప్రతిష్టంబన, పరస్పర విరుద్ధ ప్రకటనలు, నేతల మధ్య మాటల యుద్ధం అన్నదాతలకు సందిగ్ధంలోకి నెట్టింది. ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండానే ప్రత్యామ్నాయ పంటల సాగు ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. ఇతర పంటల విత్తనాలు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి వద్దంటున్న అధికారులు ప్రత్యామ్నాయ విత్తనాలను అందుబాటులో ఉంచడంలో విఫలమయ్యారు.

అదను దాటింది

యాసంగి సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా వరి తర్వాత మొక్కజొన్న పంటలు ఎక్కువగా పండిస్తుండగా ప్రభుత్వం రెండు పంటలపై ఆంక్షలు విధించడంతో రైతులకు దిక్కుతోచడం లేదు. పొద్దుతిరుగుడు, వేరుశనగ, శనగ, కుసుమ, జొన్న పంటలు వేయాలని చెబుతున్నా.. డిమాండ్‌ మేర విత్తనాలు అందుబాటులో లేవు. నీటి వినియోగం, పెట్టుబడి శ్రమ తక్కువగా ఉండే పొద్దు తిరుగుడుపై రైతులు ఆసక్తి చూపిస్తున్నా ఇప్పటి వరకు విత్తనాలు దొరకడం లేదు. దీనికి తోడు ఆయా పంటల సాగుకు అదను దాటిపోయిందని రైతులు చెబుతున్నారు.

ప్రత్యామ్నాయ పంటలివే..

యాసంగి సీజన్‌లో ఏటా వరి, మొక్కజొన్న, శనగ పంటలు అధిక విస్తీర్ణంలో సాగవుతున్నాయి. వరి, మొక్కజొన్నను ప్రభుత్వం వద్దంటుండగా నువ్వులు, పెసర, మినుము, తెల్ల కుసుమ, పొద్దుతిరుగుడు పంటలు వేసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే ఉద్యానవన పంటలు, కూరగాయలు, ఆకు కూరల పంటలపై హార్టికల్చర్‌ అధికారులు, పామాయిల్‌ తోటలపై రైతులకు అవగాహన కల్పించేందుకు వ్యవసాయశాఖ అధికారులు కృషి చేస్తున్నారు.

రెట్టింపు ధర

ప్రభుత్వం ప్రకటించిన వెంటనే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడం రైతులకు కష్టంగా మారింది. క్షేత్రస్థాయిలో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇతర పంటల విత్తనాలకు కొరత ఉండడంతో వ్యాపారులు ధరలు రెట్టింపు చేశారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రత్యామ్నాయ పంటలను వేయాలని ప్రచారం చేస్తున్న ప్రభుత్వం విత్తనాలను సైతం పెద్ద మొత్తంలో అందుబాటులోకి తెస్తే బాగుంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు.


ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలి

- జితేష్‌ వి.పాటిల్‌, కలెక్టర్‌

యాసంగిలో వరి ధాన్యానికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలి. అధికారులు గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి. శనగ, పొద్దు తిరుగుడు, వేరు శనగ, నువ్వులు లాంటి పంటలపై రైతులు అవగాహన పెంచుకుని మంచి దిగుబడి పొందాలి. వరి సాగు చేసుకునే రైతులు అమ్ముకునేందుకు సొంతగా ఏర్పాట్లు చేసుకోవాలి.


అవగాహన కల్పిస్తున్నాం

- భాగ్యలక్ష్మీ, వ్యవసాయాధికారి

రైతులు మూస ధోరణి వీడాలి. వరికి బదులు ఇతర పంటలు సాగు చేయాలి. ఆరుతడి పంటలతో మంచి ఆదాయం పొందే అవకాశముంది. కూరగాయలు, చిరుధాన్యాలు, పప్పు దినుసుల సాగుపై అవగాహన కల్పిస్తున్నాం. క్లస్టర్‌ల వారీగా రైతు వేదికల్లో సమావేశాలు నిర్వహిస్తున్నాం. అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉండేలా చూస్తాం.

Updated Date - 2021-12-09T06:31:39+05:30 IST