పెరిగిన సన్నాలు

ABN , First Publish Date - 2020-09-27T10:54:08+05:30 IST

నియంత్రిత సాగు విధానంలో భాగంగా గతంలో కంటే కాస్త వరిలో దొడ్డు రకాలను తగ్గించి సన్న రకాలను పెంచాలని సీఎం కేసీఆర్‌ సూచించిన మేరకు జిల్లాలో రైతులు

పెరిగిన సన్నాలు

- జిల్లాలో 65 శాతం సన్నరకం వరి సాగు

- తగ్గిన దొడ్డు రకం వరిసాగు

- కొనుగోలు కేంద్రాలపై తగ్గనున్న ఒత్తిడి


(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

నియంత్రిత సాగు విధానంలో భాగంగా గతంలో కంటే కాస్త వరిలో దొడ్డు రకాలను తగ్గించి సన్న రకాలను పెంచాలని సీఎం కేసీఆర్‌ సూచించిన మేరకు జిల్లాలో రైతులు విరివిగా సన్నరకం వరి సాగును చేపట్టారు. గతంలో జిల్లాలో అయ్యే వరిసాగు విస్తీర్ణంలో 35 శాతం సన్నాలు, 65 శాతం దొడ్డు రకాలను సాగు చేసేవారు. అయితే ఈ సీజన్‌లో పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. 65 శాతం సన్నాలు, 35 శాతం దొడ్డు రకాలను సాగుచేశారు. 


జిల్లాలో 65 శాతం సాగు..

జిల్లావ్యాప్తంగా 2 లక్షల 2 వేల ఎకరాల్లో మొత్తం వరి సాగును చేయగా, ఇందులో సన్నాలు లక్షా 25 వేల ఎకరాలు, దొడ్డు రకం 77 వేల ఎకరాల్లో సాగు చేశారు. బీపీటీ, సాంబమశూరి, తెలంగాణ సోనా, జైశ్రీరాం, హెచ్‌ఎంటి రకాలను సాగు చేశారు. దీంతో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలపై ఒత్తిడి తగ్గనున్నది. గడిచిన యాసంగి సీజన్‌లో 80 శాతానికి పైగా దొడ్డు రకం వరి సాగును చేపట్టారు.


ఈ సీజన్‌లో ధాన్యం విక్రయించుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. పెద్ద ఎత్తున పంట రావడంతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైస్‌మిల్లర్లు ధాన్యంలో కోతలు విధించి రైతులను నష్టపరిచారు. అందరు రైతులు ఒకే రకం పంటను సాగు చేస్తుండడంతో గిట్టుబాటు ధరలు దక్కవని, నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేస్తే పంటకు డిమాండ్‌ ఏర్పడి మంచి ధరలు వస్తాయని సీఎం కేసీఆర్‌ సూచించారు. వరిలో దొడ్డు రకాలను తగ్గించి సన్న రకాలను పండించాలని పిలుపునిచ్చారు. దీనికి స్పందించిన జిల్లా రైతులు గడిచిన ఏడాది ఖరీఫ్‌లో సన్న రకాలు 35 శాతం సాగు చేస్తే, ఇప్పుడు దానిని 65 శాతానికి పెంచారు. సాధారణంగా వర్షాకాలంలోనే ఎక్కువగా సన్నాలను సాగు చేస్తుంటారు. రబీలో తక్కువగా పండిస్తారు. రబీ ధాన్యం నూక అవుతుందనే కారణంగా సన్నాలను తగ్గిస్తారు. ఖరీఫ్‌లో సాగైన పంటనే తినేందుకు అనువుగా ఉంటుంది. ఈసారి రెట్టింపు సన్నాల సాగు పెరగడంతో బియ్యం కొనుగోలు చేసే వారికి ఇబ్బందులు ఉండవు. తక్కువ ధరలకే బియ్యం లభ్యం కానున్నాయి. 


పెరిగిన ధర..

కేంద్ర ప్రభుత్వం రైస్‌మిల్లర్ల నుంచి నేరుగా తీసుకునే లెవీ విధానాన్ని ఎత్తివేయడంతో వరి ధాన్యం కొనుగోళ్ల భారం రాష్ట్ర ప్రభుత్వం పైనే పడింది. ప్రతి ఏటా పెంచినట్లుగానే ఈ ఏడాది వరి ధాన్యం క్వింటాలుకు 53 రూపాయలు పెంచారు. దీంతో ఏ గ్రేడ్‌ ధాన్యం క్వింటాలుకు 1835 నుంచి 1888, బీగ్రేడ్‌ ధాన్యం 1815 నుంచి 1868 రూపాయలు పెరిగాయి. ఈ సీజన్‌లో దొడ్డు రకాలను తగ్గించడం వల్ల కొనుగోళ్ల లక్ష్యం 2 లక్షల టన్నులకు మించి ఉండదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ సన్న రకాలు బయటి మార్కెట్‌లో ధర లభించకపోతే ప్రభుత్వమే నేరుగా కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్నా భోజన పథకం, గురుకుల విద్యాలయాలు, ఇతర విద్యాలయాల్లో భోజనాల కోసం సన్న రకం బియ్యాన్నే ఉపయోగిస్తున్నారు. ఈ బియ్యాన్ని టెండర్ల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం సన్న రకం ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లయితే ఈ బియ్యాన్ని మర ఆడించి విద్యా సంస్థలకు సరఫరా చేసేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నారు. వరికి మద్దతు ధరలు కూడా పెరిగాయి. 

Updated Date - 2020-09-27T10:54:08+05:30 IST