ధాన్యం కొనుగోలుకు కసరత్తు

ABN , First Publish Date - 2020-11-01T06:36:55+05:30 IST

జిల్లాలో వరికోతలు మొదలు పెట్టారు. వరిధాన్యం కొనుగోలుకు అధికారులు కసరత్తు షురూ చేశారు. ఈనెల మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలనుకుంటున్నారు

ధాన్యం కొనుగోలుకు కసరత్తు

అమ్మిన రైతులకు 48 గంటల్లో చెల్లింపులు

కోతకు సిద్ధమవుతున్న వరి పంటలు

గత ఏడాది కంటే పెరిగిన సాగు విస్తీర్ణం

ఈనెల మొదటి వారంలో తెరుచుకోనున్న కొనుగోలు కేంద్రాలు


జిల్లాలో ధాన్యం కొనుగోలుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఈ వారంలో కొనుగోలు కేంద్రాల  ద్వారా ధాన్యం సేకరించనున్నారు. ఈ సారి  కొనుగోలు  కేంద్రాలను  అదనంగా ఏర్పాటు చేసి  రైతులకు ఇబ్బందులు కలగకుండా  చర్యలు చేపడుతున్నారు.  ధాన్యంసేకరణకు సరిపడా  గన్నీ బ్యాగులను  సిద్ధం చేస్తున్నారు.  రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమచేయనున్నారు. 


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : జిల్లాలో వరికోతలు మొదలు పెట్టారు. వరిధాన్యం కొనుగోలుకు అధికారులు కసరత్తు షురూ చేశారు. ఈనెల మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలనుకుంటున్నారు. వ్యవసాయశాఖ ఇచ్చిన పంటల వివరాలకు అనుగుణంగా ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గతేడాది కంటే ఈసారి జిల్లాలో వరిసాగు విస్తీర్ణం పెరిగింది. కానీ.. అతివృష్టి కారణంగా చేతికొచ్చిన పంట నేలపాలైంది. మిగిలిన పంటను సేకరించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.


1,57,558 మెట్రిక్‌ టన్నులు లక్ష్యం

గత ఏడాది 82,972 మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని అంచనాలు తయారు తయారు చేయగా ఈ సారి 1,57,558 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కేంద్రాలకు రావచ్చంటున్నారు. దానికి తగ్గట్టుగా 5లక్షల గన్నీ బ్యాగులు అవసరం కావడంతో వాటిని సిద్ధం చేసుకుంటున్నారు. 


కొనుగోలు కేంద్రాలివే..

జిల్లాలో ఈసారి 23 వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. గత ఏడాదిని పోల్చుకుని చూస్తే ఈసారి అదనంగా 11 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. పీఏసీఎస్‌ పరిధిలో 16కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా, డీసీఎంఎస్‌ పరిధిలో 2, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ పరిధిలో 2, మెప్మా పరిధిలో ఒకటి, ఏఎంసీ పరిధిలో 2 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. 


48 గంటల్లోనే చెల్లింపులు

వరిధాన్యం విక్రయించిన రైతులకు కేవలం 48 గంటల్లోనే ఆన్‌లైన్‌ ద్వారా వారి ఖాతాల్లో డబ్బును జమ చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. డీసీఎంఎస్‌, ఎఫ్‌ఎస్‌సీఎస్‌, మెప్మా ఏఎంసీ ద్వారా వరి ధాన్యం విక్రయించిన రైతులకు క్వింటాల్‌కు ఏ-గ్రేడ్‌కు రూ. 1,888 సాధారణ రకానికి రూ. 1,868 రైతుల ఖాతాల్లో ఆన్‌లైన్‌లో 48 గంటల్లో చెల్లింపులు చేయనున్నారు. 


పెరిగిన మద్ధతు ధర..

గతఏడాదితో పోలిస్తే ఈసారి వరికి మద్దతు ధర రూ. 53 పెరిగింది. గత ఏడాది గ్రేడ్‌-ఎ రకానికి రూ.1,835 చెల్లించగా ఈసారి రూ. 1,888 చెల్లించనున్నారు. అలాగే సాధారణ రకానికి గత ఏడాది రూ.1,815 చెల్లించగా ఈసారి రూ.1,868 చెల్లించనున్నారు.


పగబట్టిన ప్రకృతి..

ప్రభుత్వ నియంత్రిత సాగు పిలుపుతో ఈసారి జిల్లాలోని 82శాతం వరి సాగు పెరిగింది. గత ఏడాది ఖరీఫ్‌లో 35,784 ఎకరాల్లోళళలోలలో వరి పంటను సాగుచేశారు. ఈసారి 36వేల ఎకరాలు సాగుచేస్తారని అంచనా వేసుకున్నారు. కానీ, దానిని మించి 65,131 ఎకరాల విస్తీర్ణంలో వరి పంటను సాగు చేశారు. గత ఏడాదితో పోలిస్తే 82 శాతం సాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ.. ఇటీవల కురుసిన భారీ వర్షాలకు 422 గ్రామాల్లో 22,325 ఎకరాల విస్తీర్ణంలో వరిపంట పాడైంది. అతివృష్టితో రైతులు అతలా కుతలమయ్యారు. చేతికొచ్చిన పంటలను కళ్లముందే కోల్పోయారు. 


పంట 2019 సంవత్సరం 2020 సంవత్సరం వర్షానికి దెబ్బతిన్న పంట

(సాగు ఎకరాల్లో)            (సాగు ఎకరాల్లో) (ఎకరాల్లో)

వరి 35,784        65,131    22,325 

ధాన్యం సేకరణ లక్ష్యం : 1,57,558 మెట్రిక్‌ టన్నులు

అవసరం కానున్న గన్నీ బ్యాగులు : 5 లక్షలు

కొనుగోలు కేంద్రాలు : 23

కనీస మద్ధతు ధర : గ్రేడ్‌ ’ఏ’ రకానికి రూ. 1,888

సాధారణ రకానికి క్వింటాలుకు రూ. 1,868


నాణ్యత ప్రమాణాలు ఇలా..

ధాన్యాన్ని ఆరబెట్టి శుభ్రపర్చాలి

తేమ శాతం : 17కు మించి ఉండకూడదు

చెత్త, తాలు : 1.0 శాతం కంటే ఎక్కువ ఉండవద్దు

మట్టిపెళ్లలు, రాళ్లు శాతం : 1.0కంటే ఎక్కువ ఉండవద్దు

రంగు మారిన, మొలకెత్తిన, పురుగు పట్టడం : 5.0 శాతం వరకు

పూర్తిగా తయారు కాని, ముడుచుకున్న ధాన్యం : 3.0 శాతం వరకు

తక్కువ రకం మిశ్రమం : 6.0 శాతం వరకు

మొలకెత్తిన, పురుగుతిన్న ధాన్యం : 4 శాతం మించకూడదు.

Updated Date - 2020-11-01T06:36:55+05:30 IST