కన్నీటి సాగు!

ABN , First Publish Date - 2022-01-18T09:19:49+05:30 IST

వ్యవసాయాన్ని పండుగలా మార్చామని ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా చెబుతోంది!

కన్నీటి సాగు!

  • యవుసం పండుగలా మారేదెన్నడు? 
  • రైతు ఆదాయం రెట్టింపయ్యేదెప్పుడు?
  • ఏడాది కాలంగా కలిసిరాని సాగు
  • వర్షాలతో మొన్న వరి.. నిన్న పత్తి పంటలకు తీవ్రనష్టం
  • తామర తెగులుతో 50% మేర తుడిచిపెట్టుకుపోయిన మిర్చి
  • అకాల వర్షాలు, వడగళ్లతో మరో 30 శాతం మట్టిపాలు
  • వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మంఉమ్మడి జిల్లాల్లో అపార నష్టం
  • 7 లక్షల టన్నుల దిగుబడి అంచనా
  • వచ్చేది 1.50 లక్షల టన్నులేవడగళ్ల దెబ్బకు నేలకొరిగిన 
  • మొక్కజొన్న.. పూత రాలిన మామిడి


హైదరాబాద్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయాన్ని పండుగలా మార్చామని ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా చెబుతోంది! 2022 చివరి నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని అటు కేంద్ర సర్కారూ అంటోంది. అన్నదాతల జీవితాలను మెరుగుపరిచే క్రమంలో గొప్ప మార్పునకు సంకేతంగా ఈ ప్రకటనలు ఆశలు రేకెత్తించినా క్షేత్రస్థాయిలో పరిస్థితులేమీ మారడం లేదు. ఉల్టా.. సాధారణ దిగుబడి కూడా రాక రైతులు తీవ్ర నష్టాలపాలవుతున్నారు. పంటలకు పెట్టిన పెట్టుబడి కూడా మట్టిపాలైందని తలపట్టుకుంటున్నారు. ఏదో ఒక పంట అని కాదు.. మొన్న వరి, నిన్న పత్తి, ఇప్పుడు మిర్చి, మొక్కజొన్న తదితర పంటలన్నీ రైతులను నట్టేట ముంచాయి. ప్రధానంగా ప్రకృతి విపత్తులు, చీడపీడలు రైతులకు పెను శాపంగా మారాయి. వానాకాలంలో భారీ వర్షాలకు చాలా చోట్ల వరి పంట నీట మునిగిపోయింది. కోసిన పైరు వరదపాలైంది. కల్లం చేసి, కుప్పలుగా పోసిన వడ్లు తడిసి మొలకలెత్తాయి. అన్ని కష్టనష్టాలకోర్చి ఽఽధాన్యాన్ని ఆరబోసి, తూర్పారబట్టి కొనుగోలు కేంద్రాలకు తరలిస్తే కాంటాల కోసం వారాల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది! ఈ గోస మిగతా పంటల రైతులకూ పట్టిపీడిస్తోంది! ఫలితంగా రైతుల్లో కొందరు ఎటూపాలుపోక ఆత్మహత్యలకు పాల్పడుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది! 


రైతు కంట్లో కారం! 

ప్రధానంగా మిర్చి పంట రైతు కంట్లో కారం కొట్టింది! తైవాన్‌ నుంచి వచ్చి వాలిన తామర పురుగు.. పూత, పిందె, కాయ దశల్లో ఉన్న పంటను సర్వనాశనం చేసిం ది! ఈ పురుగు దెబ్బకు ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌ జిల్లా ల రైతులు దాదాపు 45 శాతం మిర్చి చేలను దున్నేశారు. ఏ పురుగుల మందుకూ లొంగని ఈ మాయదారి చీడ రాష్ట్ర వ్యాప్తంగా సాగైన మిర్చిలో 50శాతం పంటను తుడిచిపెట్టేసింది. తామరకు తోడు వడగళ్లతో కూడిన అకాల వర్షాలు మరింతగా దెబ్బతీశాయి. తాజాగా వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో కురిసిన వర్షాలతో మరో 30శాతం మేర దిగుబడి పడిపోయినట్లు ఉద్యాన శాఖ అధికారులు నిర్వహించిన సర్వేలో వెల్లడైం ది.  మహబూబాబాద్‌ జిల్లాలో 25 వేల ఎకరాలు, వరంగల్‌లో 15 వేలు, హనుమకొండ జిల్లాలో 5 వేల ఎకరా ల్లో మిర్చి పంట పూర్తిగా దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. ఖమ్మం జిల్లాలో ఏరిన తర్వాత ఆరబోసిన వేల టన్నుల మిర్చి వాన నీళ్లల్లో తడిసిపోయింది. దీంతో మిర్చి నాణ్య త దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.


వడగళ్లు పడిన ప్రాంతాల్లో 100 శాతం మిర్చి తోటలు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. మిర్చి సాగుకు ఎకరానికి రూ. 1.10 లక్షల నుంచి రూ. 1.25 లక్షల దాకా రైతులు పెట్టుబడి పెట్టారు. సాధారణంగా ఎకరానికి 20 క్వింటాళ్ల నుంచి 25 క్వింటాళ్ల మిర్చి దిగుబడి వస్తుంది. వడగళ్లు పడని ప్రాంతాల్లో ఎకరానికి దిగుబడి 5 క్వింటాళ్లకు మించి వచ్చే పరిస్థితిలేదని చెబుతున్నారు. మొత్తంగా మిర్చి సాగు విస్తీర్ణం పెరిగిన నేపథ్యంలో ఈ ఏడాది 7 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేయగా 1.5 లక్షల టన్నులకు మించి దిగుబడి వచ్చే పరిస్థితి లేదని రాష్ట్ర ఉద్యానశాఖ కమిషనర్‌ వెంకట్రాంరెడ్డి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. 


నేలకొరిగిన మొక్కజొన్న

రాష్ట్ర ప్రభుత్వం నిషేదం విధించటంతో రైతులు మొ క్కజొన్న పంటను భయంభయంగా సాగుచేస్తున్నారు. యాసంగిలో సాధారణ విస్తీర్ణం 4.50 లక్షల ఎకరాలుం టే... ఇప్పటివరకు 2.11 లక్షల ఎకరాల్లోనే సాగైంది. కరీంనగర్‌ జిల్లాలో 11 వేల ఎకరాలు, పెద్దపల్లిలో 2,500 ఎకరాలు, జగిత్యాలలో 6,500 ఎకరాలు, వరంగల్‌లో 14 వేల ఎకరాలు, హనుమకొండలో 10 వేల ఎకరాలు, మహబూబాబాద్‌ జిల్లాలో 12 వేల ఎకరాలు, ఖమ్మంలో 46 వేల ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెంలో 10 వేల ఎకరాల్లో రైతు లు మొక్కజొన్న సాగుచేశారు. ఈ జిల్లాల్లోనే వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. పూర్తిగా నేలమట్టమైన మొక్క జొన్న కోలుకోవటం కష్టమేనని రైతులు ఆందోళన చెందుతున్నారు.


 పూత రాలుతున్న మామిడి

మామిడి తోటలు రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. ప్రస్తుత వాతావరణం మామిడి తో టలకు ఏమాత్రం అనుకూలించటం లేదు. అకాల వర్షా లు, వడగళ్ల వానలు, హెచ్చుతగ్గుల ఉష్ణోగ్రతలు... మా మిడి పూత, కాతకు ప్రతిబంధకంగా తయారవుతున్నా యి. పొగమంచు ప్రభావంతో మామిడి పూతతో నలుపురంగు మచ్చలు ఏర్పడుతున్నాయి. కొన్నిచోట్ల చెట్లకు పూత రావటం లేదు. పూత వచ్చినచోట్ల తేనె మంచు పురుగుల ఉద్ధృతి ఎక్కువగా ఉంటోంది. ఈ పురుగులు పువ్వుల నుంచి, ఆకుల నుంచి రసాన్ని పీలుస్తున్నాయి. మరికొన్నిచోట్ల వాతావరణ మార్పుల కారణంగా పూత రాలిపోతోంది. రైతులు మామిడి పూతను రక్షించుకునేందుకు ఉద్యానశాస్త్రవేత్తల సహకారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. వనపర్తి, నాగర్‌కర్నూల్‌, జగిత్యాల తదితర జిల్లాల్లో నష్టం ఎక్కువగా కనిపిస్తోంది.


పత్తి దిగుబడి అంతంత మాత్రమే

పత్తి పంట వరుసగా రెండేళ్లు దెబ్బ కొట్టింది. కుండపోత వర్షాలకు పత్తి పంట నాశనం అయ్యింది. ఎకరానికి 10 నుంచి 15 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని ఆశించిన రైతులకు... 3- 4 క్వింటాళ్లు కూడా రావటంలేదు. ఈఏడాది 46.43 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగుచేయగా... నిరుడు 60.18 లక్షల ఎకరాల్లో రైతులు పత్తిసాగుచేశారు. పెట్టుబడి పెట్టిన రైతులకు దిగుబడి రాకపోవటంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆత్మహత్యల్లో 80 శాతానికిపైగా ఆత్మహత్యలు పత్తి రైతులవేనని తేలింది. ఇదిలాఉండగా ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతు లను ఆదుకోవటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవటంలేదు. పంటల బీమా పథకాలేవీ రాష్ట్రంలో అమలులో లేకపోవటంతో రైతులకు నష్టపరిహారం కూడా అందే పరిస్థితిలేదు. మిర్చి పంటకు రూ. 50 వేలు, ఇతర పంటలకు రూ. 25 వేల పరిహారం ఇవ్వాలని ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి. 

Updated Date - 2022-01-18T09:19:49+05:30 IST