సాఫీగా ‘సాగు’

ABN , First Publish Date - 2021-10-18T03:57:57+05:30 IST

ఈ ఏడాది కురిసిన వర్షాలు ఖరీఫ్‌తోపాటు వచ్చే రబీలో కూడా రైతుకు భరోసాగా నిలువనున్నాయి. నీటి వనరులు సమృద్ధిగా ఉన్నాయి. తుఫాన్ల ప్రభావంతో సెప్టెంబరు, అక్టోబరునెలల్లో వర్షాలు విస్తారంగా కురిశాయి. నదులు, వాగులు పొంగి ప్రవహించాయి. జలాశయాలు, చెరువులు జల కళను సంతరించుకున్నాయి.

సాఫీగా ‘సాగు’
పాచిపెంట మండలం పెద్దగెడ్డ జలాశయంలో పుష్కలంగా నీరు

ఆశాజనకంగా ఖరీఫ్‌ దిగుబడి

వచ్చే రబీకీ అనుకూలం

వ్యవసాయ శాఖ సమగ్ర ప్రణాళిక అవసరం

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

ఈ ఏడాది కురిసిన వర్షాలు ఖరీఫ్‌తోపాటు వచ్చే రబీలో కూడా రైతుకు భరోసాగా నిలువనున్నాయి. నీటి వనరులు సమృద్ధిగా ఉన్నాయి. తుఫాన్ల ప్రభావంతో సెప్టెంబరు, అక్టోబరునెలల్లో వర్షాలు విస్తారంగా కురిశాయి. నదులు, వాగులు పొంగి ప్రవహించాయి. జలాశయాలు, చెరువులు జల కళను సంతరించుకున్నాయి. ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌ కొనసాగుతోంది. నవంబరులో వరి చేలు కోతకు రానున్నాయి. ఆ తర్వాత రబీ పంటకాలం ప్రారంభం అవుతుంది. కోత పూర్తయిన వారం నుంచి పెసలు, మినుముల విత్తనాలు జల్లుకోవాల్సి ఉంటుంది. అంటే పంట కోతకు వచ్చిన వారం ముందుగానే రబీ సాగుకు సంబంధించిన మినుములు, పెసలు, కొమ్ము సెనగలు, కట్టెలు ఇలా వివిధ రకాల ఆరుతడి పంటల కోసం సన్నద్ధం కావాల్సి ఉంటుంది. 

రబీలో మొక్కజొన్న, నువ్వులు, పొద్దుతిరుగుడు, మినుములు, పెసలు, కొమ్ముసెనగలు, వేరుశనగ ఇలా ఆరుతడి పంటలు వేసుకునే అవకాశం ఉంది. ఈ పంటలకు పెద్దగా పెట్టుబడులు ఉండవు. దీనిని దృష్టిలో పెట్టుకునే అనేక మంది రైతులు అపరాలు వేస్తున్నారు. రైతులు ఇదివరకు సొంతంగా విత్తనాలు సిద్ధం చేసుకునేవారు. నేడు ఆ పరిస్థితి లేదు. వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా మేలు రకమైన విత్తనాలు అందిస్తున్న కారణంగా రైతులంతా వారిచ్చే విత్తనాలపైనే ఆధారపడుతున్నారు. ఈ పరిస్థితిలో వ్యవసాయ శాఖ ఈ ఏడాది రబీ పంటలకు ముందుగా సన్నద్ధం అయితే రైతులకు ఎంతో మేలు. సకాలంలో విత్తనాలు అందించేలా ఆ శాఖ ప్రణాళిక రూపొందించుకోవాలి. రైతు భరోసా కేంద్రాల్లో పెసలు, మినుములు, మొక్కజొన్న తదితర విత్తనాలను సమృద్ధిగా సిద్ధం చేయాలి. రైతులు డిమాండ్‌ చేసే వరకు కాకుండా ముందుగానే రబీలో వేయదగ్గ ఆరుతడి పంటల విత్తనాలను అందుబాటులోకి తేవాలి. 

నీటి పారుదల శాఖ సన్నద్ధత

ఈ ఏడాది జలాశయాల సమీపంలోని క్షేత్రాల్లో రెండో పంటగా వరి అధికంగా పండించే అవకాశం ఉంది. ఏటా జైకా నిధులతో కాల్వల ఆధునికీకరణ పనులు చేస్తామని ప్రకటిస్తూ రబీలో కాల్వల ద్వారా సాగునీరు అందించడం లేదు. ఈసారి అలా కాకుండా వరి చేలకు, ఆరు తడి పంటలకు రబీలో సాగునీటిని అందించేలా నీటి పారుదల శాఖ సిద్ధం కావాల్సి ఉంది. తోటపల్లి, వెంగళరాయసాగర్‌, పెద్దగెడ్డ, తాటిపూడి జలాశయాల పరిధిలో ఈ ఏడాది రబీలో 60వేల ఎకరాల్లో వరి వేసేందుకు అవకాశం ఉంది. జిల్లాలో మరో లక్ష ఎకరాల్లో ఆరుతడి పంటలు వేసుకోవచ్చు. ఇవి కాకుండా చెరువుల ఆధారంగా లేదా వర్షాధారంతో ఆరుతడి పంటలు సాగు చేసే అవకాశం ఉంది. తోటపల్లి, ఒట్టిగెడ్డ, జంఝావతి, వెంగళరాయసాగర్‌, పెద్దగెడ్డ, ఆండ్ర, తాటిపూడి, కొత్తవలస, పెదంకలాం తదితర సాగునీటి వనరుల ద్వారా సాగునీరు విడిచి పెడుతున్నదీ.. లేనిదీ నీటి పారుదల శాఖ స్పష్టం చేయాల్సి ఉంది. ఏ ప్రాజెక్టు పరిధిలో ఎంత విస్తీర్ణంలో ఆరుతడి పంటలకు సాగునీరు అందిస్తున్నదీ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. కొన్ని ప్రాజెక్టుల పరిధిలో రబీలో అధికారికంగా నీటిని విడిచి పెట్టేందుకు అవకాశం లేకపోయినా అనధికారికంగా సాగునీరు అందిస్తున్నారు. రైతులకు అనధికార సమాచారమైనా చేరవేసేలా స్థానిక ప్రజాప్రతినిధులు కృషి చేయాల్సి ఉంది. సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో వరి, మొక్కజొన్న, నువ్వులు, వేరుశనగ పంటలు వేస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ, నీటి పారుదల శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు సమావేశమై విత్తనాలు ఏ స్థాయిలో సిద్ధం చేయాలి. ఎంత విస్తీర్ణానికి నీరు అందించాలి అన్నదానిపై సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 



Updated Date - 2021-10-18T03:57:57+05:30 IST