అలాంటి వాళ్లను బహిరంగంగా ఉరి తీయాలి: సిద్ధూ

ABN , First Publish Date - 2021-12-20T22:37:17+05:30 IST

అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం, కపూర్తలాలోని గురుద్వారాను అపవిత్రం చేసే ఘటనలు ఆదివారంనాడు చోటు చేసుకోవడాన్ని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ..

అలాంటి వాళ్లను బహిరంగంగా ఉరి తీయాలి: సిద్ధూ

ఛండీగఢ్: అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం, కపూర్తలాలోని గురుద్వారాను అపవిత్రం చేసే ఘటనలు ఆదివారంనాడు చోటు చేసుకోవడాన్ని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తీవ్రంగా ఖండించారు. మందిరాలు, పవిత్ర గ్రంథాలను అపవిత్రం చేసే ఘటనల్లో ప్రమేయం ఉన్న వారికి గరిష్ట శిక్ష విధించాలని అన్నారు. మలెర్‌కోట్ల జిల్లాలో సోమవారంనాడు జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ..''ఐక్యతావాణిని మనమంతా వినిపించాల్సిన అవసరం ఉంది. మతోన్మాద శక్తులు మన ఐక్యతకు విఘాతం కలిగిస్తున్నాయి. ఒక మతాన్ని ఎక్కువగాను, మరో మతాన్ని తక్కువ చేసి మాట్లాడటాన్ని పంజాబ్ ప్రజలు ఎప్పుడూ వ్యతిరేకిస్తారు. పంజాబ్‌లో ప్రజలందరూ సమానమే. ఖురాన్ షరీఫ్ కావచ్చు, భగవద్గీత కావచ్చు, గురు గ్రంథ్ సాహిబ్ కావచ్చు. దుండగులను బహిరంగంగా ఉరితీయాలి. ఇలాంటి సంఘటనలు ప్రజల మనోభావాలను గాయపరుస్తాయి. వాటిని దెబ్బతీసే వాళ్లకు రాజ్యాంగానికి లోబడి గరిష్ట శిక్ష విధించాలి'' అని సిద్ధూ పేర్కొన్నారు.


''పొరపాట్లు ఎవరైనా చేస్తారు. కానీ ఇది పొరపాటు కాదు. సమాజాన్ని బలహీన పరచి, సమాజ వినాశనానికి పాల్పడే కుట్ర ఇది'' అని సిద్ధూ తాజా ఘటనలను అభివర్ణించారు. పంజాబ్‌లో శాంతికి భంగం కలిగించే కుట్రలు జరుగుతున్నాయని, ఉద్దేశపూర్వకంగా దుష్టచర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. మనోభావాలను దెబ్బతీసే ఇలాంటి చర్యలకు కఠిన శిక్షలతో అడ్డుకట్ట వేయాలని పేర్కొన్నారు. గురునానక్ చెప్పిన ఏకత్వం, విశ్వమానవ సౌభ్రాతృత్వం అనే పటిష్ట పునాదులపై పంజాబ్ నిర్మాణం జరిగిందని, పంజాబ్ కమ్యూనిటీ సామాజిక కట్టుబాట్లను ఎలాంటి శక్తులు కూడా ధ్వంసం చేయలేవని స్పష్టం చేశారు. అమృత్‌సర్, కపూర్తలాలో అపవిత్ర చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులను మూకదాడుల్లో కొట్టి చంపిన నేపథ్యంలో సిద్ధూ తాజా వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2021-12-20T22:37:17+05:30 IST