స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాను పరిశీలించండి : కలకత్తా హైకోర్టు

ABN , First Publish Date - 2022-01-14T18:07:23+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో స్థానిక సంస్థల

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాను పరిశీలించండి : కలకత్తా హైకోర్టు

కోల్‌కతా : కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను నాలుగు నుంచి ఆరు వారాలపాటు వాయిదా వేసే అంశాన్ని పరిశీలించాలని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కలకత్తా హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. దీనిపై 48 గంటల్లోగా స్పందించాలని తెలిపింది. 


పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్, బిధాన్ నగర్, చందన్ నగర్, దుర్గాపూర్, హౌరా, సిలిగురి నగర పాలక సంస్థలకు ఎన్నికలు జరగవలసి ఉంది. వీటిలో అసన్‌సోల్, బిధాన్ నగర్, సిలిగురి, చందన్ నగర్ నగర పాలక సంస్థలకు షెడ్యూలు ప్రకారం జనవరి 22న ఎన్నికలు జరుగుతాయని, ఓట్ల లెక్కింపు జనవరి 25న జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. 


దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయని, పశ్చిమ బెంగాల్‌లో కొద్ది రోజుల నుంచి ఈ కేసుల సంఖ్య పెరుగుతోందని, ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించవచ్చునా? అని ప్రశ్నిస్తూ, ఈ ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ బిమల్ భట్టాచార్య దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. 


ఇదిలావుండగా, ముఖ్యమంత్రి మమత బెనర్జీ గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన వర్చువల్ సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిని ఎదుర్కొనేందుకు యంత్రాంగం సర్వసన్నద్దంగా ఉందన్నారు. 


Updated Date - 2022-01-14T18:07:23+05:30 IST