ఆర్‌టీపీసీఆర్‌లో సి.టి. విలువెంత?

ABN , First Publish Date - 2022-01-20T15:56:55+05:30 IST

కొవిడ్‌ నిర్ధారణకు ర్యాపిడ్‌ లేదా ఆర్టీపీసీఆర్‌ పరీక్షలను ప్రామాణికంగా తీసుకుంటున్నారు.

ఆర్‌టీపీసీఆర్‌లో  సి.టి. విలువెంత?

వైరస్‌ సైకిల్స్‌పై అపోహలు

కొవిడ్‌ చికిత్సలో పాజిటివ్‌ లేదా నెగెటివ్‌ కీలకం  

సి.టి. విలువ ప్రామాణికం నామమాత్రమే అంటున్న వైద్యులు

 

హైదరాబాద్‌ సిటీ, జనవరి 18, (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ నిర్ధారణకు ర్యాపిడ్‌ లేదా ఆర్టీపీసీఆర్‌ పరీక్షలను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలలో సి.టి. (సైకిల్‌ థ్రెషోల్డ్‌) విలువ ఇవ్వరు. కానీ, ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షలలో సి.టి. విలువ అందించడం సర్వసాధారణం. అయితే, ఈ విలువను అనుసరించి సోషల్‌ మీడియాలో కొందరు ఇన్‌ఫెక్షన్‌ ఏ స్థాయిలో ఉందోనంటూ భయాలను కల్పిస్తున్నారని డాక్టర్లు అంటున్నారు.


సి.టి. పాత్ర?

సెల్ఫ్‌ డయాగ్నోస్టిక్‌ కిట్లు, ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు ఉన్నా కొవిడ్‌ నిర్ధారణలో అత్యంత ప్రామాణికమైన పరీక్షగా ఇప్పుడు ఆర్‌టీపీసీఆర్‌ (ర్యాపిడ్‌ పాలిమెరాజ్‌ చైన్‌ రియాక్షన్‌)టె్‌స్టను తీసుకుంటున్నారు. ఈ టెస్ట్‌లో చాలా సైకిల్స్‌ ఉంటాయి. సి.టి. విలువ అనేది వైర్‌సను కనుగొనే సైకిల్స్‌ను సూచిస్తుంది. 40కన్నా తక్కువ సైకిల్స్‌ ఉంటేనే పాజిటివ్‌ అని మొదటివేవ్‌లో భావించేవారు. సాధారణంగా 35 సైకిల్స్‌ లోపు ఉంటేనే పాజిటివ్‌ లేదంటే నెగెటివ్‌గా ల్యాబ్‌లు నిర్ధారిస్తున్నాయిప్పడు. ఆ తర్వాత 34లోపు ఉంటేనే పాజిటివ్‌గా పేర్కొనే వారమని, అదే ఇప్పటికీ కొనసాగిస్తున్నామని కూకట్‌పల్లిలో ఓ ల్యాబ్‌ టెక్నీషియన్‌ చెబుతున్నారు. సాధారణంగా సి.టి. విలువతో వైరల్‌ లోడ్‌ ఏ విధంగా ఉంది. అతని ద్వారా ఎంత మందికి వ్యాప్తి చెందే అవకాశం ఉందనేది మాత్రమే తెలుస్తుంది. దీని విలువ తక్కువగా ఉంటే ఆ వ్యక్తులతో ప్రమాదకరమని భావించాల్సి ఉంటుంది. విలువ 24కు మించితే వారి నుంచి ఇన్‌ఫెక్షన్‌ సోకే అవకాశాలు తక్కువే ఉన్నాయని ఇటీవల కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నప్పటికీ డాక్టర్‌ షాహిద్‌ జమీల్‌ లాంటి వైరాలజి్‌స్టలు అవి ప్రజలను తప్పుదోవ పట్టించే వార్తలే తప్ప వాస్తవం కాదని వెల్లడిస్తున్నారు.


సి.టి. విలువకు విలువ లేదు

సి.టి. విలువపై ఆధారపడి రోగి స్థితిని అంచనా వేయరాదని ఐసీఎంఆర్‌ నివేదికలు వెల్లడిస్తున్నాయి. చికిత్సలో ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని కూడా వెల్లడించలేదు. కొవిడ్‌ కేసులలో తీవ్రతను తెలుసుకోవడంలో దీని విలువలకు అసలు పాత్ర లేదని ఆస్టర్‌ ప్రైమ్‌ ఆస్పత్రిలో సీనియర్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ కె.ఉషారాణి తెలిపారు. ప్రమాద కారకాలు, వ్యాధుల తీవ్రతపై ఆధారపడి ఈ చికిత్స ఉంటుందన్నారు. తమ వద్దకు వచ్చే రోగులలో కొవిడ్‌ పాజిటివ్‌ ఉందా లేదా అన్నదే ర్యాపిడ్‌ లేదా ఆర్‌టీ పీసీఆర్‌ ద్వారా చూస్తామని, మార్గదర్శకాలను పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులు తప్పక ఆచరించాల్సిందేనని చెబుతున్నారు.


చికిత్సలో సి.టి. పాత్ర పెద్దగా ఉండదు 

వ్యాధి తీవ్రతకు, సి.టి.విలువలకు నడుమ సంబం ధం వివరించే స్పష్టమైన అధ్యయనాలేవీ ఇప్పటికీ అందుబాటులో లేవు. ఈ విలువలనేవి గొంతులో ఉన్న వైరల్‌ లోడ్‌ తెలుపుతుంది కానీ, ఊపిరితిత్తులలో తీవ్రతను మాత్రం తెలుపదు. నిజానికి చికిత్స సమయంలో ఈ ఆర్‌టీపీసీఆర్‌ సి.టి. విలువకు పెద్దపాత్ర ఏముండదు. దీని విలువతో వ్యాధి తీవ్రతకు సంబంధంలేదు కానీ, సహజంగా ఈ వాల్యూ్‌సను కూడా చూస్తారంతే.

- డాక్టర్‌ సంజయ్‌ లచంశెట్టి, సీనియర్‌ కన్సల్టెంట్‌ ఫిజీషియన్‌, అపోలో స్పెక్ట్రా, హైదరాబాద్‌


పరిగణనలోకి తీసుకోకూడదు

రోగి రికవరీ తరువాత కూడా 30కు పైగా సి.టి. విలువలు ఉంటే సాధారణమనే చెబుతుంటాం. నిజానికి ఇవి అనారోగ్య తీవ్రతకు సూచికలు కాదు. ఇది కేవలం వైరల్‌ లోడ్‌కు మాత్రమే సూచిక. సాధారణంగా ఈ ఇన్‌ఫెక్షన్‌ తొలి దశలో 10-20 నడుమ ఉంటుంది. 7 నుంచి14 రోజులలోపు అది 30కి తగ్గుతుంది. ఒమైక్రాన్‌లో ఈ తగ్గుదల చాలా వేగంగా ఉంది. అందువల్ల దీని విలువలను చికిత్స కోసం పరిగణనలోకి తీసుకోకూడదు. అత్యధిక వైరల్‌ లోడ్‌, క్లినికల్‌గా రోగి పరిస్థితి బాగోలేకపోవడం అనుసరించి చికిత్స చేస్తారు.

- శ్రీరామ్‌ నటరాజన్‌, సీఈఓ అండ్‌ డైరెక్టర్‌, మొల్బియో డయాగ్నస్టిక్స్‌

Updated Date - 2022-01-20T15:56:55+05:30 IST