ఉత్కంఠ మ్యాచ్‌లో చెన్నై గెలుపు

ABN , First Publish Date - 2021-04-22T05:20:07+05:30 IST

నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచులో చివరకు విజయం చెన్నైనే వరించింది. చివరి వరకూ పోరాడిన కోల్‌కతా విజయానికి 18 పరుగుల దూరంలో కుప్పకూలింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి డూ ప్లెసిస్(95), ఋతురాజ్ గైక్వాడ్(64) అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు.

ఉత్కంఠ మ్యాచ్‌లో చెన్నై గెలుపు

ముంబై: నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచులో చివరకు విజయం చెన్నైనే వరించింది. ధోనీ ప్లానింగ్ ముందు కోల్‌కతా బ్యాట్స్‌మెన్ల విజృంభణ మూగబోయింది. చివరి వరకూ పోరాడిన కోల్‌కతా విజయానికి 18 పరుగుల దూరంలో కుప్పకూలింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి డూ ప్లెసిస్(95), ఋతురాజ్ గైక్వాడ్(64) అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ఆ తర్వాత మొయీన్ అలీ(12 బంతుల్లో 25), ధోనీ (8 బంతుల్లో 17), రవీంద్ర జడేజా (1 బంతిలో 6) పరుగులు చేయడంతో చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 220 పరుగుల భారీ స్కోరు సాధించింది. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ తలో వికెట్ తీసుకున్నారు.


భారీ లక్ష్య ఛేదనలో కోల్‌కతాకు పేలవ ఆరంభం లభించింది. పవర్ ప్లే కూడా ముగియక ముందే 31 పరుగులకే ఆ జట్టు 5 వికెట్లు కోల్పోయింది. వీటిలో యువ పేసర్ దీపక్ చాహర్ నాలుగు వికెట్లు తీశాడు. దీంతో చెన్నై గెలుపు నల్లేరు మీద నడకే అనిపించింది. అయితే సీనియర్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ (24 బంతుల్లో 40)తోపాటు చాలా రోజుల తర్వాత ఆండ్రీ రస్సెల్ (22 బంతుల్లో 54), ప్యాట్ కమిన్స్ (34 బంతుల్లో 66) బౌండరీలతో విరుచుకుపడటంతో మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. అయితే కమిన్స్‌కు సహకారం అందించడానికి ఎవరూ లేకపోవడంతో మ్యాచ్ కోల్‌కతా చేయి జారింది. చివర్లో వచ్చిన టెయిలెండర్లు కమలేష్ నాగర్‌కోటి(0) తప్ప మిగతా ఇద్దరు వరుణ్ చక్రవర్తి(0) ప్రసిద్ధ్ కృష్ణ(0) రన్ అవుట్ అయ్యారు. దీంతో కోల్‌కతా జట్టు 19.1 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌట్ అయింది. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ 4, శామ్ కర్రాన్ 1, లుంగి ఎన్గిడి 3 వికెట్లు తీశారు. చెన్నై భారీ స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించిన డూ ప్లెసిస్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.


ధోనీ మైండ్‌గేమ్..

చివరి ఓవర్లో 20 పరుగులు చేయాలి. కమిన్స్ బాదేస్తున్నాడు. బంతి వేస్తే చాలు స్టాండ్స్‌లోకి పంపాలనే కసితో ఉన్నాడు. అతన్ని ఆపడం కష్టంగా ఉంది. ఏం చేయాలి? వెంటనే నాన్ స్ట్రయికర్ క్రీజులో ఉన్న వారిపై పడింది ధోనీ కన్ను. అంతే వారిపై ఫోకస్ పెట్టి పావులు కదిపాడు. ఈ క్రమంలోనే కమిన్స్‌ను స్ట్రైకింగ్‌లోకి తీసుకురావడానికి ప్రయత్నించి వీళ్లిద్దరూ వికెట్లు కోల్పోయారు. ఫలితంగా చెన్నై జట్టును విజయం వరించింది. ఇదంతా చూసిన వాళ్లు ధోనీ ప్లానింగ్ అదిరిపోయిందని అంటున్నారు. ఈ మ్యాచుతో ధోనీ మరోసారి తాను ఎందుకు బెస్ట్ కెప్టెనో మరోసారి నిరూపించున్నాడని పొగడ్తలు వినిపిస్తున్నాయి. అంత టెన్షన్‌లో కూడా కూల్‌గా ప్లాన్ అమలు చేసిన ధోనీ అందుకే గ్రేట్ అంటూ సోషల్ మీడియా మొత్తం ప్రశంసల వర్షం కురిపిస్తోంది.

Updated Date - 2021-04-22T05:20:07+05:30 IST