‘కరోనా సెకండ్ వేవ్ ముప్పు గురించి మార్చిలోనే చెప్పాం.. ప్రధాని మోదీకి తెలియదంటే మేం నమ్మం..’

ABN , First Publish Date - 2021-05-07T07:42:20+05:30 IST

కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే కరోనా మహమ్మారి వేల మందిని, లక్షల మందిని బలిగొనే ప్రమాదం ఉందని దేశంలోని అత్యున్నతస్థాయి శాస్త్రవేత్తలు ముందే.. అంటే రెండు నెలల క్రితమే హెచ్చరించారు! వారి ఆందోళనపై ప్రధాని మోదీకి కూడా సమాచారం అందింది...

‘కరోనా సెకండ్ వేవ్ ముప్పు గురించి మార్చిలోనే చెప్పాం.. ప్రధాని మోదీకి తెలియదంటే మేం నమ్మం..’

కరోనా కేసుల విస్ఫోటమే

మరణాలూ భారీగా పెరిగిపోయే ప్రమాదం

వేలు, లక్షల మందిని మహమ్మారి బలి తీసుకునే అవకాశం

భయంకరంగా సెకండ్‌ వేవ్‌ ముప్పు

కొత్త వేరియంట్లే ఇందుకు కారణం

మార్చిలోనే ప్రభుత్వానికి నివేదికిచ్చాం

మా హెచ్చరికలను పట్టించుకోలేదు

ప్రధానికి తెలియదంటే నమ్మలేము 

ఐనా ఎన్నికలు, కుంభమేళా నిర్వహణ 

శాస్త్రవేత్తలు హెచ్చరించాక కూడా బీజేపీ నేతల నిర్లక్ష్యవ్యాఖ్యలు

కరణ్‌ థాపర్‌కు సీసీఎంబీ మాజీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా ఇంటర్వ్యూ


కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే కరోనా మహమ్మారి వేల మందిని, లక్షల మందిని బలిగొనే ప్రమాదం ఉందని దేశంలోని అత్యున్నతస్థాయి శాస్త్రవేత్తలు ముందే.. అంటే రెండు నెలల క్రితమే హెచ్చరించారు! వారి ఆందోళనపై ప్రధాని మోదీకి కూడా సమాచారం అందింది. అయినప్పటికీ.. శాస్త్రవేత్తల ఆందోళనను, సూచనలను ప్రభుత్వ పెద్దలు పూర్తిగా పెడచెవిన పెట్టారు. నిర్లక్ష్యంగా ఎన్నికల ర్యాలీలు, సభలు నిర్వహించారు. కుంభమేళా నిర్వహణకు అనుమతిచ్చారు. సీనియర్‌ శాస్త్రవేత్త, నిన్నమొన్నటి దాకా సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులార్‌ బయాలజీ (సీసీఎంబీ-హైదరాబాద్‌) డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా ‘ద వైర్‌’ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూతో ఇది స్పష్టమైంది. మహమ్మారికి అడ్డుకట్ట వేయాలంటే.. మరిన్ని కఠిన చర్యలు.. భారీ లాక్‌డౌన్‌లాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రాకేశ్‌ మిశ్రా తేల్చిచెప్పారు.



న్యూఢిల్లీ, మే 6: ‘‘సద్దుమణిగిందనుకున్న కరోనా మహమ్మారి.. రూపు మార్చుకుని కొత్త వేరియంట్ల రూపంలో విరుచుకుపడే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది.. తస్మాత్‌ జాగ్రత్త’’ అంటూ మార్చి మొదటివారంలోనే వైద్యనిపుణులు కేంద్రాన్ని హెచ్చరించారు! కొత్త వేరియంట్ల గురించి అప్పటికి ఏమీ తెలియదు కాబట్టి.. సెకండ్‌ వేవ్‌ ముప్పు భయంకరంగా ఉండబోతోందని, ప్రమాదం దిశగా వెళ్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. కానీ.. ఆ సూచనలను.. ఆందోళనలను.. కేంద్రప్రభుత్వం పూర్తిస్థాయిలో పెడచెవిన పెట్టింది! ఆ హెచ్చరికలను పట్టించుకోలేదు సరి కదా.. ఎన్నికల ర్యాలీలకు.. కుంభమేళా వేడుకలకు.. అడ్డగోలుగా అనుమతులిచ్చేసింది! కరోనా కరాళ నృత్యానికి బాటలు పరిచింది. ఇవి ఎవరో సామాన్యులు చెప్పిన మాటలు కావు. సాక్షాత్తూ సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులార్‌ బయాలజీ (సీసీఎంబీ) మాజీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా. ప్రభుత్వానికి ఈ హెచ్చరిక చేసిన ఇన్సాకాగ్‌ నిపుణుల బృందంలో ఆయన కూడా సభ్యుడు. దేశం మొత్తాన్నీ ప్రమాదంలో పడేసిన మోదీ సర్కారు ప్రాణాంతక నిర్లక్ష్యానికి ప్రత్యక్షసాక్షి. మరిన్ని కొత్త వేరియంట్లు దేశంలో వ్యాపిస్తున్నాయని.. వాటివల్ల దేశవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు, మరణాలు భారీగా పెరిగిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని తాము హెచ్చరించామని ఆయన వెల్లడించారు. ‘మనం ప్రమాదం దిశగా వెళ్తున్నామనే హెచ్చరిక అది’ అని ప్రముఖ జర్నలిస్ట్‌ కరణ్‌థాపర్‌ (ద వైర్‌ వార్తాసంస్థ)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.


వైరస్‌ ఉధృతంగా వ్యాపించే ముప్పు ఉందంటూ తమ ఆందోళనను నేరుగా ఎన్‌సీడీసీ (నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌) డైరెక్టర్‌ డాక్టర్‌ సుజీత్‌కుమార్‌ సింగ్‌కు వెల్లడించామని మిశ్రా తెలిపారు. ‘‘మా ఆందోళన కేంద్ర ఆరోగ్య కార్యదర్శికి చేరి ఉంటుందని భావించాను’’ అని పేర్కొన్నారు. ‘‘ఇన్సాకాగ్‌ అనేది దేశవ్యాప్తంగా ఉన్న పది ప్రభుత్వ ల్యాబొరేటరీలతో కూడిన కన్సార్షియం. దానికి నోడల్‌ ల్యాబ్‌.. ఎన్‌సీడీసీ. అది ఆరోగ్య శాఖకు సంబంధించింది. ఈ కన్సార్షియానికి నిధులు అందిస్తున్నది బయోటెక్నాలజీ విభాగం. అంటే.. ఇది పూర్తిగా ప్రభుత్వ వ్యవహారమే. రోజు విడిచి రోజు మేమంతా సమావేశమయ్యేవాళ్లం. దేశంలో కరోనా పరిణామాలపై చర్చించి, ఆ నివేదికలను ఎప్పటికప్పుడు సమర్పించేవాళ్లం. ఆ సమావేశాలకు బయోటెక్నాలజీ విభాగం ప్రతినిధులు, ఎన్‌సీడీసీ ప్రతినిధులు, పది ల్యాబ్‌ల ప్రతినిధులు.. అంతా కలిపి 20-30 మంది హాజరయ్యేవాళ్లం. జరుగుతున్న పరిణామాలన్నీ మా అందరికీ తెలుసు. మా సమావేశంలో జరిగిన చర్చల సారాంశమంతా ఎన్‌సీడీసీ ద్వారా కేంద్ర ఆరోగ్య శాఖకు అందేది. అంటే.. ప్రతిదశలోనూ సమాచారం ఇన్సాకాగ్‌ నుంచి ప్రభుత్వానికి నిరంతరం అందేది’’ అని స్పష్టం చేశారు. శాస్త్రవేత్తల బృందం ఈ విషయాన్ని నిజంగానే మార్చి మొదటివారంలో ప్రభుత్వానికి తెలియజేసిందా అని కరణ్‌ ధాపర్‌ మరోసారి ప్రశ్నించగా.. కొత్త వేరియంట్లను గుర్తించగానే దానిపై తమ ఆందోళనను ప్రభుత్వానికి తెలియజేశామని రాకేశ్‌ మిశ్రా పునరుద్ఘాటించారు.


విమానాశ్రయంలో ఒకరి నుంచి సేకరించిన నమూనాల్లో, బయట.. యూకే వేరియంట్‌ను గుర్తించామని స్పష్టం చేశారు. తమ సమావేశాల మినిట్స్‌ అన్నీ కేంద్ర ఆరోగ్య శాఖకు తెలుసని చెప్పారు.దీనిపై ధాపర్‌ మరింత గుచ్చిగుచ్చి ప్రశ్నించగా.. ప్రధానికి దీనిపై సమాచారం అందలేదంటే నమ్మలేమని వ్యాఖ్యానించారు. ఇన్సాకాగ్‌ను ఏర్పాటు చేసిందే ప్రభుత్వమని.. ప్రభుత్వానికి సమాచారం అందించడమే దాని పని అని, అలాంటిది ఇంతటి ప్రమాదకరమైన సూచన గురించి సమాచారం ప్రభుత్వాధినేతకు అందలేదంటే నమ్మడం కష్టమని అభిప్రాయపడ్డారు. ఇన్సాకాగ్‌ స్పష్టంగా దేనిగురించి ఆందోళన చెందిందని ప్రశ్నించగా.. అన్ని వేరియంట్లూ విస్తృతంగా వ్యాపిస్తాయని తాము ఆందోళన చెందామని, మరణాలు పెద్ద సంఖ్యలో ఉంటాయని అంచనా వేశామని చెప్పారు. వ్యాప్తి ఎంత ఎక్కువగా ఉంటే  వైర్‌సలో అంత ఎక్కువగా ఉత్పరివర్తనాలు జరిగి కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని.. ఫలితంగా అవి ఎక్కువగా వ్యాప్తి చెందే గుణాన్ని కలిగి ఉండడమే కాక, రోగనిరోధక శక్తికి లొంగని గుణం కూడా కలిగి ఉంటాయని ఊహించామని చెప్పారు. దీనివల్ల టీకా కార్యక్రమానికి కూడా ముప్పు ఉంటుందని భావించామని.. కానీ, అదృష్టవశాత్తూ అలా జరగలేదని చెప్పారు. ఎందుకంటే.. ఒక డోసు తీసుకున్నవారికి వైరస్‌ సోకినప్పుడు అది రక్షణ వ్యవస్థలను ఛేదించడానికి ప్రయత్నిస్తుందని, మెజారిటీ సందర్భాల్లో వైరస్‌ విఫలమైనా, కొన్ని సఫలమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే.. ఇప్పటికే మొదటి దశలో వైరస్‌ సోకి యాంటీబాడీలు తయారైనవారికి కొత్త వేరియంట్లు సోకితే, అవి కూడా రోగ నిరోధక వ్యవస్థను దాటి ఇన్ఫెక్ట్‌ చేయడానికి ప్రయత్నిస్తాయని.. అలాంటి సందర్భాల్లో పుట్టే కొత్త వేరియంట్లు మరింత ప్రమాదకరంగా మారే ముప్పుందని తెలిపారు.

ఇది కూడా చదవండి: కరోనా కథ ముగిసిందట.. ఇకపై మాస్కులు అక్కర్లేదట.. బీజేపీ నేతల వింత వ్యాఖ్యలెన్నో..!



స్పష్టంగా చెప్పాం..

కొత్త వేరియంట్లు, సెకండ్‌వేవ్‌ ముప్పు గురించి ఎన్‌సీడీసీ డైరెక్టర్‌ సుజీత్‌కుమార్‌ సింగ్‌ ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించారంటూ మూడు రోజుల క్రితం రాయ్‌టర్స్‌లో వచ్చిన కథనాన్ని ప్రస్తావించగా.. దాన్ని సందేహించడానికి కారణాలేవీ లేవని మిశ్రా స్పష్టం చేశారు. ‘‘కఠినమైన చర్యలు తక్షణం తీసుకుంటే  తప్ప మరణాల రేటును నిరోధించడం కుదరదని స్పష్టంగా, ప్రముఖంగా తెలిపాం’ అని సుజీత్‌ కుమార్‌ పేర్కొన్నట్టుగా రాయ్‌టర్స్‌ తన కథనంలో వెల్లడించింది. అయినా కూడా ప్రభుత్వం స్పందించకపోవడంపై ఎంతగానో చింతించానని రాకేశ్‌ మిశ్రా తెలిపారు. ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదా అని కరణ్‌ధాపర్‌ గుచ్చిగుచ్చి ప్రశ్నించగా.. ‘చేయాల్సినంత చేయలేదు’ అని సమాధానమిచ్చారు. ఆర్టీపీసీఆర్‌ పరీక్షలను పెంచుతామని పదేపదే ప్రకటించిందని.. తమ ఆందోళనకు ప్రభుత్వ స్పందన అదేనని వెల్లడించారు. ‘‘పెళ్లిళ్లకు 50 మందిని ఎందుకు అనుమతించాలి? ఐదుగురైతే చాలు కదా?’’ అని మిశ్రా వ్యాఖ్యానించారు. సమస్య ఎంత పెద్దదో, ప్రమాదకరమైనదో గుర్తించడంలో వ్యవస్థ విఫలమైందని ఆవేదన వెలిబుచ్చారు. శాస్త్రవేత్తల బృందం హెచ్చరించాక  జరిగిన పరిణామాల గురించి కూడా కరణ్‌ధాపర్‌ ప్రస్తావించి ప్రశ్నించారు. ‘‘పశ్చిమబెంగాల్‌, కేరళ, తమిళనాడు, అసోంలో వేలాది, లక్షలాది మందితో ఎన్నికల ర్యాలీలు నిర్వహించడం ఎంతవరకూ సమంజసం? కుంభమేళాలో ఏప్రిల్‌, మార్చిలో కోట్లాది 20-30 లక్షల మంది షాహీస్నానాలు చేయడం సరైనదేనా?’’ అని కరణ్‌ ధాపర్‌ అడగ్గా..  అది ఎంతమాత్రమూ అంగీకారయోగ్యం కాదని ఆయన తేల్చిచెప్పారు. అలాంటివాటిని వాయిదా వేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.


రెండు వ్యాక్సిన్లూ భేష్‌

దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కొత్త వేరియంట్ల గురించి ప్రశ్నించగా.. పంజాబ్‌లో 80-90ు, ఢిల్లీలో 40ు కేసులకు బి.1.1.7 వేరియంటే కారణమని రాకేశ్‌ మిశ్రా తెలిపారు. డబుల్‌ మ్యుటెంట్‌గా వ్యవహరిస్తున్న బి.1.617 వేరియంట్‌ తొలినాళ్లలో వ్యాపించిన కరోనా వైరస్‌ కన్నా వేగంగా ఇతరులకు సోకుతుందిగానీ.. బి.1.1.7తో పోలిస్తే దాని ఇన్ఫెక్షన్‌ తీవ్రత తక్కువని చెప్పారు. ప్రస్తుతం దేశంలో ఇస్తున్న కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాలు రెండూ ఈ రెండు వేరియంట్లనూ సమర్థంగా అడ్డుకుంటున్నట్టు చెప్పారు.


మంత్రులే అలా మాట్లాడితే..

అసోం ప్రజలు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదంటూ ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావించగా.. మాస్కులు ధరించవద్దంటూ మంత్రులే చెప్పడం ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని రాకేశ్‌ మిశ్రా అన్నారు. ఇక.. ‘దేవుడిపై విశ్వాసం, గంగామాత శక్తి షాహీస్నానాలు భక్తులను కాపాడుతాయి’ అంటూ ఉత్తరాఖండ్‌ సీఎం చేసిన వ్యాఖ్యలను కూడా మిశ్రా ఖండించారు. అన్నింటికీ మించి.. ఏప్రిల్‌ 17న.. రోజుకు 2,60,000 కేసులు నమోదవుతున్న దశలో..  పశ్చిమబెంగాల్‌లో తన ఎన్నికల సభకు భారీగా ప్రజలు రావడం ఆనందం కలిగిస్తోందంటూ ప్రధాని మోదీ మాట్లాడడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అది చాలా దురదృష్టకరమన్నారు. ‘‘అసలు అలాంటి సభలను రద్దు చేసుకోవాలి. అలాంటి సభలు నిర్వహిస్తే కొద్దివారాల్లోనే వాటి పర్యవసానాలను కూడా చూడాల్సివస్తుంది’’ అన్నారు.


భారీ ఎన్నికల సభలకు, వైరస్‌ వ్యాప్తికి సంబంధం లేదంటూ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా బెంగాల్‌ ఎన్నికల ప్రచార సమయంలో చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావించగా.. ‘ఆయనకు సరైన సమాచారం, ఫీడ్‌బ్యాక్‌ అందలేదు’ అని మిశ్రా సమాధానమిచ్చారు. బెంగాల్‌లో రాజకీయ హింసకు వ్యతిరేకంగా మే 5న బీజేపీ దేశవ్యాప్త ధర్నాకు పిలుపివ్వడాన్ని భయంకరమైన తప్పిదంగా ఆయన అభివర్ణించారు. ‘‘ఇలాంటి సమయాల్లో ప్రజల ప్రాణాలను కాపాడడమే అత్యున్నత ప్రాధాన్యం కావాలి. కావాలంటే మన ‘లెక్కలు’ మనం తర్వాత సరిచూసుకోవచ్చు’’ అని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయాలంటే.. భారీ లాక్‌డౌన్‌లాంటి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రాకేశ్‌ మిశ్రా తేల్చిచెప్పారు.


ఇది కూడా చదవండి: కరోనా కట్టడిలో బెస్ట్, వరస్ట్ దేశాల లిస్ట్ ఇదీ.. భారత్ ఏ జాబితాలో ఉందంటే..

Updated Date - 2021-05-07T07:42:20+05:30 IST