ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటండి

ABN , First Publish Date - 2021-03-05T07:03:12+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌తోపాటు హెచ్‌ఎండీఏ పరిధిలోని ఖాళీ స్థలాలన్నింటిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని అధికారులను సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు.

ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటండి
అధికారులతో కలిసి స్థలాలను పరిశీలిస్తున్న సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

అధికారులకు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆదేశం

నగరంలో పలు ప్రాంతాల్లో పరిశీలన 

హైదరాబాద్‌ సిటీ, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌తోపాటు హెచ్‌ఎండీఏ పరిధిలోని ఖాళీ స్థలాలన్నింటిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని అధికారులను సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. నగరంలో పచ్చదనం పెంపుకోసం బీఆర్‌కే భవన్‌, ఎమ్మెల్యే క్వార్టర్స్‌, గన్‌పార్క్‌, లకీకపూల్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌, ఫిలింనగర్‌, షేక్‌పేట్‌ దర్గా, గచ్చిబౌలి, రాయదుర్గం, మెహిదీపట్నం, మాసబ్‌ట్యాంక్‌ మార్గాల్లో ఖాళీ స్థలాలను వివిధ శాఖల అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. ఖాళీ స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాలు, రహదారులకు ఇరువైపులా, చెరువులు, కుంటల గట్లపై పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టాలన్నారు. నగరాన్ని శాటిలైట్‌ మ్యాప్‌ ద్వారా సెక్టార్లుగా విభజించి ఆయా సెక్టార్లలో ఉన్న ఖాళీ స్థలాలన్నింటిలోనూ మొక్కలు నాటాలని, ఇందుకుగాను సెక్టార్ల వారీగా అర్బన్‌ బయోడైవర్సిటీ, టౌన్‌ ప్లానింగ్‌ తదితర శాఖల అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. పలు ప్రాంతాల్లో నిర్మిస్తున్న లింక్‌ రోడ్లకు ఇరువైపులా అందమైన మొక్కలను నాటాలని, రహదారుల వెంట మూడు వరుసల్లో పూల మొక్కలు, ఆకర్షణీయంగా ఉండే విధంగా నాటాలని తెలిపారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి ఆదర్శనగర్‌ మీదుగా కంట్రోల్‌ రూమ్‌కు వెళ్లే రహదారి ఇరువైపులా మరింత ఆహ్లాదకరంగా ఉండే రీతిలో పూల మొక్కలను నాటాలన్నారు. రాయదుర్గం చెరువును మరింత సుందరీకరించాలని, చెరువు చుట్టూ, వచ్చిపోయే మార్గాల్లో మొక్కలు నాటాలన్నారు. మాసబ్‌ ట్యాంక్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఉన్న ఖాళీ స్థలంలో ఆహ్లాదకరమైన గార్డెనింగ్‌ మొక్కలను నాటాలని సూచించారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌, మునిసిపల్‌ పరిపాలన శాఖ డైరెక్టర్‌ సత్యనారాయణ, సీసీఎఫ్‌ డోబ్రియల్‌, అటవీ శాఖ, హెచ్‌ఎండీఏ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-05T07:03:12+05:30 IST