ఆర్‌టీఐపై ఇచ్చిన ఆదేశాలు ఉపసంహరించుకున్న ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-12-15T01:29:47+05:30 IST

సమాచార హక్కు చట్టం ద్వారా వచ్చే ఫిర్యాదులకు యూఆర్‌టీఐ’ అనే వెబ్‌సైట్ సురక్షితంగా, సులభంగా, ఉచితంగా సమాచారం అందిస్తోంది. ఆర్‌టీఐ అనేది ఎలాంటి లాభపేక్ష లేని సంస్థ. ప్రభుత్వ పనితీరుపై ప్రజలకు సమాధానం చెప్పడం ప్రభుత్వ బాధ్యత..

ఆర్‌టీఐపై ఇచ్చిన ఆదేశాలు ఉపసంహరించుకున్న ప్రభుత్వం

హైదరాబాద్: సమాచార హక్కు చట్టం కింద సమాచారం అందించే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులు ఇక నుంచి సదరు ప్రిన్సిపల్ సెక్రెటరీ లేదంటే సంబంధిత డిపార్ట్‌మెంట్ అధిపతికి సమాచారం అందించిన తరువాతనే పిటిషన్‌కు సమాధానం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేష్ కుమార్ 13 అక్టోబర్ న జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు. కాగా, హైకోర్టు జోక్యంతో ఆ ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. సీఎస్ సోమేష్ కుమార్ ఇచ్చిన ఆదేశాలపై యుగాంతర్ అనే వ్యక్తి అక్టోబర్ 27న హైకోర్టు ఆదేశించారు.


హైకోర్టులో వేసిన పిటిషన్‌లో ‘‘సమాచార హక్కు చట్టం ద్వారా వచ్చే ఫిర్యాదులకు యూఆర్‌టీఐ’ అనే వెబ్‌సైట్ సురక్షితంగా, సులభంగా, ఉచితంగా సమాచారం అందిస్తోంది. ఆర్‌టీఐ అనేది ఎలాంటి లాభపేక్ష లేని సంస్థ. ప్రభుత్వ పనితీరుపై ప్రజలకు సమాధానం చెప్పడం ప్రభుత్వ బాధ్యత. అంతే కాకుండా దేశంలోని ప్రభుత్వాల పాలన గురించి ప్రశ్నించడం, ఆడిట్ వివరాలు తెలుసుకోవడం, ప్రభుత్వ పనితీరు సమీక్షించడం, పరిశీలించడం వంటివి తెలుసుకోవడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) కింద భారత ప్రజలకు కల్పించిన ప్రాథమిక హక్కు. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు పార్లమెంటరీ చట్టాన్ని పలుచన చేస్తోంది. ఈ చట్టంలో ఏవైనా సవరణలు చేయాలంటే పార్లమెంట్‌కు మాత్రమే అధికారాలు ఉన్నాయి’’ అని యుగాంతర్ పేర్కొన్నారు.


ఇంతే కాకుండా ఆర్‌టీఐ నుంచి అందించే సమాచారం స్థానిక భాషలో, రికార్డు చేసేందుకు సులభంగా, వీలైనంత తొందరలో పంపిచేలా చూడాలని, అయితే ప్రభుత్వం దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని పిటిషన్‌లో యుగాంతర్ ఆరోపించారు. కాగా, యుగాంతర్ వేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. సీఎస్ సోమేష్ కుమార్‌ జారీ చేసిన ఆదేశాలపై స్టే విధించింది. విచారణను డిసెంబర్ 14కు వాయిదా వేసింది. అయితే తదుపరి విచారణకు ముందే సదరు ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు హైకోర్టుకు సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు.

Updated Date - 2021-12-15T01:29:47+05:30 IST