ఉద్యోగ సంఘాల నేతలతో సీఎస్ సమావేశం

ABN , First Publish Date - 2021-12-06T02:01:35+05:30 IST

తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదివారం సమావేశమయ్యారు.

ఉద్యోగ సంఘాల నేతలతో సీఎస్ సమావేశం

హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదివారం సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సూచనల మేరకు టీజీవో, టీఎన్జీవో నేతలతో రాష్ట్రపతి ఉత్తర్వులు-2018 ప్రకారం జిల్లాలు, జోన్ లు, మల్టీ జోన్ల వారీగా, వివిధ శాఖల వారీగా పోస్టులు, ఉద్యోగుల కేటాయింపు పై  సమావేశంలో చర్చించారు. ఉమ్మడి జిల్లాల పరిధిలో కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు స్థానిక కేడర్‌ల వారీగా పోస్టులు, ఉద్యోగుల కేటాయింపుపై విషయం పై ఉద్యోగ  సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. 


ఉద్యోగులందరికీ క్యాడర్‌ ల వారిగా ఆప్షన్స్ ఇచ్చి, కేటాయింపు అవకాశం కల్పిస్తామని ఈ సందర్బంగా సీఎస్ సోమేశ్ కుమార్ హామీ ఇచ్చారు. ఈ ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉద్యోగ సంఘాల నేతలతో పాటు ప్రభుత్వంచే గుర్తింపు పొందిన జిల్లా స్థాయి ఉద్యోగుల సంఘాలను కూడా కేటాయింపు సమయంలో ఆహ్వానించనున్నట్లు తెలిపారు.ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో లేని జిల్లాల్లో మొదటి దశలో పోస్టులు, ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ చేపట్టనున్నట్టు సీఎం తెలిపారు. 


మిగిలిన జిల్లాల్లో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ఎత్తివేసిన తర్వాత చేపడతామన్నారు.ఈ సమావేశంలో సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, స్టాంపులు, రిజిష్ట్రేషన్ల సీఐజి శేషాద్రి, ఆర్ధిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, టీజీవో రాష్ట్ర ప్రెసిడెంట్ మమత, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు రాజేందర్, ప్రతినిధులు తదితరులు  పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-06T02:01:35+05:30 IST